నాగర్‌కర్నూల్, ఆగస్టు 22 : ఓవైపు యూరియా అందక, తమ పంటలను ఎలా రక్షించుకోవాలో తెలియక రైతులు పొద్దస్తమానం పీఏసీసీఎస్ కార్యాలయాల వద్ద, ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు కాస్తుంటే మరో వైపు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు దర్జాగా విక్రయాలు చేస్తున్నారు కొందరు ఫర్టిలైజర్ దుకాణాదారులు. ఏకంగా బహిరంగంగా ప్రధాన కూడలిలో లారీని నిలిపి ఎలాంటి ఆధారాలు తీసుకోకుండా అధిక ధరలకు విక్రయించి ఘటన శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకున్నది.
శుక్రవారం సాయంత్రం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఓ ఫర్టిలైజర్ దుకాణం యజమాని ఏకంగా లారీలోడ్ యూరియాను ప్రధాన కూడలి వద్ద నిలిపి అక్కడి నుంచే ఆటోలు, ట్రాక్లర్లకు, జీపులకు ఎక్కించడం కనిపించింది. ఒక బస్తా యూరియా రూ.267 ఉం డగా, పెద్దకొత్తపల్లిలో శుక్రవారం సాయంత్రం బ్లాక్మార్కెట్లో బహిరంగంగా రూ.400 ఒక బస్తా విక్రయించినట్లు రైతులు తెలిపారు. పెద్దకొత్తపల్లి మం డల కేంద్రంలోని అరుణోదయ ఫర్టిలైజర్ దుకాణ యాజమాన్యం రైతుల కోసం లారీ యూరియాను తెప్పించారు.
అయితే స్టాక్‌ను దుకాణంలో అన్లోడ్ చేసుకొని డీబీటీ మిషన్‌లో నమోదు చేసిన అనంతరం రైతు ఆధార్‌కార్డు, పాస్‌బుక్ జిరాక్స్‌తోపాటు వేలిముద్ర తీసుకొని గరిష్ఠ ధర రూ.267 అమ్మాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అక్కడ ఉన్న డిమాండ్, రైతుల అవసరాన్ని గుర్తించిన సదరు ఫర్టిలైజర్ దుకాణం యజమాని అధిక ధర రూ.400 బస్తా విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఈ సంఘటనపై స్థానిక వ్యవసాయాధి కారులకు సమాచారం తెలిసేలోపే దాదాపు సగం లారీ యూరియాను అధిక ధరలకు అమ్ముకున్నారు. ఆలస్యంగా అక్కడికి చేరుకున్న మండల వ్యవసాయాధికారులు లారీని స్వాధీనం చేసుకొని ఉన్న యూరియా స్టాక్‌ను సీజ్ చేశారు.