పాలమూరు, జూన్ 6: మత్స్యశాఖ నిర్లక్ష్య ధోరణితో మత్స్యకారులను చేపపిల్లల కొరత వెంటాడుతొంది. ఉ మ్మడి జిల్లాలో పుష్కలంగా నీటి వనరులున్నా చేపపిల్లల ఉత్పత్తి లేకపోవడంతో మత్య్సకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చేపపిల్లల పంపిణీ కోసం టెండర్లు పిలిస్తే ఆసక్తి గల కాంట్రాక్టర్లు పాల్గొనకపోవడంతో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉత్పత్తి కేంద్రాల వద్ద ఏర్పాటుతోపాటు పెంపకానికి ప్రభుత్వం సహకారం అందిస్తు న్నా ఆసక్తి కనిపించడం లేదు. ఫలితంగా మత్య్సకారుల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని అమ లుచేస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీఅబాసుపాలవుతోంది.
నీటితో కళకళలాడుతన్న చెరువులు, కుంటలు ఇతర జలశాయాల్లో ఉచితంగా చేపపిల్లలు వదిలి మత్య్సకారులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన పథకం ఆశించిన స్థాయిలో అమలు కాకపోవడంతో అసంతృప్తికి గురిచేస్తుంది. ఉమ్మడి జిల్లాలో గతేడాది దాదాపు 9 కోట్ల చేపపిల్లలు ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉండగా చేపపిల్లల కొరతతో 50 శాతం కూడా లక్ష్యాన్ని చేరుకోకపోవడం గమనార్హం. ఉచిత చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఇతర ప్రాంతాల నుంచి ఇచ్చి టెండర్లలో పాల్గొంటున్నారు. తెలంగాణలో చేపపిల్లలను ఉత్పత్తి చేసే టెండరుదారులు మాత్రం ఆసక్తి చూపడం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉచిత చేపపిల్లల పంపిణీ నామమాత్రంగా ఉండటంతో వృత్తిని నమ్ముకొని బతుకుతున్న మత్య్సకారుల్లో నిరాశ నెలకొంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టు, కోయిల్‌సాగర్, సరళసాగర్, కల్వకుర్తి ఎత్తిపోతలతో పాటు వివిధ జలశయాల వద్ద చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఆసక్తి ఉన్న మత్య్సకారులను ప్రోత్సహిస్తే ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే అవకాశముంది. మత్స్యరంగాన్ని బలోపేతం చేయాల్సిన మత్య్సశాఖ అధికారులు, ప్రైవేట్ కాంట్రాక్టర్లకే ప్రాధాన్యం ఇస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రతి ఏడాది ఉమ్మడి జిల్లాలో అవసరమున్న 9కోట్ల చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం రూ.16.50కోట్లు వరకు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి. అదే ఇక్కడి మత్య్సకారులే ఉత్పత్తిదారులుగా తయారైతే ఆర్థికంగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది.
ఉమ్మడి జిల్లాలో పుష్కలంగా నీటి వనరులున్నా చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం ప్రోత్సహం అందిస్తున్నా పథకాలను సద్వినియోగం చేసుకునేందుకు మత్య్సశాఖ తరపున ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదని విమర్శలు ఉన్నాయి.
జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ సమీపంలో దాదాపు 20 ఎకరాలలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అచ్చంపేట మండలం చంద్రసాగర్‌లో 14 లక్షల చేపపిల్లల సామర్థ్యం కలిగిన పెంపకం కేంద్రం నిరుపయోగంగా మారింది. ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లిలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం వద్ద 12 ఏళ్ల క్రితం మూతపడింది.వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళాసారగ్ వద్ద చేపపిల్లల పెంపకం కేంద్రాన్ని పెబ్బేరు మత్య్సకళాశాల విద్యార్థులు అవగాహన కోసం నిర్వహిస్తున్నారు.
ఇందులో దాదాపు 20వేల చేపపిల్లలను పెంచుతున్నారు.గద్వాల జిల్లా జములమ్మ రిజర్వాయర్ వద్ద నిరుపయోగంగా ఉన్న చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని తొలగించి, ఆలయ అవసరాల కోసం నిర్మాణాలు చేపట్టారు. దేవరకద్ర మండలం కోయిలసాగర్ వద్ద కోటి చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఉన్నా ప్రస్తుతం 60లక్షల చేపలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఉత్పత్తికి మరమ్మతు చేపట్టాల్సి ఉంది. పిల్లలమర్రిలో ఉన్న ఉత్పత్తి కేంద్రం నిరుపయోగంగా మారింది.
జిల్లాలో రెండు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నా యి. అందులో పిల్లలమర్రి ఉత్పత్తి కేంద్రంలో చేపపిల్లల ఉత్పత్తి జరగడం లేదు. కోయిల్‌సాగర్‌లో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో మాత్రమే సగం ఉత్పత్తి మాత్రమే జరుగుంది. ఈ కేంద్రంలో మరమ్మతు చేపట్టి పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో అస్యూర్డ్ వాటర్ లేనందున కొత్త దరఖాస్తులు రావడం లేదు.
– రాధారోహిణి, జిల్లా మత్య్సశాఖ అధికారిణి