అయిజ, జూలై 27 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు లక్ష క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతుండడంతో డ్యాం లోని 33 గేట్లను ఎత్తారు. 1,49,535 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 1,36,734 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 1,58,434 క్యూసెక్కులుగా ఉన్నది. 105.788 టీఎంసీల సామ ర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 99.586 టీఎంసీల నిల్వ ఉన్నది. 1,633 అడుగుల నీటి మట్టానికిగానూ 1,631.44 అడుగులు ఉన్నట్లు డ్యాం ఎస్ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.
కర్ణాటకలోని టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు భారీగా వరద నీరు చేరుతుండడంతో జలకళ సంతరించుకున్నది. శనివారం 1,26,700 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 1,26,050 క్యూసెక్కుల వరద సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 650 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తు తం ఆనకట్టలో 13.7 అడుగుల మేర నీటి మట్టం ఉందన్నారు.
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు వరద చేరుతున్నది. ఆల్మట్టి ప్రాజెక్టులోకి 2,96,794 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 3 లక్షల క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠస్థాయి నీటిమట్టం 1,705 అడుగులకు గానూ 1,687.69 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 113.69 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 76.698 టీఎంసీలు గా ఉన్నది. నారాయణపూర్ ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 3,00,064 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదైంది. గరిష్ఠస్థాయి నీటిమట్టం 1,615 అడుగులకుగానూ ప్రస్తుతం 1,609.12 అడుగులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 37.64 టీఎంసీలకు గానూ 25.164 టీఎంసీలు ఉన్నది.