మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గద్వాల : నడిగడ్డలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన రాజకీయ వేడిని రగిలిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో పెద్దఎత్తున చేరుతున్నారు. శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని తేరు మైదానంలో జరిగే గద్వాల గర్జనకు జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున గులాబీ శ్రేణులను తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. గద్వాల నియోజకవర్గం ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు, సాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ నేతృత్వంలో పార్టీ నేతలు నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి గ్రామం నుంచి కార్యకర్తలను సభకు రావాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రం మొత్తం గులాబీ మయంగా మారింది. ఎర్రవల్లి చౌరస్తా నుంచి జిల్లా కేంద్రం వరకు ఎక్కడ చూసినా గులాబీ జెండాలు బ్యానర్లు ఫ్లెక్సీలతో నింపేశారు. కనీవిని ఎరుగని రీతిలో గద్వాల గర్జనను చేపడుతున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యే సభను విఫలం చేసేందుకు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ప్రారంభించినా.. ఎక్కడికక్కడే కార్యకర్తలు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గంలో పార్టీ మారుతున్న నేతలను బెదిరింపులకు దిగినా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలకు పోలీసుల నుంచి అనుమతులు రాకుండా అడ్డుపడినా చివరకు ప్రజల ఒత్తిడితో కేటీఆర్ సభకు అనుమతించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేటీఆర్‌ను ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. రోడ్ల వెంట స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.
సిట్టింగ్ పార్టీ మారినా.. చెక్కుచెదరని క్యాడర్.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అసెంబ్లీ
ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన రాజకీయ ప్రాధా
న్యతలు సంతరించుకుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి ఎమ్మెల్యే అయిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గత కొంతకాలం కింద అధికార పార్టీలోకి చేరిపోయారు. ఈ పరిణామాలతో పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎంతో కష్టపడి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతికూల ప్రభావం వేసిన గద్వాలలో గులాబీ జెండా ఎగరేయడం.. సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కార్యకర్తలంతా తిరుగుబాటు చేశారు. ముఖ్యమైన నేతలతోపాటు ఎవరు కూడా ఎమ్మెల్యే వెంట అధికార పార్టీలోకి వెళ్లలేదు. సొంత క్యాడర్‌ను కాపాడుకుంటున్న గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడుకు పార్టీ పగ్గాలు ఇచ్చింది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ గద్వాలలో పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. ఇటీవల పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వేటు తప్పదన్న నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరులంతా తిరిగి బీఆర్ఎస్లోకి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి నాయకులంతా పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు.
నడిగడ్డలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెన్నుపోటుకు వ్యతి రేకంగా నిర్వహిస్తున్న గద్వాల గర్జన సభ చారిత్రా త్మకం కానుంది. ఒకవైపు స్పీకర్ నోటీసులు.. మరో వైపు అనర్హత వేటు.. ఇంకోవైపు ఉపఎన్నికలు ఖా యం కనిపిస్తున్న తరుణంలో గద్వాల గర్జన పేరుతో నిర్వహిస్తున్న సభ కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తి స్తోంది. చాలామంది కాంగ్రెస్ నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ జెడ్పీ చైర్పర్సన్ వ్యవహార శైలిని నిరసిస్తూ ఆ పార్టీకి దూరమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా అంతర్గత ప్రజాస్వా మ్యం లేదని ఎవరికి వారే గ్రూపులుగా మారి పోయారని తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడంతో అందరూ పార్టీని వీడుతున్నారు. దీంతో గద్వాల గర్జనకు స్వయంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తుండడంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గం అంతటా పర్యటించి గ్రామాల నుంచి మండలాల నుంచి కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. ఎర్రవల్లి చౌరస్తాలో పార్టీ నాయకులు కేటీఆర్‌ను ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్ గద్వాల్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత జిల్లా కేంద్రంలో కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీలో కేటీఆర్ పాల్గొంటారు అక్కడ నుంచి తేరు మైదానానికి చేరుకొని ప్రసంగిస్తారు. సభకు సంబంధించి పార్టీ నేతలు అందరూ సమన్వయంతో ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
గద్వాల రాజకీయం గరం గరంగా మారుతుంది. శనివారం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గద్వాలలో ఏర్పాటు చేసిన గద్వాల గర్జన సభకు వస్తుండడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు పూర్తి మారిపోతున్నాయి. కేటీఆర్ రాక కోసం గద్వాల పట్టణమంతా గులాబీ మయంగా ఇక్కడి బీఆర్ఎస్ నేతలు మార్చారు. గత రెండు రోజులుగా స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి హనుమంతునాయుడుతో కలిసి గ్రామాలు పర్యటించి కేటీఆర్ సభను విజయవంతం చేయడానికి ఓ వైపు నాయకులు, కార్యకర్తలను కలుస్తూనే మరో వైపు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీంతో నేడు జరిగే కేటీఆర్ సభలో పెద్ద ఎత్తున మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్‌తో పాటు మాజీ జెడ్పీటీలు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లోకి చేరేందుకు క్యూ కడుతున్నారు. కేటీఆర్ రాక సందర్భంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లు కేటీఆర్ ఫ్లెక్సీలు, పోస్టర్లతో నిండిపోయాయి. పట్టణమంతా గులాబీ మయంగా మారింది. జిల్లా కేంద్రంలోని తేరు మైదానంలో సభ నిర్వహిస్తుండగా సభా ప్రాంగణం లోని ఏర్పాట్లను స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయ్‌కుమార్, నాయకులు రాఘవేంద్రరెడ్డి, చక్రధర్‌రావు, వెంకటేశ్వరరెడ్డి, మోనేశ్, కుర్వ పల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
శనివారం జిల్లా కేంద్రంలో జరిగే గద్వాల గర్జన షెడ్యూల్ ఇలా ఉన్నది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు గద్వాలకు బయలు దేరుతారు. 3:30 గంటలకు గద్వాలకు చేరుకొని, ధరూర్‌మెట్ నుంచి ర్యాలీగా తేరు మైదానానికి చేరుకుంటారు. మైదానంలో సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. సభ ముగిసిన అనంతరం హైదరాబాద్‌కు తిరిగి బయలు దేరనున్నారు.