ఊట్కూర్, నవంబర్ 20 : ఆరుగాలం శ్రమించి పండించిన పత్తికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించిన ఘటన ఊట్కూర్ మండలకేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానికులు, బాధిత రైతు సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కుర్వ మల్లప్ప ఊట్కూర్ శివారులోని తన సొంత పొలంలో పదెకరాల్లో పత్తి పంట పండించాడు. కూలీల కొరత కారణంగా వారం రోజుల నుంచి తీయించిన పత్తిని పొలంలోనే కుప్పలు వేసి భద్రం చేశాడు. ఈక్రమంలో గురువారం ఉదయం పత్తిని అమ్మకానికి తరలించేందుకు కూలీల కోసం ఇంటికి వెళ్లాడు.
ఈ సమయంలో ముఖానికి మాస్కు ధరించి పొలం వద్దకు చేరుకున్న దుండగుడు పత్తి కుప్పలకు నిప్పంటించి పారిపోతుండగా పక్క పొలం రైతు గుర్తించి యజమానికి సమాచారం అందించాడు. బాధిత కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇదేక్రమంలో సమాచారం అందుకున్న మక్తల్, నారాయణపేట ఫైర్ స్టేషన్ల సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు 50 క్వింటాళ్ల వరకు పత్తి కాలిపోయి బూడిద కావడంతో తనకు రూ. 3.50 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలన్నారు. బాధిత రైతును మాజీ జెడ్పీటీసీ సూర్యప్రకాశ్‌రెడ్డి పరామర్శించి ప్రభుత్వం ద్వారా ఆదుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.