అయిజ, జూలై 17 : 65 ఏండ్ల సమైక్య పాలనలో సాగునీరు, కరెంట్ కష్టాలతో నెర్రెలు బారిన నేలలను చూశామని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తూ సాగునీరు, 24 కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాల అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. రైతు వ్యతిరేకులను తరిమికొట్టే సమయం అసన్నమైందని పిలుపునిచ్చారు. అయిజ మండలం టీటీదొడ్డి రైతువేదికలో సోమవారం ‘మూడు పంటలు బీఆర్ఎస్ నినాదం.. మూడు గంటలు కాంగ్రెస్ విధానం’ అనే అంశంపై రైతులతో సమావేశమై మాట్లాడారు. సమైఖ్య పాలనతో నేటి పరిస్థితిని రైతులు పోల్చి చూడాలన్నారు. అపరచాణిక్యుడి అవతారమెత్తి రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత సీఎం సీఎం కేసీఆర్‌దేనన్నారు. ప్రతిపక్షాలు పాలిస్తున్న ఏ రాష్ర్టాల్లోనూ 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని గుర్తు చేశారు. అక్కడి రైతులు అల్లాడుతుంటే పట్టించుకోని ప్రతిపక్షాలు తెలంగాణపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో 30లక్షల మోటర్లకు ఉచితంగా కరెంట్ అందిస్తూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ప్రభుత్వ పథకాలతో పంజాబ్ రాష్ర్టానికి దీటుగా తెలంగాణ రైతులు ధాన్యాన్ని పండిస్తున్నారని వెల్లడించారు. కంటికి రెప్పలా కాపాడుతున్న సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు అండగా ఉండాలన్నారు. రేవంత్‌రెడ్డి.. చంద్రబాబు ఏజెంట్ అని అన్నారు. కరెంట్ చార్జీలు తగ్గించాలని అడిగిన రైతులపై బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపిన ఘటనను గుర్తు చేశారు. కల్లబొల్లి కబుర్లు చెప్పే ప్రతిపక్షాలను పాతాళంలోకి తొక్కేయాలన్నారు. అలంపూర్ నియోకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఆర్డీఎస్కు అనుసంధానంగా తుమ్మిళ్ల ప్రాజెక్టును రూ.783కోట్లతో చేపట్టామన్నారు. త్వరలోనే మల్లమ్మకుంట, జులెకల్, వల్లూరు రిజర్వాయర్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు ప్రధాన రహదారి నుంచి రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో సర్పంచ్ మహేశ్వరీశివకుమార్, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు రాముడు, బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య, డైరెక్టర్ హుస్సేనీ, ఉమేశ్‌గౌడ్, గోవర్ధన్, కిశోర్, ప్రజాప్రతినిధులు, విండో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.