తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు ఉమ్మడి జిల్లా జోహార్ పలికింది. ఊరూ.. వాడా నివాళులు అర్పించింది. గ్రామ, మండల, నియోజ కవర్గ, జిల్లా కేంద్రాల్లో అమరవీరుల స్తూపాల వద్ద జై కొట్టారు. ప్రొఫెసర్ జయశంకర్‌సార్ చిత్రపటాలకు పూలమాల వేశారు. బలిదానాలు చేసుకున్న వారి కుటుంబ సభ్యులను సత్కరించారు. వారిని గుర్తు చేసుకొని కన్నీళ్లుపెట్టారు. ప్రత్యేక రాష్ట్రం కోసం వారి ప్రాణాలను ఫణంగా పెట్టారని పలువురు స్మరించుకున్నారు. మీరు కోరినట్లే రాష్ట్రం ఏర్పడి.. నేడు అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు. వనపర్తి కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్తూపం వద్ద వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అలాగే మహబూబ్‌నగర్‌లో జరిగిన కార్యక్రమానికి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ఆర్అండ్బీ ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి పుష్పగుచ్ఛం ఉంచి నినదించారు. అమరవీరుల కలను ప్రభుత్వం నెరవేరు స్తున్నదని తెలిపారు. సమాజంలో ప్రజలంతా ఉన్నతంగా నిలవాలన్నదే వారి ఆకాంక్ష అని స్పష్టం చేశారు.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, జూన్ 22
వనపర్తి, జూన్ 22 : అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రమని.. మనందరం ఇంత స్వేచ్ఛగా జీవించడానికి వారి జీవితాన్ని అర్పించారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ధ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయ ఆవరణలో నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ లోకనాథ రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ రక్షితామూర్తితో కలిసి అమరవీరుల స్తూపానికి మంత్రి నిరంజన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాలు చేశారన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు మరువలేనివన్నారు. వారు కలలుగన్న విధంగా సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నేడు దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేశారని, 1956 నుంచి 2014 వరకు అనేక మంది తెలంగాణ కోసం అమరులయ్యారన్నారు. సమైక్య పాలకులు మనల్ని బానిసలుగా చూశారని, తెలంగాణ భాష, యాస, అభివృద్ధి, ప్రతిభ అన్నింటిలో వివక్ష చూపారన్నారు. అటువంటి తరుణంలో ఎంతో మంది బిడ్డలు తెలంగాణ కోసం అమరులయ్యారని, వారికి తెలంగాణ సమా జం ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, ఆర్డీవో పద్మావతి పాల్గొన్నారు.
వైద్యరంగం బలోపేతం..
వనపర్తి, జూన్ 22 : రాష్ట్రంలో వైద్యరంగం బలోపేతమై ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యసేవలు అందుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఒకే రోజు 28 కాన్పులు చేసిన జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి గురువారం సందర్శించారు. గర్భిణులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నెలకు ప్రభుత్వ దవాఖానలో 50 నుంచి 60 కాన్పులు చేసేవారని, స్వరాష్ట్రంలో నెలకు 450చొప్పున నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో 257 మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ 79.48లక్షల చెక్కులను బాధితులకు మం త్రి అందజేశారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం చేశారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ‘ఐ లవ్ వనపర్తి’, ‘ఐ లవ్ తెలంగాణ’ సెల్ఫీ పాయింట్‌ను మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కమిషనర్ విక్రమ సింహారెడ్డి, సిబ్బందితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.