Water Crisis | మక్తల్, ఏప్రిల్ 1 | నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఉప్పరపల్లి గ్రామస్తులు తాగునీటి కోసం ఆందోళన చేపట్టారు. వేసవికి ముందే గ్రామంలో మంచినీటి ఎద్దడితో సమస్యలను పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసనకు దిగిన సంఘటన మంగళవారం ఉదయం మక్తల్ మండలం ఉపరపల్లి చోటుచేసుకుంది. గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రతరంగా ఉన్నదని సంబంధిత పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. తాగునీటి సమస్య కోసం ఎన్నిసార్లు నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ, గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.
గతంలో ఏ ఒక్కరోజు గ్రామంలో నీటి సమస్య ఉండేది కాదని.. మిషన్ భగీరథ నుంచి గ్రామంలో తాగునీటి కోసం నిరంతరం నీటి సరఫరా వచ్చేది తెలిపారు. ప్రస్తుతం తాగడానికి గుక్కెడు మంచినీళ్లు, కావాలంటే వ్యవసాయ పొలాల చుట్టూ ఉన్నటువంటి బోర్ల వైపు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వాపోయారు. గ్రామంలో నీటి సమస్యపై అధికారులు స్పందించకుండా ఉండడంతో తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి ప్రారంభంలో నీటి సమస్య ఇలా ఉంటే.. రాబోయే రెండు నెలల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపర్పల్లి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో గ్రామ ప్రజల అందరం కలిసి నీటి సమస్యను అధికారులు పరిష్కరించకపోతే నారాయణపేట రోడ్డ పై భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి వెనకాడబోమని హెచ్చరించారు.