మహబూబ్‌నగర్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు జిల్లా గులాబీని గుండెలకు హత్తుకుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనం. మూడు విడుతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో హోరాహోరీగా అధికా ర పార్టీతో తలపడింది. ఫైనల్ ఫలితాలు తెలిస్తే ఊమ్మడి జిల్లాలో 531 స్థానాలు కైవసం చేసుకున్నారు. చాలా పంచాయితీల్లో నువ్వా నేనా అన్న రీతిలో పోటీపడ్డారు. దాదాపు 60 స్థానాలను బీఆర్ఎస్ మద్దతుదారులు కొద్దిపాటి తేడాతో ఓడిపోయారు.
దాదాపు పది స్థానాల్లో అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గి ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో సరిపట్టుకున్నా రు. పదుల సంఖ్యలో ఏకగ్రీవాలు చేస్తామని చెప్పి అధికార పార్టీ నేతలు నమ్మించి తమ ఖాతాలో వేసుకున్నారు. అయినా ప్రత్యక్ష ఎన్నికల్లో జనం గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించి కేసీఆర్‌పై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. సాక్షాతూ బీఆర్ఎస్ దాటికి సాక్షాత్తు సీఎం రేవంత్ సొంత మండలంతోపాటు స్వగ్రామం చుట్టూ పక్కల కారు జోరు కొనసాగింది. ఇక మంత్రులు ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో కూడా దడ పుట్టించారు. తొలి విడుత పంచాయతీ ఫలితాలు ప్రతికూలం కాగానే మం త్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధికి సహకరించమని చెప్పినప్పటికీ ప్రజలు టిఆర్ఎస్ మద్దతు దారులకే పట్టం కట్టారు.
మూడు విడుతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు దాదాపు 531 స్థానాల్లో గెలుపు బావుట ఎగరవేశారు. మరికొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్థులకు మద్దతి ఇచ్చి గెలిపించుకున్నా రు. ఇలా గెలిచిన స్వతంత్రులను తమ వైపు లాక్కునేందుకు అధికార పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యా యి. ఇంత చేసిన కాంగ్రెస్ కు దక్కిన స్థానాలు కేవలం 879 మాత్రమే. మాజీ మంత్రు లు లక్ష్మారెడ్డి శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మా జీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెం కటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జై పాల్‌యాదవ్, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి, ఎ మ్మెల్యే విజయుడు, గ ద్వాల పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు సమిష్టి కృషి చేయడంతో ఆయా నియోజకవర్గాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది.
ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహమే.. పంచాయతీ ఎన్నికల్లో..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పని అయిపోయిందని అధికార పార్టీ అనుకుంటున్న తరుణంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు క్యాడర్‌ను నేతలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చాయి. సాక్షాత్తు సీఎం సొంత జిల్లా అయినప్పటికీ బీఆర్ఎస్కు చెందిన నేతలంతా సమిష్టిగా కృషిచేసి ఏకంగా ఎమ్మెల్సీ స్థానాన్ని సాధించుకొని సత్తా చూపించారు. అదే ఊపుతో పంచాయతీ ఎన్నికలను కూడా పక్కా వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లి పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 40 శాతం పైగా స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇది అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తొలి విడుత ఫలితం తర్వాత అధికార పార్టీ నేతలు టిఆర్ఎస్ మద్దతుదారులపై అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్‌కు పోలీస్ గులాంగిరి..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీకి పోలీసు యంత్రాంగం దాసోహంగా మారింది. అనేక చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులను నిర్బంధంలోకి తీసుకొని పోలింగ్‌కు అనుకూలంగా వ్యవహరించారు. మరికొన్ని చోట్ల నాయకులను ఏకం చేసి బీఆర్ఎస్ గెలవకుండా కట్టడి చేశారు. ఇక ఇంటలిజెన్స్ విభాగం ఇప్పటికిప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎలా అయితే గెలుస్తామో చెబుతూ.. ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
కొన్నిచోట్ల బీఆర్ఎస్ నేతలపై అకారణంగా కేసులు బనాయిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పోలింగ్ బూత్‌ల దగ్గర కూడా కాంగ్రెస్ నేతలు ఎక్కువగా ప్రచారం చేసుకునే విధంగా పరిస్థితులు కల్పించారు. ఇక ఉన్నత అధికారులు పోలీస్ యంత్రాంగంపై ఎన్ని ఆరోపణలు పట్టించుకోకపోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఇకా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసులు హడావిడి అంతా ఇంత కాదు. బీఆర్ఎస్ మద్దతు దారులు గెలిచిన చోట సంబురాలు చేసుకునేందుకు అనుమతి లేదం టూ.. అదే కాంగ్రెస్ మద్దతు దారులు సంబురాలు చేసుకున్న పట్టిపట్టనట్లు వ్యవహరించారు.
కొన్ని పోలింగ్ బూత్‌ల దగ్గర కాంగ్రెస్ నేతలు పోలీసులపైనే అసభ్యంగా ప్రవర్తించినా చూసి చూడనట్లు వెళ్లిపోవడం కనిపించింది. దేవరకద్ర నియోజకవర్గంలో ఒక నాయకుడు నేను ఎమ్మెల్యే ముఖ్యానించారు నన్నే అడ్డుపడతావా అంటూ ఓ పోలీస్ అధికారిపై చిందులు తొక్కడం ఓటర్లను విస్మయపరిచింది. టిఆర్ఎస్ నేతలపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు సమాచారం అందించిన చివరికి ఓటర్లు కారుకే జై కొట్టడంతో చివరికి పోలీసుల వల్లే ఓడిపోయామని కొంతమంది ఎమ్మెల్యేల వద్ద వాపోయినట్లు తెలిసింది. మొత్తం పైన ఎన్నడు లేని విధంగా పోలీస్ యంత్రాంగం పంచాయితీ ఎన్నికల్లో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.
ప్రజలకు ధన్యవాదాలు
పంచాయతీ ఎన్నికల్లో ఓట్లువేసి ఆశీర్వదించిన ప్రజలకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు. జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ తన సత్తా చాటింది. అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 188 గ్రామ పంచాయతీలు ఉండగా 85 గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండా ఎగరేసింది బీఆర్ఎస్. అధికార పార్టీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకొని కారు జోరు చూపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందనే అభిప్రాయాన్ని తప్పని ఋజువు చేసింది. అధికారంలో లేకపోయినా జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్కు అండగా నిలిచిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాల అభివృద్ధి కోసం పని చేస్తాం. అధికార పార్టీని ఎదిరించి విజయం సాధించిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంతటి ఘన విజయం కోసం శ్రమించిన పార్టీ నాయకత్వానికి ప్రత్యేక అభినందనలు.
– చర్లకొల లక్ష్మారెడ్డి, మాజీ మ్ంరత్రి, బీఆర్ఎస్ పాలమూరు జిల్లా అధ్యక్షుడు
ఇక మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలపై ఫోకస్
పంచాయతీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన అధికార పార్టీ మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా ఇదే ఊపులో పెట్టాలని భావిస్తుంది. లేకపోతే ప్రజా వ్యతిరేకత తీవ్రమైపోయి ఈపాటి స్థానాలు కూడా రావని భావించి ముందుకు వెళ్తుందనే ప్రచారం జరుగుతుంది. ఇక బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ మండలాలు, జిల్లా పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇదే ఊపుతో వచ్చే ఎన్నికల్లో పోరాడి గెలవాలని కేడర్‌కు పిలుపునిస్తున్నారు.
513 కి పైగా పంచాయతీలు కైవసం..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు విడుతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు దాదాపు 513కి పైగా పంచాయతీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అడ్డదారులు తొక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా బీఆర్ఎస్ కేడర్ మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ ఆగడాలను ఎదుర్కొని బీఆర్ఎస్ మద్దతు దారులను గెలిపించారు. ఉమ్మడి జిల్లాలో జడ్చర్ల నియోజకవర్గంలో అత్యధికంగా 85 పంచాయతీలను కైవసం చేసుకునీ రికార్డు సాధించింది. ఇక మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 24 స్థానాలు, కొల్లాపూర్ 58, అలంపూర్ 55, అచ్చంపేటలో 49, నాగర్‌కర్నూల్‌లో 54, దేవరకద్రలో 41, కల్వకుర్తిలో 37, గద్వాల్లో 13, నారాయణపేటలో 36, మక్తల్ లో 32, వనపర్తి నియోజకవర్గంలో 47 స్థానాలు గెలుచుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు మరో 30 నుంచి 40 మంది ఇండిపెండెంట్లు కారు ఎక్కేందుకు రెడీ అవుతున్నారు.