ఊట్కూర్, ఫిబ్రవరి 2 : నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భూత్పూర్ నిర్వాసితుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వ హయాంలో 1.313 టీఎంసీ సామర్థ్యంతో 46,800 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించేందుకు గ్రామం పక్కనే రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. భూత్పూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించిన అప్పటి ప్రభుత్వం నిర్వాసితులను ఆదుకునేందుకు 122 జీవోను ప్రకటించింది. రిజర్వాయర్‌లో భూములను కోల్పోయిన గ్రామస్తులకు పరిహారం అందించగా తల దాచుకునేందుకు పునరావాసం కల్పించడంలో నాటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్న ఆరోపణలు ఉన్నాయి.
అభివృద్ధి కోసం తాము భూములిస్తే పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం పరిహాసమాడుతున్నదని గ్రామస్తులు మండిపడుతున్నారు. 2005లో రిజర్వాయర్‌ను ప్రారంభించిన ఉమ్మడి రాష్ట్ర ప్రభు త్వం 2010 లోనే భూత్పూర్ను ముంపు గ్రామంగా ప్రకటించి జీవో విడుదల చేసింది. ముంపు గ్రామస్తులకు ఇండ్ల నిర్మాణం కోసం సర్వే చేపట్టక పోవడంతో నిర్వాసితులకు గూడు కరువై హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు వలస వెళ్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యానికి గురైన వారు ఎక్కడికి వెళ్లలేక శిథిలమైన ఇండ్లలోనే తలదాచుకుంటూ కష్టాలను అనుభవిస్తున్నారు.
నది పక్కనే గ్రామం ఉండడంతో వర్షం వస్తే మోకాళ్ల లో తు నీరుచేరి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిని ప్రజ లు అనుభవిస్తున్నారు. ఇంటి గోడలకు తేమ పట్టి నెర్రలు పోతున్నాయని, దూలాలు చెదలు తిని శిథిలావస్థకు చేరుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నేలపై పడుకునేందుకు వీలు లేకుండా దుప్పట్లు, జంకానాలు తడిసి ముద్దవుతున్నాయని గ్రామస్తులు తమ దీనావస్థను వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు వచ్చి రిజర్వాయర్ నిండితే ఇండ్లల్లోకి మొసళ్లు, పాములు, విష కీటకాలు వచ్చి చేరుతున్నాయి.
తమ గ్రామం లో లెక్కకు మించి పాముకాటు మరణాలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రాత్రి, పగలు కంటి మీద కునుకు లే కుండా గ్రామస్తులు కాలం గడుపుతున్నారు. పునరావాసం కోసం ఎదురు చూసిన ఎంతో మంది మానసిక క్షోభతో ప్రాణాలు కోల్పోయారు. పక్కనే రిజర్వాయర్ ఉండడంతో బోరు బావుల నుంచి కలుషితమైన నీటిని తాగి ఇరవై శాతానికిపైగా గ్రామస్తులు కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్నారు.
గ్రామంలో కనీస మౌలిక వసతులు లేక రోగాలతో సతమతమవుతున్నారని, పట్టించుకునేందుకు అధికారులు ముందుకు రావడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గ్రామానికి పడమటి వైపున రిజర్వాయర్, ఉత్తరాన పెద్ద చెరువు, దక్షిణం వైపున కల్వాల చెరువు, మరోవైపు పొలాలు ఉండటంతో చనిపోయిన శవాలను పాతి పె ట్టేందుకు గోతులు తీ స్తే ఊట నీరు వస్తుందని, శవాలను సైతం పూడ్చుకోలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో పరిస్థితులు ఇలా ఉంటే యువకులకు పెళ్లి వయ స్సు దాటి పోతున్నా పిల్లనిచ్చేందుకు బంధువులు ముందుకు రావడం లేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
దళారులు జోక్యం వల్లే భూత్పూర్ రిజర్వాయర్ ముంపు గ్రామం నిర్వాసితులకు సంబంధించిన 122 జీవో ఫైల్ పెండింగ్‌కు కారణమైనట్లు కొందరు నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ లెక్కల ప్రకారం గ్రామంలో దాదాపు 500 నివాసగృహాలు 1500 మంది జనాభా ఉండగా గత ప్రభుత్వం గ్రామస్తులకు పునరావాసం కోసం కమిటీని ఏర్పాటు చేసింది. గ్రామంలో పలుకుబడి ఉన్న లీడర్లు, మధ్య దళారులు జోక్యం చేసుకొని ఇతర గ్రామాలకు చెందిన బంధువులు, సంబంధీకుల పేర్లను నమోదు చేయించి కొత్తగా షెడ్ల నిర్మాణం చేపట్టినట్లు గుర్తించింది.
