గద్వాల, జూలై 9 : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జూరాల ఆయకట్టు సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. వర్షాకాలం ప్రా రంభమైనప్పటికీ ఎల్‌నినో ప్రభావంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో చినుకు జాడ కరువైంది. సెప్టెంబర్ వరకు ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ సూచించడంతో వర్షాధారంపై ఆధారపడి పంట లు సాగు చేసే రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వానకాలం పంటల సాగు ఎలా అని రైతుల్లో నైరాశ్యం నెలకొన్నది. జూన్ 4న నైరుతి రుతుపవనా లు కేరళ తీరాన్ని తాకినా వర్షాల జాడ లేదు. మబ్బు లు మురిపిస్తున్నా వరుణుడు మాత్రం మొఖం చాటేస్తున్నాడు. అదును దాటుతున్నా కురవకపోడంతో రైతులు, ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు.
ప్రస్తుత పరిస్థితి జూరాల ప్రాజెక్టుకు 2016-2019 మధ్య కాలంలో సంభవించింది. గతేడాది జూన్‌లోనే ముందస్తుగా పీజేపీకి వరద వచ్చింది. 8.869 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ముందుగానే వరదలు రావడంతో రైతులు నారు పోసుకొని పొలాల్లో నాట్లు కూ డా వేశారు. కానీ ఈ సారి జూలై మొదటి వారం దాటినా ఇంత వరకు ప్రాజెక్టుకు వరద రాలేదు. జూలై మొదటి వారం ముగిసినా డ్యాంలో డెడ్ స్టోరేజీతో కలిపి 5.913 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో వానకాలం సాగు సందడి కనిపించడం లేదు. వర్షాలు కురుస్తాయా? ప్రాజెక్టులు నిండుతాయా? అన్న అనుమానం రైతుల్లో వ్యక్తమవుతోంది.
జూరాల ఆయకట్టు కింద పంటలు సాగు చేయాలా? వద్దా? అన్న సందిగ్ధంలో అన్నదాతలు ఉండగా.. సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. జూరాల ఆధారంగానే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ఉన్నది. ఈ లిఫ్ట్ కింద 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందాల్సి ఉండగా.. ర్యాలంపాడ్ రిజర్వాయర్ లీకేజీల కారణంగా లక్ష ఎకరాలకుపైగా మాత్రమే అందుతోంది. అయితే ప్రస్తు తం జూరాలలో అనుకున్న స్థాయిలో నీటినిల్వలు లేక పోవడంతో వానకాలం సాగు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉన్నది. ఎగువన ఉన్న రాష్ర్టాల్లో వర్షాలు కురిసి వదర వస్తే తప్పా రైతులు సాగుకు ముందడుగు వేయలేని పరిస్థితి. వర్షాలు పడితేనే ఎత్తిపోతలకు సరిపడా నీళ్లు అందనున్నాయి. నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా కింద దాదాపు 3 లక్షల ఎకరాల వరకు సా గయ్యే అవకాశం లేకపోలేదు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు జూరాల ప్రాజెక్టు వరప్రదాయిని. ఇటు కాల్వలు.. అటు ఎత్తిపోతల పథకాల ద్వారా ఆయా జిల్లాలకు సాగునీరు అందించడంలో డ్యాం పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా.. సుమారు లక్షా రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. కుడి కాల్వ 46 కి.మీ. పొడవు పారి 35 వేల ఎకరాలకు, ఎడమ కాల్వ 100 కి.మీ. మేర ప్రవహిస్తూ 67 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.
రైట్ కెనాల్ ద్వారా గద్వాల జిల్లాలో ఉంటే.. లెఫ్ట్ కెనాల్ ద్వారా వనపర్తి, మక్తల్, దేవరకద్ర, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ జిల్లాలోని పంటలకు సాగునీరు అందుతుంది. సాగునీటితోపాటు తాగునీటి పథకాలకు జూరాల నుంచే నీటిని తీసుకుంటున్నారు. వేసవిలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా నీళ్లు అందాయి. కుడి కాల్వపై జములమ్మ రిజర్వాయర్, ఎడమ కాల్వపై రామన్‌పాడ్, గోపల్‌దిన్నె రిజర్వాయర్లు ఈ ప్రాజెక్టు మీదే ఆధారపడి ఉన్నాయి.