మహబూబ్‌నగర్, మే 12 : జిల్లాలో వరుస చోరీలతో జనం బెంబేలెత్తుతున్నారు. జిల్లా కేంద్రంలో ఓ గుర్తుతెలియని దొంగ రాత్రివేళ్లలో యథేచ్చగా ఇంట్లోకి దూకి చోరీకి పాల్పడేందుకు వెళ్తున్న సీసీటీవీ ఫుటేజీని చూసి అక్కడి స్థానికులు భయపడుతున్నారు. పాలమూరు జిల్లా కేంద్రంలోని మర్లులో నివాసముంటున్న ఓ వ్యక్తి తన ఇంటికి తాళం వేసి శిక్షణకు వెళ్తే.. ఆయన ఇంటితాళం విరగ్గొట్టి రాత్రివేళ్లలో ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్నదంతా దోచుకెళ్లిన ఘటన ఇటీవల చోట్టుచేసుకున్నది. అలాగే పద్మావతికాలనీలో వరుసగా పక్కపక్కన ఇంట్లో కూడా చోరీ ఘటన చోటుచేసుకున్నది. ఇంట్లో విలువైన వస్తువులు 10 తులాల బంగారం, నగదు గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఒకేరోజు మూడిళ్లలో చోరీ జరిగింది. ఇంత జరుగుతున్నా పోలీసుల నిఘా, పెంట్రోలింగ్ బందోబస్తు వైఫల్యం కనిపిస్తుంది. వరుస దొంగతనాలు అటు ప్రజలు, ఇటు పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంటికి తాళం వేసి ఊరికి వేళ్తే చాలు దొంగలు పడుతున్నారు.
జిల్లా కేంద్రంతోపాటు జడ్చర్ల, భూత్పూర్, నారాయణపేట ప్రాంతాల్లో దొంగతనాలు అధికంగా జరుగుతున్నాయి. వేసవిలో ప్రజలు దైవదర్శనాలు, విహారయాత్రలు, బంధువుల ఇళ్లకు వెళ్తుంటారు. ఇదే అదనుగా భావించి దొంగతనాలకు పాల్పడుతుంటారు. దొంగతనాలు జిల్లాలో నిత్యం ఎక్కడో ఓచోట జరుగుతూనే ఉన్నాయి. వాటిని అరికట్టడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతున్నారు. దీనికితోడు చైన్‌స్నాచింగ్, సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వేసవి సెలవులు ఉండడం, మరికొద్ది రోజుల్లో బడులు తెరవనుండడంతో చాలామంది పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు. దీన్ని ఆసరా చేసుకుని దొంగలు రెచ్చిపోయే అవకాశం లేదు. జిల్లా కేంద్రంతోపాటు మహబూబ్‌నగర్ మండలంలోనూ దొంగతనాలు జరుగుతున్నాయి. ఎండలకు ఉక్కపోత భరించలేక గ్రామాల్లో ఇంటిబయట మిద్దెల మీద నిద్రిస్తున్నప్పుడు దొంగలు నగలను అపహరించే ఆవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో విలువైన వస్తువులు పెట్టి మిద్దెలపై పడుకుంటే ఇంట్లో దొంగలు పడే అవకాశం లేకపోలేదు.
సెలవుల్లో ఊరెళ్లేవారు ఇంట్లో విలువైన వస్తువులను పెట్టొదు. అలా వెళ్లిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లేదంటే లాకర్లో బంగారు నగలను భద్రపరుచుకోవాలి. డబ్బు, నగలు పోగొట్టుకుని బాధపడేకన్నా.. ముందు జాగ్రత్తలు తీసుకుంటే నష్టాన్ని నివారించుకోవచ్చు. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కార్లలో వెళ్లేవారు డ్రైవర్ల గురించి ముందుగా తెలుసుకోవాలి. వారి బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుని ప్రయాణిస్తే బావుటుంది. కొత్తవారిని నమ్మి ప్రయాణం చేయొద్దు. కాలనీ, అపార్టమెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. పోలీసుల గస్తీ, పెంట్రోలింగ్ బృందాలను పెంచాం. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించండి.