దామరగిద్ద, ఏప్రిల్ 21 : మండలంలోని వత్తుగుండ్లలో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన పంటల్లో వడ్లు, మామిడి తోటల్లో మామిడి కాయలు నేలరాలడంతో రైతులకు తీవ్ర నష్టం వాటింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతలో పెద్ద ఎత్తున గాలివీచడంతోపాటు వడగండ్ల వర్షం కురిసింది. వారం రోజుల్లో కోయడానికి వచ్చిన వరి పంట గింజలు రాలి తీవ్ర నష్టం జరిగిందని రైతు నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పలు మామిడి తోటల్లో సైతం మామిడికాయలు నేలరాలడంతో తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటనష్టం జరిగిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కొట్టుకుపోయిన మొక్కజొన్న
మిడ్జిల్, ఏప్రిల్ 21 : రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యానికి తోడు అకాల వర్షాలకు రైతులు ఆగమవుతున్నారు. మండలంలో మొక్కజొన్న కొనుగోలును ప్రభుత్వం ఆలస్యంగా ప్రారంభించింది. రోజుకు కొంత మందికి సంబంధించిన ధాన్యమే తీసుకుంటుండ డంతో రైతులు మిగితా మక్కలను రోడ్డుపై ఆరబెట్టారు. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి మొత్తమంతా తడిసి కొట్టుకుపోయింది. తడవకుండా ఉండేందుకు రైతులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
మూసాపేట మండలంలో అపార నష్టం
మూసాపేట, ఏప్రిల్ 21 : అన్నదాతలు రేయనక పగలనక కష్టపడి పంటలు పండిస్తే ఆ పంటలు చేతికందే సమయంలో అకాల వర్షాలు రైతులను తీవ్ర నష్టాల్లోకి నెడుతున్నాయి. మూసాపేట మండల కేంద్రంతో పాటు, చక్రాపూర్, జానంపేట, సంకలమద్ది, నిజాలాపూర్, తుంకినీపూర్, అచ్చాయిపల్లి తదితర గ్రామాల్లో మంగళవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అయితే రైతులు కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యంనున్యాన్నికు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. కొంత మంది రైతుల ధాన్యం వర్షానికి తడిసి వరదకు కొట్టుకుపోగా మరో వైపు కోతకు వచ్చిన వరి చేళ్లలో వడ్లు మొత్తం నేలరాలి పోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
రాజాపూర్‌లో ఈదురు గాలులతో వర్షం
బాలానగర్ (రాజాపూర్), ఏప్రిల్ 21: రాజాపూర్ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఈదురు గాలులు, వర్షం కారణంగా జాతీయ రహదారిపై దారి కనిపించక వాహనదారులు అవస్థలు పడ్డారు. ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షం కారణంగా పలుచోట్ల చెట్లు నేలకొరగడంతో వాహనాలు వెళ్లలేక ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈదురు గాలుల కారణంగా రాజాపూర్ వంతెనపై ఓ వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రాజశేఖర్, పోలీసులు క్రేన్ సాయంతో రహదారిపై బోల్తాపడిన వాహనాన్ని పక్కకు తొలగించారు.