మహబూబ్‌నగర్ విద్యావిభాగం, ఆగస్టు 9 : పాఠశాల విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ మెరుగైన విద్యకు పెద్దపీట వేస్తాం.. ఉమ్మ డి పాలమూరు జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తర కుమారుడి ప్రగల్భాలుగానే మిగులుతున్నాయని విద్యావేత్తలు, విశ్లేషకులు పేర్కొంటున్నారు.
పాఠశాల విద్యలో మండలస్థాయి మొదలు డివిజన్, జిల్లా ఉన్నత స్థాయి అధికారి వరకు ఎక్కువగా ఖాళీలే ఉండడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 77మండలాలు ఉండగా రెగ్యులర్ ఎంఈవోలు ఇద్దరు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో విద్యాధికారులు లేకపోవడంతో విద్యావ్యవస్థ కుంటుపడుతున్నది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో ఉపాధ్యాయులు సమయపాలన పాటించట్లేదనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
జిల్లాల పునర్విభజనకు ముందు పూర్వ పు 64 మండలాల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చిన్నచింతకుంట, మక్తల్, ఉట్కూర్, షాద్‌నగర్, తిమ్మాజిపేట, కల్వకుర్తి, పాన్‌గల్, వంగూరు, బల్మూరు మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు. అనంతరం గండీడ్ మండలం పాలమూరులో కలపడంతో ఆ మండల ఎంఈవో ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చారు. ఇలా మొత్తం ఎంఈవోల సంఖ్య పదికి చేరగా ఒకరు ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం బదిలీలు, పదోన్నతులు, డిప్యూటేషన్లు ఇలా అంద రూ స్థాన చలనం కావడంతో ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో ఇద్దరు మాత్ర మే రెగ్యులర్ ఎంఈవోలు మిగిలారు.
ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉండడంతో ఉన్నత పాఠశాలల్లో పనిచేసే కాంప్లెక్స్ హెచ్ఎంలు, జీహెచ్ఎంలకు మండల విద్యాధికారులుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక్కొక్కరికీ 2 నుంచి 12 మండలాల బాధ్యతలు ఉన్నాయి. ఏకీకృత సర్వీస్ రూల్స్ కేసు ఉండడంతో ఎంఈవోల నియామకం జరగడం లేదు. ఇన్చార్జి ఎంఈవోలు పూర్తిస్థాయిలో విధి నిర్వహణ చేయలేకపోతున్నారు. దీంతో విద్యార్థులకు మెరుగైన విద్య అందని ద్రాక్షగా మారింది. స్కూల్ కాంప్లెక్స్‌ల నిర్వహణ, ఉపాధ్యాయుల వేతనాలు, పాఠశాలల పర్యవేక్షణ ఇన్చార్జి ఎంఈవోలకు కత్తిమీద సాములాంటిదే. అదే రెగ్యులర్ ఎంఈవోలు ఉంటే ఇంతగా ఇబ్బంది ఉండదు.
ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో రెగ్యులర్ డీఈవోలు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. అన్ని జిల్లాలకు ఇన్చార్జి డీఈవోలే దిక్కయ్యారు. డిప్యూటీ డీఈవో పోస్టులు కనుమరుగయ్యాయి. విద్యాశాఖలో ముఖ్యమైన పోస్టులన్నీ ఖాళీగా ఉండడంతో పాఠశాల విద్యావ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం జిల్లాలకు కొత్త పోస్టుల ఊసే ఎత్తడం లేదు.
మహబూబ్‌నగర్ డైట్ కళాశాల సీనియర్ అధ్యాపకులు రవీందర్ మహబూబ్‌నగర్ జిల్లా డీఈవోగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. డైట్ కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరాజులు నాగర్‌కర్నూల్, వనపర్తి ఇన్చార్జి డీఈవోగా కొనసాగుతున్నారు. సిద్దిపేట అసిస్టెంట్ డైరెక్టర్ మహ్మద్గనీ నారాయణపేట జిల్లాకు, హైదరాబాద్ బాలభవన్ ఏడీ ఇందిర జోగుళాంబ గద్వాల జిల్లాకు ఇన్చార్జి డీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. డైట్, బీఈడీ కళాశాలల్లో పాఠాలు చెప్పాల్సిన అధ్యాపకులు ఇతర జిల్లాల్లో పర్యవేక్షణ, పరిపాలన చేస్తూ.. భావి గురువులకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.