సమైక్య పాలనలో సంక్షోభంతో ఉపాధి కరువై జనం పట్నం బాట పట్టారు.. బతుకు బరువై ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయి. వ్యవసాయం, ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వడంతో సాగునీరు పుష్కలమై సాగు సంబురమైంది. ఎకరం భూమి ఉన్న రైతన్నలూ గుండెనిండా భరోసాతో కూరగాయలు, ఇతర పంటలు పండిస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైతులపై కాంగ్రెస్ పగబట్టినట్లు మాట్లాడుతున్నది. గెలుపు కోసం సాధ్యంకాని హామీలను సైతం గుప్పిస్తున్నది. రేవంత్‌రెడ్డితోపాటు పలువురు నేతలు చేస్తున్న ప్రకటనలు మళ్లీ నాటి చీకటి రోజులను గుర్తుకు తెస్తున్నాయి. కాంగ్రెస్ విధానాలు అభివృద్ధికి వినాశకాలుగా మారనున్నాయి. వ్యవసాయ రంగం కుదేలై ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. భూముల ధరలు పడిపోయి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ భ్రష్టుపట్టే అవకాశం ఉన్నది. ఉపాధి కరువై రైతులు కూలీలుగా మారడంతోపాటు మళ్లా పట్నం బాట పట్టే అవకాశం లేకపోలేదు. మాగాణుల్లా మారిన భూములు మళ్లీ నెర్రెలు బారి రాష్ట్రంతోపాటు పాలమూరు గతం మాదిరి దుర్భిక్షంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నాగర్‌కర్నూల్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. గ్రామాలన్నీ పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. పూరి గుడిసెల స్థానంలో భవనాలు వెలిశాయి. భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. వరి సాగుతో దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ మారింది. సాగునీరు పారింది.. పంటలు పండాయి.. గ్రామాలు పచ్చబడ్డాయి.. రోడ్లు వచ్చాయి.. దీంతో గతంలో వలసలు వెళ్లిన వారంతా సొంతూళ్లకు తిరిగొచ్చారు. వ్యవసాయ పనులు చేసేందుకు ఇతర రాష్ర్టాలకు చెందిన కూలీలు సైతం పనుల కోసం ఇక్కడికొస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోని గత పాలనలో పది ఎకరాలున్న రైతు సైతం పట్నం వలస వెళ్లాడు.. సెక్యూరిటీ గార్డులుగా, వివిధ పనులు చేస్తూ జీవించారు. కొందరు బతుకు భారమై వరి తాళ్లను ఉరితాళ్లుగా చేసుకొని ఆత్మహత్యలు చేసుకున్న నాటి చేదు సంఘటనలు ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు. అలాంటి రోజులను మళ్లీ తెలంగాణలో తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. రాష్ట్రంలో రైతులను కష్టాల పాలు చేసేలా ఆ పార్టీ నేతల వ్యవహారం కొనసాగుతున్నది. హస్తం పార్టీ అధికారంలోకి వస్తే ముందుగా వ్యవసాయ రంగానికి గడ్డు కాలమే.. పెరిగిన భూముల ధరలు ఒక్కసారిగా పడిపోనున్నాయి. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది. సొంతూళ్లల్లో ఉపాధి లేక పట్టణాలకు మళ్లా వలస వెళ్లే ప్రమాదం ఏర్పడుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కానున్నది. ఎన్కటి రోజులు వచ్చే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ విధానాలు వినాశకాలుగా మారనున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతతో వ్యవసాయాన్ని సంబురంగా మార్చారు. ఇందులో భాగంగా 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా, ప్రాజెక్టులను పూర్తి చేయడం, ధరణి పథకం, రైతువేదిక, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశారు. అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఫలితంగా నాడు ఎకరం రూ.50 వేలు పలికే భూముల ధరలు నేడు కనిష్ఠంగా రూ.25 లక్షలకు చేరుకున్నాయి. దీంతో చిన్న రైతులు సైతం అప్పుల భయాన్ని వీడారు. అర ఎకరం భూమి ఉన్నా కూరగాయలు పండించుకొంటూ సొంతూళ్లోనే సంపాదిస్తూ కుటుంబంతో కలిసి ఉంటున్నారు. రైతు కేంద్రంగా అమలవుతున్న విధానాలు, పథకాలతో గ్రామాల్లో ప్రజలు ఆత్మగౌరవంతో బతుకుతూ ఆర్థికంగానూ స్థాయిని పెంచుకున్నారు. ఈ క్రమంలో రెండు ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టగా ఈ ఎన్నికల్లోనూ అవే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధిపొందేందుకు ఆచరణకు అమలు కానీ హామీలు, ఇచ్చిన మాటల్లో డొల్లతనం, రాష్ర్టాన్ని తిరోగమనం దిశగా తీసుకెళ్తుందని మేధావులు, రైతులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా 3 గంటల కరెంట్‌తో విద్యుత్ సమస్య ఏర్పడుతుంది. 10 హెచ్‌పీ మోటర్లు పేద రైతులు కొనే పరిస్థితులు ఉండవు. ధరణి ఎత్తేస్తే భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలకు తావు ఏర్పడుతుంది. రైతుబంధు, రైతుబీమాలాంటి పథకాల అమలు ప్రశ్నార్థకంగా మారనున్నది.
