అమ్రాబాద్/మానవపాడు/వడ్డేపల్లి, ఏప్రిల్ 3 : గురువారం ఈదురుగాలులో కురిసిన అకాల వర్షం కారణంగా పిడుగుపాటుకు గురై రెండు చోట్ల ముగ్గురు మృతి చెందిన సంఘటనలు నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నాయి. పదర మండలం కోడోనిపల్లి గ్రామ శివారులో రైతు పోగుల వినోద్‌కు చెందిన వేరుశనగ పొలంలో గురువారం కూలి పనులు చేసేందుకు అదే గ్రామానికి చెందిన సుంకరి సైదమ్మ(35), వీరమ్మ (55) మిగితా వారితో కలిసి వెళ్లారు. పొలంలో పనులు చేస్తుండగా.. మధ్యా హ్నం వర్షంతోపాటు పిడుగు పడింది.
దీంతో సైదమ్మ, వీరమ్మ అక్కడిక్కడే మృతి చెందగా.. మరో మహిళ సుంక రి లక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను అమ్రాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అలాగే మానవపాడు మండలం చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన బోయ చిన్న వెంకటేశ్వర్లు(45) గురువారం ఉదయం పశువులను మేపడానికి గ్రామ శివారులోని పొలాల వైపు వెళ్లాడు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో అకస్మాత్తుగా వర్షం కురవగా.. పిడుగు పడి అతడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
అక్కడే రైతులు గమనించి వెంటనే అతడిని హుటాహుటిన కర్నూల్ దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అతడికి భార్య లక్ష్మీదేవి, కూతురు, కుమారుడు ఉన్నారు. వడ్డేపల్లి మండలం బుడమర్సుకు చెందిన మహేందర్ (20) గురువారం పశువులు మేపేందుకు గ్రామ సమీపంలోకి వెళ్లాడు. సాయంత్రం అకస్మాత్తుగా గాలివాన మొదలైంది. ఇదే సమయంలో పిడుగుపడడంతో మహేందర్ మృతి చెందాడు. మృతుడికి ఇంకా వివాహం కాలేదని తండ్రి రాజు తెలిపాడు.