మహబూబ్‌నగర్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పంచాయతీ ఎన్నికల సమరానికి తెరలేచింది. ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారు గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నది. లోకల్‌బాడీ ఎలక్షన్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సం ఘం మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. మూడు విడుతల్లో డిసెంబర్ 11వ తేదీన తొలి విడుత, 14వ తేదీన రెండో విడుత, 17వ తేదీన మూడో విడుత పోలింగ్ జరగనున్నది. మొ దటి విడుత పోలింగ్‌కు నామినేషన్ ప్రక్రియ ఈనెల 27వ తేదీన, రెండో విడుత ఎన్నికలకు ఈనెల 30న, మూడో విడుత ఓటింగ్‌కు డిసెంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానున్నది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మ ధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుండగా.. మ ధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ జరగనున్నది.
ఆశావహుల్లో ఆశలు
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నికల కోలాహలం మొదలైంది. తొలివిడుత పోలింగ్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆశావహులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ యా పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. మొత్తంపైన ఎన్నికల ప్రక్రి య మొదలవడంతో జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది..
గందరగోళంగా రిజర్వేషన్లు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పంచాయతీలకు, వార్డు సభ్యులకు రిజర్వేషన్లను జిల్లా యంత్రా ంగం ఖరారు చేసింది. మహిళలకు 50 శాతంతోపాటు మిగతా రిజర్వేషన్లు అన్నీ కలిపి 50 శాతం మించకుండా ఈ రిజర్వేషన్లకు తుదిరూపు ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఎన్నికలకు ముందు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాం మాదిరిగానే జీపీ ఎన్నికలకు రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఇచ్చిన ఆదేశాలతో ఆయా జిల్లాల అధికార య ంత్రాంగం రిజర్వేషన్లు ఫైనలైజ్ చేసింది. జిల్లాలోని ఆర్డీవోల సమక్షంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,678 సర్పంచ్ స్థానాల్లో ఎవరికి ఏ స్థానం కేటాయించాలో నిర్ణయిం చి ఈ మేరకు ఎన్నికల సంఘానికి పంపించారు. అయితే మండలం యూనిట్‌గా పరిగణించిన అధికార యంత్రాంగం మహిళలకు.. మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లను సరి సంఖ్యలోకి మార్చి తీసుకోవడంతో గతంలో కేటాయించిన వాటికన్నా తక్కువ సీట్లు వచ్చాయన్న విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాల్సిందేనని.. మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమ యం ఆసన్నమైందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. మొత్తంపైన రిజర్వేషన్లు గందరగోళంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలైంది.
మహిళలకు 50 శాతం పంచాయతీలు!
ఉమ్మడి జిల్లాలోని అన్ని జిల్లాల్లో మహిళలకు 50శాతం మేర రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఆయా జిల్లాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళా స్థానాలకు రిజర్వేషన్లు కల్పించగా.. కొన్ని చోట్ల 50 శాతం అని చెప్పినప్పటికీ ఆ స్థాయి లో రిజర్వేషన్లు దక్కలేదని రాజకీయ పక్షాలు అంటున్నాయి. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు కల్పించి ఆ పంచాయతీలు ఏవో తేల్చి పడేశారు. ఈ మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియను ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ఎన్నికల కమిషన్‌కు నివేదించింది. ఇదిలా ఉండగా సెప్టెంబర్‌లో ప్రచురించిన ఓటర్ల తుది జాబితానే ఓకే చేస్తూ ప్రస్తుతం జరిగే ఎన్నికలు కూడా అదే జాబితా ప్రకారం నిర్వహించనున్నారు.
పల్లెల్లో ‘పంచాయతీ’ కోలాహలం
మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవో హైకోర్టు కొట్టి వేయడంతో ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచింది. అయితే ప్రభు త్వం అది సాధ్యం కాదని తేలడంతో పాత రిజర్వేషన్ల పద్ధతిలోని ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం.. హడావిడిగా రిజర్వేషన్ల ప్రక్రియను మొదలుపెట్టింది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోని నిర్ణయించిన ప్రకారం రిజర్వేషన్లను కల్పిస్తూ.. కొన్ని చోట్ల మార్పులు.. చేర్పులు చేస్తూ తుది నివేదిక రెడీ చేశారు. ఇక ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడడంతో పల్లెల్లో పంచాయతీ కోలాహలం మొదలైంది. ఆయా రిజర్వేషన్ల ప్రకారం క్యాండిడేట్లను ఖరారు చేసే పనిలో పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. పార్టీల ప్రతిపాదికన ఎన్నికలు కాకపోవడంతో చాలామంది ఆశావహులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఉత్తిమాటే..
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు వెళ్తామని రెండేళ్లుగా కాలయాపన చేస్తూ వచ్చింది. చివరకు అది సాధ్యం కాదని తెలియడంతో పాత పద్ధతిలోని రిజర్వేషన్లు కల్పించారు. దీంతో రేవంత్ సర్కారు ఇచ్చిన రిజర్వేషన్ల హామీలు బుట్ట దాఖలయ్యాయి. పంచాయతీల్లో బీసీల ప్రాధాన్యత తగ్గిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇక పార్టీ పరంగా ఇస్తామని ప్రకటించినా ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు పార్టీల ప్రతిపాదికన జరగవు కాబట్టి కాంగ్రెస్ మళ్లీ మోసం చేసే కుట్రలకు తెర లేపిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీసీలను మోసం చేసిన ప్రభుత్వానికి ఎన్నికల్లో తడాఖా చూపిస్తా మని బీసీ జేఏసీ ప్రకటించింది.
మోగిన జీపీ ఎన్నికల నగారా బీసీ రిజర్వేషన్ల పైపోరాడుతాం..
బీసీల కోసం నిలబడే పార్టీ బీఆర్ఎస్. బీసీలకు రిజర్వేషన్లు 42 శాతానికి పెరిగేదాకా పోరాడు తుంది. పార్టీ రహిత సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారు ? బీసీల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడతాం. కాంగ్రెస్ బీసీలకు క్షమాపణ చెప్పాల్సిందే. 46 జీవో తప్పుల తడకగా ఉన్నది.
– శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి, మహబూబ్‌నగర్