కౌలుదారు కాలంతో రైతులు, కౌలు రైతుల మధ్య పంచాయితీలు పెరుగుతాయి. తెలంగాణ ఏర్పడటంతో ఎంజీకేఎల్ఐ, పాలమూరు ఎత్తిపోతల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడంతో పాటుగా కొత్త ప్రాజెక్టులను నిర్మించడం జరుగుతోంది. దీనివల్ల ఉమ్మడి జిల్లాలో 11 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. కాంగ్రెస్ విధానాలతో ఈ వ్యవసాయం సంక్షోభంలో పడే పరిస్థితులు ఉంటాయన్నది రైతులు, మేధావుల భావన. ముఖ్యంగా 3 గంటల కరెంట్‌తో సరైన విద్యుత్ లేక ప్రస్తుతం ఉన్న పచ్చని భూములు తిరిగి గతంలో మాదిరి నెర్రెలు బారుతాయన్న చర్చ రైతుల్లో జరుగుతోంది. గ్రామాల్లో 2, 3 ఎకరాలున్న రైతులు ఎంత కష్టం వచ్చినా రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్‌లాంటి పథకాలతో ధీమాగా సేద్యం చేసుకుంటున్నారు. పెట్టుబడుల కష్టాలు లేక, ప్రభుత్వమే కొనుక్కుంటూ మద్దతు ధరను ఇస్తూ కొనుగోళ్లు చేపడుతుండటంతో సంబురంగా సేద్యం చేసుకుంటున్న రైతులకు కాంగ్రెస్ విధానాలు ఉరితాళ్లుగా మారే పరిస్థితులు ఉంటాయి. ఇక తిరిగి గతంలో మాదిరి పట్నం బస్సెక్కడం, ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితులు నెలకొంటాయన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పథకాలు, విధానాలతో వ్యవసాయ కేంద్రీకృతంగా తీసుకొచ్చిన మార్పుతో పరిపుష్టిగా మారిన గ్రామీణ వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతుందనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ విధానాల వల్ల రైతులు, ప్రజలంతా ఆగమైత రు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాల్లో గుణాత్మక మార్పు వచ్చింది. సంక్షేమ పథకాలకు తోడుగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లాలో ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టును పూర్తి చేశారు. దీనివల్ల లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వ్యవసాయంపై రైతుల్లో మక్కువ పెరిగింది. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. దీనివల్ల వర్షాకాలంలోనే వరి పంటలు వేసుకోవడం జరుగుతుండేది. ఇప్పుడు ప్రాజెక్టు రావడంతో నాగర్‌కర్నూల్ కేసరి సముద్రం చెరువు కింద కూడా రెండు పంటలు పండుతున్నాయి. నాడు ముళ్ల కంపలతో ఉన్న భూములు ఇప్పుడు మాయమయ్యాయి. ఎక్కడ చూసినా వరి, వేరుశనగ, ఇతర పంటలు సాగుతో మరో కోనసమను తలపిస్తున్నది. దీనివల్ల భూములు ఎవరూ అమ్మడం లేదు. ఇంతకు ముందు రూ.లక్ష లేని భూముల ధరలు రూ.కోట్లకు చేరాయి. ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ భూములు కొంటున్నారు. దీనివల్ల రియల్ వ్యాపారం కూడా పెరిగింది. ప్రజలకు వ్యవసాయ కూలీ పనులు, ఇండ్లు, భవనాల నిర్మాణాలు, ఇతర వ్యాపారాలు పెరగడంతో సొంతూర్లలోనే పనులు జరుగుతున్నాయి. ఇంతకు ముందు ఒక్క పూట అన్నం కూడా లేకుంటుండె. మూడు పూటలా కడుపు నిండా తింటున్నారు. ఇప్పుడు ఎక్కడ కూడా అన్నమంటూ ఇండ్ల వద్దకు వచ్చే భిక్షగాళ్లు కనిపించడంలేదు. కాంగ్రెస్ 3 గంటల కరెంట్, కౌలురైతు కాలమ్, ధరణి తీసేస్తే కొత్త వ్యవస్థతో వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది. దీనివల్ల పచ్చని భూ ములు మళ్లీ బీళ్లుగా మారే అవకాశం ఉన్నది. రైతులు, ప్రజలు ఉపాధి కరువై ముంబాయి, హైదరాబాద్, పూణెలాంటి ప్రాంతాలకు వలసలు వెళ్లే పరిస్థితులు దాపురిస్తాయి. ప్రజలు ఈ మోసపు విధానాలను గుర్తించాలి. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధికి మద్దతు ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలి.