అయిజ, జూలై 10 : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద మొదలైంది. ఉత్తర, దక్షిణ కన్నడ ప్రాంతాల్లో ఐదు రోజులుగా కురుస్తున్న వానలకు తుంగ జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరింది. దీంతో శనివారం వరదను దిగువకు విడుదల చేయగా.. తుంగభద్ర డ్యాంలో నీటిమట్టం పెరుగుతున్నది. సోమవారం 17,061 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా.. అవుట్‌ఫ్లో 255 క్యూసెక్కులకు చేరింది.
డ్యాం గరిష్ఠ నీటినిల్వ 105.855 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.911 టీఎంసీలు నిల్వ ఉండగా.. 1633 పూర్తిస్థాయి అడుగులకుగానూ ప్రస్తుతం 1578.79 అడుగులకు చేరినట్లు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, ఏపీ రాష్ర్టాల రైతులకు వరప్రదాయినిగా తుంగభద్ర జలాశయం పేరొందింది. ప్రస్తుతం వరద రాక షురూ కావడంతో మూడు రాష్ర్టాల కర్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.