నారాయణపేట, జూన్18 : అడవిపంది ఢీకొట్టిన ప్రమాదంలో గాయపడి, మృత్యువుతో పోరాడుతున్న యువకుడు బ్రెయిన్ డెడ్ అయి సోమవారం చనిపోయాడు. ఆ వివరాలు.. నారాయణపేట మండలంలోని కోటకొండ గ్రామానికి చెందిన నారాయణరావు కుమారుడు రాహుల్(40) జడ్చర్లలోని అరబిందో కంపెనీలో ఉద్యోగి. ఇటీవలే గ్రామానికి వచ్చాడు. 11వ తేదీ మంగళవారం ఉద్యోగానికి బైక్‌పై వెళ్తు న్న క్రమంలో కోటకొండ శివారులోని వింజమూరు గండి వద్ద అడవిపంది బలంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే అతడిని చికి త్స నిమిత్తం హైదరాబాద్‌లోని కేర్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతుండగా సోమవారం బ్రెయిన్‌డెడ్ అయి మృతి చెందాడు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. అతనికి 57 రోజుల కిందట (ఈఏడాది ఏప్రిల్ 21 న) హైదరాబాద్‌కు చెందిన అమ్మాయితో వివాహమైంది. అతని మృతితో ఇరుకుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
కుటుంబ సభ్యులు అంతటి దుఃఖంలోనూ రాహుల్ అ వయవాలను దానంచేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు దవాఖాన నిర్వాహకులు పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విషయం తెలియడంతో నాయకులు నాగురావు నామాజీ, చందులాల్ తదితరులు బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు.