మహబూబ్‌నగర్ విద్యావిభాగం, అక్టోబర్ 21 : పాలమూరు యూనివర్సిటీని దే శంలోనే అత్యుత్తమ వర్సిటీగా తీర్చిదిద్దుతామని, బోధన, పరిశోధన, అభివృద్ధి రంగాలకు ప్రాధాన్యమిస్తామని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జీఎన్.శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. సోమవారం ఆయనతో ‘నమస్తే తెలంగాణ’ నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. వీసీ అంటే వ్యవస్థలో ఒక భాగం.. వైస్ చాన్స్‌లరే వ్యవస్థ కాదని.. బో ధన, బోధనేతర సిబ్బంది, జిల్లా అధికార యంత్రాంగం, నాయకులతో కలిసికట్టుగా ముందుకు సాగుతానని తెలిపారు.
ఈ మూడేండ్ల పదవీ కాలం పూర్తయ్యేలోగా యూ నివర్సిటీని ఉన్నతస్థాయికి తీసుకెళ్తామన్నారు. ముఖ్యంగా యువతలో నైపుణ్యాల అభివృద్ధి, మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధి చూపే అంశాలపై దృష్టిసారిస్తామని తెలిపారు. మెరుగైన విద్యను అందించడంతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఉం టుందన్నారు. బోధనేతర ఖాళీల భర్తీకి కృషి చేస్తాం.. అన్ని రంగాల్లో కష్టాలు, అడ్డంకులు ఉంటాయని వాటిని అధిగమించేందుకు చర్యలు చేపట్టడంతోపాటు విద్యార్థు లు, సిబ్బంది సమస్యలు, అవసరాలు తెలుసుకొని పరిష్కరిస్తానని పేర్కొన్నారు.
ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మన పాలమూరు వాసులే ఉంటారు. అటువం టి పాలమూరుకు నేను వైస్ఛాన్స్లర్గా రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. యూనివర్సిటీలో మధ్య తరగతి, పేద వర్గాలవారే ఎక్కువ. మినిమం ఫెసిలిటీస్ క ల్పించేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తా. ప్రశాంతమైన వాతావరణంలో విద్య, నాణ్యమైన పౌష్టికాహారం అందించడం, చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో రాణించేలా కృషిచేస్తా. పరిశోధనలతోపాటు ఎక్స్ట్రాకరికూలమ్ యాక్టివిటీస్ సెమినార్స్, వర్క్‌షాప్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, పోటీ పరీక్షల్లో విజయానికి కావాల్సిన శిక్షణలు ఇవ్వడం, విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేలా చేయడమే మొదటి ప్రాధాన్యత.
కాలానికి అనుగుణంగా ఉన్న కోర్సుల్లో మార్పులు చేయడం, కొత్తవి ప్రవేశపెట్టడం కోసం విషయ నిపుణులతో ఎప్పటికప్పుడు ఆలోచనలు చేస్తా. నూతనంగా ప్రవేశ పెట్టిన కోర్సులతో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏ మేరకు లభిస్తాయనే విషయాలన్నింటినీ క్రోడీకరించి అందుకు అనుగుణంగా అవసరాన్ని బట్టి కోర్సులు రూపొందిస్తాం. సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థుల ఉన్నతికి కావాల్సిన చదువుతోపాటు సంస్కారం నేర్పించే కోర్సుల ఏర్పాటుకు చర్యలు చేపడతాం.
నమస్తే తెలంగాణ : పీయూ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ విద్యా సంవత్సరంలో రూ.వందకోట్లకు పైనే ప్రతిపాదనలు పంపించినా.. ప్రత్యేక నిధులు ఒక్కపైసా కూడా విడుదల చేయలేదు. ఆర్థిక పరిస్థితులను ఎలా అధిగమిస్తారు?
ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటాం. యూనివర్సిటీ అకాడమిక్, పరిపాలన, మౌలిక సదుపాయాల పరంగా అన్ని రంగాల్లో పీయూ అభివృద్ధి చెందేలా కృషిచేస్తాం. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా, జేఎన్టీయూ వర్సిటీల్లో పనిచేసిన అనుభవం ఇక్కడ ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో పనిచేసిన రిజిస్ట్రార్స్, వైస్ఛాన్స్లర్స్ వారి సహాయ సహకారాలు తీసుకుంటాం. ప్రజాప్రతినిధులు, నాయకుల కోఆర్డినేషన్‌తో పీయూకు అధిక నిధుల సమీకరణకు కృషిచేస్తాం.
నమస్తే తెలంగాణ : అత్యవసర వైద్యం అందని ద్రాక్షగానే మారింది. రెగ్యులర్ వైద్యుడు, సిబ్బంది లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.. మీరేం చేస్తారు?
విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువులో క్రీడల్లోనూ రాణించగల్గుతారు. ఇం దుకు అనుగుణంగా వారి ఆరోగ్య సంరక్షణ, శ్రేయస్సులో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేదిలేదు. అన్ని రకాలైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచుతాం. అత్యవసర వైద్య సేవలకు అవసరమైన అంబులెన్స్ సౌకర్యం కల్పించేందుకు కృషిచేస్తాం.
నమస్తే తెలంగాణ : బోధనేతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నది. రెగ్యులర్ ఉద్యోగులు లేకపోవడంతో తాత్కాలిక సిబ్బందితోనే కొనసాగిస్తున్నారు. వారు సైతం చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారు.. వాస్తవమేనా?
టీడీపీ హయాంలోనే బోధనేతర సిబ్బంది నియామకాలపై ఆంక్షలు ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఇదే సమస్య ఉన్నది. పనిచేస్తున్న వారు రిటైర్మెం ట్ అవుతున్నారే కానీ కొత్తగా ఎవరినీ తీసుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కృషిచేస్తాం. బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించి నా పరిధిలో పరిష్కరించే వాటన్నింటికీ వందశాతం పరిష్కారం చూపిస్తాను.
నమస్తే తెలంగాణ : క్రీడల నిర్వహణకు ప్రత్యేకంగా సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేసినా.. అథ్లెటిక్ కోచ్ లేరు. కేవలం ఒక ఫిజికల్ డైరెక్టర్‌తో క్రీడావిభాగాన్ని కొనసాగిస్తున్నారు. వివిధ కేటగిరీల్లో కోచ్‌ల అవసరం ఉన్నది.. దీనిపై మీ అభిప్రాయం?
చదువుతోపాటు క్రీడలకూ సమప్రాధాన్యత ఇస్తాం. సింథటిక్ ట్రాక్ పూర్తిస్థాయిలో పెవిలియన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. వాటి పనులు పూర్తయ్యాక వివిధ కేటగిరీల్లో శిక్షకుల నియామకాలకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదిస్తాం. పాలమూరు క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన ప్రణాళికలతో ముందుకు సాగుతాం.
యువత ఏదైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం ముఖ్యం. చెడువ్యసనాలకు దూ రంగా ఉండాలి. చదువుకోవాలనే కోరిక నిరంతరం రగులుతూ ఉండాలి. రోజూ అ భ్యసనం ముఖ్యం. పరీక్షల సమయంలోనే చదివి ఉత్తీర్ణులవ్వాలనే తీరు మార్చుకోవాలి. నిర్దేశించుకున్న లక్ష్యం ఎదుట కష్టాలు, సమస్యలు చాలా చిన్నవి.. సమస్యలు పెద్దవిగా ఊహించుకుంటే లక్ష్యం నీరుగారిపోతుంది. కష్టపడినప్పుడే విజయం వరిస్తుంది. కష్టేఫలి అన్నది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి.