మహబూబ్‌నగర్ కలెక్టరేట్/జడ్చర్ల టౌన్, మార్చి 20 : ముస్లింలు రంజాన్ పండుగను శనివారం వైభవంగా జ రుపుకోనున్నారు. ఆకాశంలో శుక్రవారం నెలవంక కనిపించడంతో ముస్లిం ప్రవక్తలు, మత పెద్దలు రంజాన్ పర్వదినాన్ని ప్రకటించారు. ఇప్పటికే మసీదులు, ప్రార్థనలు చేసే ఈద్గా మైదానాలను సుందరంగా తీర్చిదిద్దారు. రంజాన్ మాసం రోజా రోజులు నిగ్రహాన్ని నేర్పుతాయి. ప రోపకరాన్ని బోధిస్తాయి. దేవుడు చూస్తున్నాడన్న తలంపును తట్టిలేపుతాయి. కాబట్టే పద్నాలుగు గంటలపాటు అన్నపానీయాలకు దూరంగా ఉ ంటారు. మ హ్మద్ ప్రవక్త ద్వారా అల్లాహ్ తరఫున ఖురాన్ గ్రంథం లిఖించినందుకు కృతజ్ఞతగా ముస్లింలు నెలరోజులు ఉపవాస దీక్షలు పాటిస్తారు.
పండుగ ఇలా చేద్దాం : పండగపూట తెల్లవారుజామునే నిద్ర లేవడం ప్రవక్త సంప్రదాయం. మిస్వాక్పుల్లతో దంతధావనం చేయాలి. తలంటు స్నానం చేసి అత్తరు పరిమళాలు పూసుకోవాలి. ఈద్నమాజ్కు ముందు తియ్యని పదార్థాన్ని తాగాలి. లేదంటే బేసి సంఖ్యలో ఖర్జూరాలు తినొచ్చు. ఈద్ నమాజ్ కంటే ముందే ఫిత్రాదానం చేయాలి. ఇది ముస్లింల విధి. అప్పుడే పుట్టిన శిశువుకు కూడా పిత్రాను చెల్లించాలి.
రంజాన్ పండుగను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ముస్లింలు షాపింగ్ సెంటర్లు, లేడిస్కార్నర్లు, చప్పుల దుకాణాల్లో రద్దీ ఏర్పడింది. మగవారు బట్టలు, హ్యాండ్ ఖర్చీప్లు, టోపిలు, అత్తరు, మహిళలు చీరలు, కుర్తా డ్రెస్సులు, గాజులు, చెప్పులు, బూట్లు వంటి కొనుగొలు చేస్తుంటారు. జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో నూతన వెలిసిన షాపింగ్ మాల్స్‌లో రద్దీ కనిపించింది. అంతే కాకుండా పండుగ నిమిత్తం చేసుకోవాల్సిన తిపి వంటకాలు తయారీకి కిరాణం దుకాణాల వద్ద కొనుగోలులో నిమగ్నమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి దాటినా వివిధ పట్టణాలు, జిల్లా కేంద్రాల్లోని షాపింగ్ మాల్స్ వద్ద కొనుగోలు దారుల సందడి కనిపించింది.