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు కష్టకాలం తప్పదు. వారి మాటలు వింటుంటే రైతులు భయపడే పరిస్థితి ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇప్పుడిప్పుడే వ్యవసాయం బాగవుతున్నది. గతంలో భూముల హద్దుల విషయంలో రైతుల మధ్య కొట్లాటలు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఒక రైతు ఇంకో రైతు పొలం కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోవాలంటే దళారులను కలవనిదే దస్త్రం ముందుకు పోయేది కాదు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పాస్ పుస్తకాల కోసం పటేల్, పట్వారీల చుట్టూ ఎంత తిరిగినా పైకం ఇవ్వనిదే పాస్‌బుక్ ఇచ్చేవారు కాదు. దీనికంతటికి చెక్ పెట్టి సీఎం కేసీఆర్ ధరణిని తీసుకొచ్చి రైతుల భూములకు భద్రత కల్పించారు. కాంగ్రెసోళ్లకు ఎందుకు నచ్చడం లేదో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ధరణి ఉండడం వల్ల రైతు ప్రశాంతంగా ఉండడంతోపాటు తమ భూమి రికార్డులో భద్రంగా ఉందనే సంతోషంలో ఉన్నాడు. దీన్ని బట్టి రైతుకు రైతు బంధు, బీమా ఇస్తున్నారు. ధరణిని తీసేస్త్తామని చెప్పడం చూస్తుంటే కాంగ్రెసోళ్లకు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారో, లేదో అర్థం కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నకారు రైతులు వ్యవసాయం చేసుకోలేక తమ భూములు కౌలుకు ఇచ్చి ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు, అనుభదారులకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి వారికి రైతుబంధు వచ్చేలా చూస్తామని చెబుతున్నారు. దీంతో రైతులు భయపడి కౌలుకు భూమి వేసే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు.
కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ ఇస్తే ఏం చేసుకోవాలి. మళ్లీ వ్యవసాయం బంద్ చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన 24గంటల కరెంట్ ఇస్తుంటే కాంగ్రెసోళ్లకు కండ్లు మండుతున్నాయి. కరెంటుపై కాంగ్రెస్ పెద్ద కుట్ర దాగి ఉన్నట్లు అనిపిస్తుంది. చిన్న, సన్నకారు రైతులు 10హెచ్‌పీ మోటర్లు ఏర్పాటు చేసుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. మూడు గంటల విద్యుత్ వల్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. దీంతో రైతుల ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉచిత కరెంట్‌తోపాటు రైతుబంధు ఇవ్వడం వల్ల రైతుల ఆత్మహత్యలు తగ్గిపోయాయి. కాంగ్రెస్ పాలనొస్తే కరెంట్ కోసం రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి వస్తది. ఇప్పుడిప్పుడే సీఎం కేసీఆర్ సర్కారు అందించే సాయంతో రైతులు వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నరు. వలసలు ఆగిపోతున్నాయి. కాంగ్రెస్ మాటలు వింటుంటే రైతులు ఆందోళన చెంది వ్యవసాయం వదిలిపెట్టే అవకాశం లేకపోలేదు. గత ప్రభుత్వాల కాలంలో కరెంట్ కోసం రైతులు రోడ్డెక్కని రోజు లేదు. అప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. కరెంట్ కోసం రాత్రి,పగలు తేడా లేకుండా ఎదురు చూసేటోళ్లం. రైతులు అప్రమత్తంగా ఉండి ఆలోచించి ఓటు వేయాలి.
కాంగ్రెస్ నాయకులు రైతుల జీవితాలను ఆగం చేసేందుకు కుట్రలుపన్నుతుండ్రు. అధికారం కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడటం సరికాదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 3గంటల కరెంట్ చాలని, 10 హెచ్‌పీ మోటర్లు రైతులు వాడాలని చెబుతున్నడు. మరో నాయకుడు మల్లు భట్టి విక్రమార్కనేమో ధరణి ఎత్తేసి భూమాత యాప్ పెట్టాలని, ఇందులో కౌలుదారు కాలమ్ పెట్టి భూ యజమానికి హక్కు లేకుండా, సాగులో ఉన్న కౌలుదారికి రైతుబంధు డబ్బులు వచ్చేలా కుట్రలు చేస్తుండ్రు. పటేల్, పట్వారీలు మళ్లీ వస్తరు. ఈ పద్ధతి వస్తే రైతులు ఆగమైపోతరు. కౌలుదారు కాలమ్ భయంతో భూ యజమానులు తమ భూములను కౌలుదారులకు ఇవ్వకుండా పోలాలన్నీ బీడు పెడుతరు. వ్యవసాయం మీద ఆధారపడే రైతు కుటుంబాలు ఆదాయం కోల్పోతారు. కాంగ్రెసోళ్లు రైతుబంధు రాకుండా కుట్రలు చేసి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి రైతుల కడుపుకొట్టిండ్రు. వీరు రైతుల క్షేమాన్ని కోరుకునేటోళ్లు కాదు. రైతులకు అండగా నిలిచే సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమైతది. ఆయనకు మద్దతుగా నిలిచి మళ్లీ గెలిపించాలి.