‘మాకేం పనిలేదా..? ఆడ చక్రాల కుర్చీ ఉంది సూడు.. తీసుకుపోయి పేషెంట్‌ను తోలుకొనిరా..’ ‘ఇక్కడ రోగం నయం కాదు.. సక్కగా కర్నూలుకు పో..’ ‘మా దగ్గర మందులు లేవు.. ఎక్కడి నుంచి తెమ్మంటావు.. మంచి మందులు కావాలంటే బయట తెచ్చుకో రాసిస్త..’ ఇలా ప్రతిరోజూ ప్రభుత్వ దవాఖానల్లో రోగులతో వైద్యులు, సిబ్బంది చెబుతున్న మాటలు.. ప్రభుత్వం మారింది.. మేము కూడా మారుతాం అనుకున్నారేమో.. మా తీరింతే.. అనేలా వైద్యాధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం, ఉన్నతాధికారుల అజామాయిషీ ఏ మేరకు ఉందో ఇట్టే అర్థమవుతున్నది.
సర్కారు వైద్యం దైవాదీనంగా తయారైంది. ఉమ్మడి జిల్లాలో రోగాలు ఫుల్‌గా ఉంటే వైద్యశాలల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో నిత్యం రోగుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. కానీ మెడిసిన్ సరఫరాకు ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయకపోవడంతో పేషెంట్లకు ఇక్కట్లు తప్పడం లేదు. పలు దవాఖానల్లోని వైద్యులు సూదులు, గోలీలకు బయటి మెడికల్ షాపులకు రెఫర్ చేస్తున్నారు. అరకొర వసతులతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. వైద్య, ఆరోగ్య శాఖాధికారులు ముందస్తుగా అలర్ట్ కాకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, రోగాలొస్తేనే హడావుడి కనిపిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి.. ఎడతెరిపిలేని వానలతో గ్రామాల్లో రోడ్లన్నీ చిత్తడిగా మారి తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. దోమల బెడద కూడా ఎక్కువైంది. గ్రామాల్లో సర్పంచుల పాలన లేకపోవడంతో పారిశుధ్యం పూర్తిగా పడకేసింది. ఫలితంగా జనం రోగాల బారిన పడుతున్నారు. ఇదివరకే సీజనల్ వ్యాధుల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలోని జిల్లా దవాఖానలు, ఏరియా ఆసుపత్రులు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే వైద్య ఆరోగ్యశాఖ అ ప్రమత్తమై జనాలకు ట్రీట్మెంట్ ఇస్తున్న వారికి సరైన మం దులు ఇవ్వడంలో మాత్రం విఫలమవుతున్నారు. రాష్ట్రం లో కాంగ్రెస్ సర్కారు కొత్తగా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సర్కారు దవాఖానల్లో మందులకు నయా పైసా విడుదల చేయలేదు. ఫలితంగా రోగులకు ట్రీట్మెంట్ ఇస్తూ గోలీలకు బయటకు రాస్తున్న దుస్థితి ఏర్పడింది. దీంతో జనం డబ్బులు పెట్టి మందులు కొనలేక సతమతమవుతున్నారు.
మరి కొన్నిచోట్ల ఉన్న మందులను కొన్నికొన్ని ఇ చ్చి చేతులు దులుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఈ పరిస్థితి ఉందంటే మిగతా జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సర్కారు ప్రతి ఏటా ఇచ్చే మందులను సరఫరా చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్రతి జిల్లా నుంచి జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు సంవత్సరానికి సరిపడా వివిధ రకాల మందులను ఇండెంట్ పెడతారు. జిల్లా డ్రగ్స్ యూనిట్ కార్యాల యం నుంచి ఉమ్మడి జిల్లా అంతటా సరఫరా అవుతుంది. కొన్ని జిల్లాల్లో ప్రత్యేక మందుల సరఫరా కేంద్రాలు ఉన్నాయి. కాగా రోగులకు సరిపడా మందులు లేక డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. పైనుంచి రావడం లేదని తామేం చేయలేమని అంటున్నారు. ఈ విషయమై జిల్లా వైద్యశాఖ అధికారులకు సంప్రదించడానికి ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి ప్రయత్నించగా మంత్రుల పర్యటనలో ఉన్నామని చెప్ప డం కోసం మెరుపు. ఇప్పటికైనా సర్కారు మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని దవాఖానలకు మందులను సరఫరా చేసి రోగులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.