గద్వాల: సెక్యూరిటీ ( Security ) తగ్గించి మరో పాలమూరు బిడ్డను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ( RS Praveen Kumar) ఆరోపించారు. సెక్యూరిటీ తగ్గించినా, గన్మెన్లను తొలగించినా, నన్ను చంపేందుకు కుట్ర పన్నినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
గద్వాలలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నా గుండుపైన, హరీష్ రావు ఎత్తుపైనా మాట్లాడినట్టు తాను మాట్లాడి సంస్కారహీనుణ్ని కాదలుచుకోలేనని వెల్లడించారు.
నడిగడ్డ సస్యశ్యామలం కావాలని కేసీఆర్ ( KCR ) గట్టు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే పట్టించుకోవడం లేదని, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు. పెండింగ్ పనుల విషయంలో పార్టీ మారిన ఎమ్మెల్యే గద్వాల నియోజకవ ర్గానికి ఎన్నికోట్లు తీసుకొచ్చాడో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో జరిగిన సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని బయటపెట్టి ముగ్గురు సీఎంలు, కేంద్ర మంత్రి నలుగురు కర్ణాటకలో ఏమి మాట్లాడారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
నడిగడ్డలోని నెట్టెంపాడు ర్యాలంపాడు తుమ్మిళ్ల పనులు పూర్తి చేయకుండా పనులు పడావు పెట్టారని విమర్శించారు. దమ్ముంటే నడిగడ్డలో వున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్ర వాళ్లకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఎంపీ మల్లురవి ఢిల్లీకి మూటలు మోయడం తప్పా నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలకు చేసిందేమి లేదన్నారు.
ఇక్కడి ప్రాజెక్టులు పూర్తి చేయించాలనే ఆలోచన ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి లేదని ఆరోపించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ రెగ్యులరైజ్ ఎవరైతే చేస్తున్నారో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా వెంటనే చంచల్ గూడ జైల్లో వారి కోసం సపరేట్ బ్యారక్ కట్టిస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ కేసులో దొరికిన నిరంజన్ జైన్ కు ట్రంక్ పెట్టెలు టెండర్ ఇచ్చారని ఆరోపించారు.ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. ఈ సమావేశంలో గద్వాల బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాస్ హనుమంత నాయుడు, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాకేష్, తదితరులు పాల్గొన్నారు.