అచ్చంపేటరూరల్ : అసంబద్ధమైన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ( Tapas) నాగర్కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్ ముదిరాజ్ ( Shekar Mudiraj ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జూన్ 6వ తేదీ నుంచి 19 వరకు 14 రోజులపాటు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, జూన్ ఆఖరు వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముందని వెల్లడించారు.
అయితే ప్రభుత్వం ప్రకటించిన బడిబాటను, ప్రస్తుతం నడుస్తున్న తల్లిదండ్రుల సమావేశాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా గత సంవత్సరం విద్యార్థుల సంఖ్య ఆధారంగా సర్దుబాటు చేయాలని ఉత్తర్వులను విడుదల చేయడం దారుణమని అన్నారు. ప్రభుత్వం జూన్ 13 వరకే సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వులు విడుదల చేయడం అన్యాయమని అన్నారు. సర్దుబాటు చేయాలనుకుంటే జూన్ చివరి నాటికి నమోదయ్యే విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేయాలని సూచించారు.