దేవరకద్ర, నవంబర్ 6 : టీపీసీసీ కార్యదర్శి కాటం ప్రదీప్‌కుమార్‌గౌడ్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ గూటికి చేరారు. సోమవారం దేవరకద్రలో నిర్వహించిన ప్రజా ఆశీర్వద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన, అనుచరవర్గం గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గంలో కారు గుర్తును గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులను రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. 35 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన తనకు తీరని అన్యాయం చేశారని ఆవేదన చెందారు. అందుకే హస్తం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ పాదయాత్రచేస్తే తాను ముందుండి జనసమీకరణ చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ జెండా మోయని వారికి జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వడమే కాకుండా, పార్టీ టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. డబ్బులున్న నేతలకే పార్టీలో టికెట్లు కేటాయిస్తున్నారని, రేవంత్‌రెడ్డి ఉన్నంత కాలం కాంగ్రెస్‌లో బీసీ వర్గాలకు సముచిత న్యాయం ఉండదన్నారు. అందుకే బీసీ నేతలంతా పార్టీని వీడాలని సూచించారు. దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను ఓడించడమే తన లక్ష్యమన్నారు. ఆయన వెంట నాయకులు కేబీఆర్ గౌడ్, కుర్వ రాందాస్, భగవంత్ గౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి, వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.