రెట్టింపు సంఖ్యలో లబ్ధిదారులను చేర్చడంతో అసలైన నిర్వాసితులకు సమస్యను తెచ్చి పెట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. రికార్డులు తారుమారుకు పాల్పడటంతో నిర్వాసితుల జీవో ఫైల్‌ను కమిటీ తిరస్కరించిందని అధికారులు చెబుతున్నారు. కొత్తగా నిర్మించిన షెడ్ల నిర్మాణానికి పరిహారం అందించడం సాధ్యం కాదని ఫైల్‌ను పెం డింగ్‌లో పెట్టినట్లు తెలిసింది.
భూత్పూర్ రిజర్వాయర్‌లో భూములు కోల్పో యి పునరావాసం కోసం ఎదురుచూస్తున్న బాధిత గ్రామస్తులను ఆదుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి విజ్ఞప్తి మేరకు గత నెల 13న భూత్పూర్ గ్రామాన్ని మంత్రి సందర్శించి స్వయంగా సమస్యలను పరిశీలించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఆరు నెలలు ఎన్నికల సందర్భంగా అభివృద్ధి పనులు చేపట్టలేకపోయామని గ్రామస్తులతో పేర్కొన్నారు. 24 ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో మీరు అనుభవిస్తున్న కష్టం హృదయాన్ని కలిచివేస్తోందని, ఇరవై ఏండ్లుగా సమస్యలతో పోరాటం చేస్తున్న గ్రామస్తుల సహనానికి దండం పెడుతున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు.
పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం అదృష్టంగా భావించాలని, పునరావాసం కోసం వారం రోజుల్లో భూ సేకరణ పూర్తి చేయించి ఒక్కో కుటుంబానికి 200 గజాలతో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు నివేదికలు తయారు చేయాలని అదనపు కలెక్టర్ బెన్షాలెం, ఆర్డీవో రాంచందర్‌రావును ఆదేశించారు. మంత్రి పర్యటన పూర్తయి పక్షం రోజులు గడచినా అధికారులు భూ సేకరణ కోసం చర్యలు ప్రారంభించకపోవడంతో నిర్వాసితులు ఎదురు చూస్తున్నారు.
గ్రామంలో కనీస వసతులు లేకుం డా జీవిస్తున్నాం. అడవిలో ఉండే చెంచు జాతుల కంటే హీనంగా మా బతుకులు ఉన్నాయి. రిజర్వాయర్ కింద భూములు కోల్పోవడంతో పం డించుకునేందుకు పంటలు లేకుం డా పోయింది. ఇది తెలుసుకుని మా ఊరి పోరగాళ్లకు పిల్లనిచ్చేందుకు బంధువులు సైతం ముందుకు రావడం లేదు. భూసేకరణ చేపట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఇండ్ల నిర్మాణం చేపట్టాలి.
– మీసాల అంజప్ప, భూత్పూర్ నిర్వాసితుడు
పక్కనే రిజర్వాయర్ ఉండడంతో బోరు బావుల నుంచి వచ్చే కలుషిత నీటిని తాగి నా భార్యతో సహా అనేక మంది గ్రామస్తులు కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధ పడుతున్నారు. పాము కాటు కు గురై లెక్క లేనంత మంది చనిపోతున్నారు. ఊర్లోని ప్రజలందరూ భయం తో బతకాల్సి వస్తోంది. కొత్త గ్రామం ఏర్పాటు చేసి త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయించాలి.
– పింజరి బాలేసాబ్, భూత్పూర్
రిజర్వాయర్ పక్కనే ఇండ్లు ఉండడంతో ఊట నీరు ఇండ్లల్లోకి చేరుతుంది. దీంతో తిండి గింజలకు సైతం భద్రం లేకుండా ఉన్నది. వర్షం వస్తే గింజలు, దుస్తువులు తడిసిపోతున్నా యి. ఇల్లంతా తేమ తీసుకోవడంతో ఆరుబయట హాలులోనే ఇంటిల్లిపాది కూర్చొని వంటలు వండుకోవాల్సి వస్తుంది. మా సమస్యలకు త్వరగా పరిష్కార మార్గం చూపెట్టాలి..
– జయమ్మ. గృహిణి, భూత్పూర్