మహబూబ్‌నగర్, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఓటింగ్ సరళి అధికార పార్టీలో గుబులు రేపుతున్నది. సీఎం సొంత జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు చేజారి పోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదేగనుక జరిగితే అధికార పార్టీకి గట్టి దెబ్బేనని పరిశీలకులు భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఐదునెలలు కాకముందే ఎంపీ ఎన్నికల్లో పరాజయం పాలైతే రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. సీఎం సొంత జిల్లాలో పార్టీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 స్థానాలకు గానూ 12 స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లో రెండు స్థానాలను అలవోకగా గెలవొచ్చు కానీ.. అందుకు భిన్నంగా ఈ ఎన్నికల్లో అధికారపార్టీకి ఓటర్లు షాక్ ఇచ్చారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. కాగా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే భయం వేటాడుతున్నది. మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ అభ్యర్థులకు సహకరించలేదని తెలుస్తున్నది. ఎన్నికలు ముగిసినా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు గెలుపోటములపై మాట్లాడకపోవడం గమనార్హం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఇలా ఎంతోమంది సర్కారుపై విముఖత చూపుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత బీఆర్ఎస్కు లాభించగా.. బీజేపీ నేతలు మాత్రం గెలుపు తమదేననే ధీమాతో ఉన్నారు. మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ రెండులక్షల మెజార్టీతో గెలుస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన కాంగ్రెస్ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. కాగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకున్నది.
పాలమూరు పార్లమెంట్ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డిని, నాగర్‌కర్నూల్ స్థానాన్ని మాజీ ఎంపీ మల్లు రవికి కేటాయించారు. ఈ రెండు స్థానాల్లో చాలామంది కాంగ్రెస్ నేతలు టికెట్ కావాలని పోటీపడినా కాదని వీరికి ఇచ్చారు. పాలమూరు ఎంపీ స్థానాన్ని తనకు కేటాయించాలని సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా తిరుపతిరెడ్డి యువసేన పేరుతో ఏకంగా పార్లమెంట్ పరిధిలో భారీ ఫ్లెక్సీలు సైతం వే యించారు. ఏమైందో తెలియదు కానీ.. ఆ ఫ్లెక్సీలను రెండు గంటల్లోనే అ ధికారులతో తీసివేయించారు. దీంతో సీఎంకు తన సోదరుడికి మధ్య వా గ్వాదం జరిగిందని ప్రచారం జరిగింది. వంశీచంద్‌రెడ్డి ఎలా గెలుస్తాడో నే ను కూడా చూస్తానని తిరుపతిరెడ్డి శపథం చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. కందనూలు ఎంపీ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పొందాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. తనకు టికెట్ రాకుం డా మంత్రి జూపల్లి గేమ్ ఆడుతున్నాడంటూ మీ డియా ముందు వాపోయాడు. కాంగ్రెస్‌లో మాదిగలను అణచివేస్తున్నారని గాంధీ భ వన్ సాక్షిగా ప్రకటించారు. ఇంత జరుగుతున్నా వంశీచంద్‌రెడ్డి, మల్లు రవి కి టికెట్లు కేటాయించారు. ఈక్రమం లో రెండు స్థానాలను గెలిచి తీరాలని సీఎం ఆదేశించినప్పటికీ స్థానిక కాం గ్రెస్ నేతలు చేతులెత్తేయడంతో అధికా ర పార్టీకి ఓటమి భయం పట్టుకున్నది.
సీఎం ఆదేశాలు బేఖాతరు..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డిని ము ఖ్యమంత్రిగా నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అనూహ్య విజయాన్ని సాధించడం.. ఇదే జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి సీ ఎం కావడంతో ఆ పార్టీ నేతల్లో ఆశలు చిగురించా యి. అధికారంలోకి చేపట్టిన వెంటనే వచ్చి న పార్లమెంట్ ఎన్నికలను ఆ పార్టీకి పరీక్షగా మారాయి. దీంతో రేవంత్‌రెడ్డి ఎ న్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మహబూబ్‌నగర్ పార్లమెంట్లో ఎనిమిదిసార్లు ప్రచారంలో పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌లోనూ అభ్యర్థికి మద్దతుగా రాహుల్ గాంధీ, సీఎం ప్రచారం చేపట్టారు. ఉమ్మడి జిల్లాలోని 12 అ సెంబ్లీ స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీకి ఈ ఎన్నిక లు సవాల్‌గా మారాయి. సీఎం సొంత జిల్లా కావడంతో నేతలంతా చాలెంజింగ్‌గా తీసుకున్నారు. కా నీ అసెంబ్లీ ఎన్నికల సీన్ మాత్రం రిపీట్ కాలేదని ఆ పా ర్టీ నేతలే అంటున్నారు.
ఇటు పాలమూరు, అటు కందనూలు ఎంపీ అభ్యర్థులిద్దరూ ఎమ్మెల్యేలను బేఖాతరు చేయడంతో ఆ పార్టీ ఓటమిని కొనితెచ్చుకున్నట్లుయ్యింది. అభ్యర్థులు తమను కాదని సొంత ఎ జెండాతో ప్రచారానికి దిగడంతో ఎమ్మెల్యేలు చేతులెత్తేశారు. మంత్రి జూపల్లి కూడా నామమాత్రంగానే ప్రచారం చేశారు. సొంత జిల్లాలో గెలిచి తీరాలని సీఎం హెలికాప్టర్లో చక్కర్లు కొ ట్టినా.. ఎమ్మెల్యేలు మాత్రం అభ్యర్థులతో కలిసి నామమాత్రంగా ప్రచారంలో పాల్గొన్నారు. కిందిస్థాయి నేతలను పట్టించుకోకపోవడంతో క్రాస్ ఓటింగ్‌కు అవకాశం ఏర్పడింది. ఎమ్మెల్యేల తీరుపై వంశీచంద్‌రెడ్డి ఏకంగా నేతలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఐదు నెలలై నా గ్యారెంటీలను అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది. ఇది పార్లమెంట్ ఎన్నికలపై స్పష్టంగా పడిందని చెప్పవచ్చు. కాగా కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో చేపట్టిన రోడ్ షో పార్టీ క్యాడర్లో జోష్‌ను నిం పింది. ఈక్రమంలో కాంగ్రెస్ కన్నా బీ ఆర్ఎస్సే మేలు అనే భావన ప్రజల్లో వచ్చింది. దీంతో ఓటర్లు గులాబీ పంచన చేరడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ బీఆర్ఎస్కు కలిసొచ్చాయి.
ఎంపీ ఎన్నికలు ముగిశాయో లేదో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ రెండులక్షల మెజార్టీతో గెలుస్తానని ప్రకటించడంపై విమర్శలొస్తున్నాయి. డీకే అరుణ అప్పుడే ఎంపీ అయిపోయినట్లు భ్రమ పడుతున్నారని ఆయా పక్షాలు విమర్శ లు గుప్పిస్తున్నాయి. ఎంపీ ఎన్నికల్లో ఓటర్లు క్రాస్ ఓటింగ్‌కి పాల్పడినట్లు స్పష్టంగా తేలుతు న్నా.. బీజేపీ నేతలు మాత్రం మేమే గెలిచామని సంబురపడిపోవడాన్ని చూసి.. ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అ న్నట్టు ఉందని సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా క్రాస్ ఓటింగ్ భయం ఆయా పార్టీలను వెంటాడుతోంది. విజయం ఎవరిని వరిస్తుందనేది ఫ లితాల రాకతో స్పష్టం కానున్నది.