మహబూబ్‌నగర్, జనవరి 3 : నిబంధనలకు ఉల్లఘించి బైక్‌పై రాంగ్రూట్లో వచ్చారని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆసభ్య పదజాలంతో ఉపాధ్యాయ దంపతులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా హెల్మెట్‌తో దాడి చేసిన ఘటన మహబూబ్‌నగర్‌లో చోటు చేసుకున్నది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మద్దూర్ మండలంలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడు, కోయిలకొండలో ఉపాధ్యాయురాలుగా పనిచేసే తన భార్యను బైక్‌పై ఎక్కించుకొని గురువారం సాయంత్రం పాతబస్టాండ్ సమీపంలో మ్యాక్స్ షోరూం ముందు నుంచి ఇంటికి వస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో వారు రాంగ్రూట్లో వస్తుండగా అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ యాదయ్య వీరిని పట్టుకొని అసభ్య పదజాలంతో దూషించాడు.
దీంతో ఎందుకు దూషిస్తున్నారని కానిస్టేబుల్‌ను వారు ప్రశ్నించగా మళ్లీ దురుస్తుగా వ్యవహరించడమే కాకుండా ఉపాధ్యాయుడి బైక్‌కు ఉన్న హెల్మెట్ తీసుకొని దాడి చేశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. వీరి మధ్య జరిగిన తోపులాటలో మహిళా ఉపాధ్యాయురాలు కిందపడింది. సమాజంలో విద్యాబుద్ధులు నేర్పుతున్న మమ్మల్నే ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ గౌరవం లేకుండా వ్యవహరించి దాడి చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి నందుకు సదరు కానిస్టేబుల్ బైక్ ఫొటో తీసి చలానా విధించే అవకాశం ఉన్నా అలా చేయకుండా దాడి చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలో సదరు కానిస్టేబుల్‌పై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐ అప్పయ్యకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కానిస్టేబుల్ యా దయ్య కూడా విధులకు ఆటంకం కలిగించిన టీచర్‌పై ఫి ర్యాదు చేశారు. దీనిపై సీఐని వివరణ కోరగా ఇద్దరి ఫిర్యాదులపై ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.