ఖమ్మం గుమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు ఉమ్మడి జిల్లాలోని గులాబీ శ్రేణులు తరలివెళ్లాయి. జాతీయ పార్టీగా ఆవిర్భవించాక నిర్వహించే తొలిసభకు మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీచైర్మన్లు, చైర్పర్సన్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు బయల్దేరి వెళ్లారు. చరిత్రాత్మకమైన ఈ సభలో మన నేతలు సందడి చేశారు. సభకు వెళ్లని వారు టీవీల్లో సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించారు. దీంతో పార్టీశ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది.
నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ(జనవరి 18 ) : స్వరాష్ట్ర సాధన చేపట్టిన టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. జాతీయ రాజకీయాల్లో మార్పు కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్గా మారాక తొలి ఆవిర్భావ సభను ఖమ్మంలో బుధవారం నిర్వహించారు. ఈ సభకు ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్, జెడ్పీ, మున్సిపల్ చైర్మన్లు, చైర్పర్సన్లు, గ్రంథాలయ చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులు సభకు ప్రత్యేక వాహనాలలో తరలివెళ్లారు. సీఎం కేసీఆర్‌తోపాటు మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు,పాటు మాజీ సీఎంలు, ప్రముఖ జాతీయ నాయకులు హాజరయ్యారు. ఖమ్మం సభ ఉమ్మడి జిల్లాలోనూ పట్టణాలు, గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు టీవీల్లో వీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జేజేలు కొట్టారు. దేశ్‌కి నేత సీఎం.. జై బీఆర్ఎస్.. జైజై బీఆర్ఎస్ అంటూ నినదించారు. ఈలలతో హోరెత్తించారు. తెలంగాణ మాదిరిగా దేశాభివృద్ధికి బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నదన్నారు. ఈ సభతో బీఆర్ఎస్ నేతల్లో మరింత జోష్ పెరిగింది. రోజురోజుకూ పార్టీకి ఆదరణ పెరుగుతున్నది.