మహబూబ్‌నగర్, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సరిహద్దులో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. రోజుకు రూ.4లక్షలు మామూళ్లు ఇస్తున్నామని.. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని ఇసుక మాఫియా బహిరంగంగా చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఆదివారం కృష్ణానదిలో నాలుగు హిటాచీలు 40 టిప్పర్లలో ఇసుకను నింపుతుండగా సమీప గ్రామస్తులు అడ్డుకొని ఇసుక టిప్పర్లను వెనక్కి పంపించారు.
అయినా గానీ పోలీసు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి రాకపోవడం కొసమెరుపు. కొన్ని రోజులుగా కృష్ణానదిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం అటువైపు వెళ్లకపోవడం అనుమానాలకు బలం చేకూరుతోంది. కర్ణాటక, తెలంగాణ సరిహద్దులో ఇసుక దందా రాత్రింబవళ్లు కొనసాగుతోంది. ప్రతిరోజూ 200 టిప్పర్లు రాత్రీపగలు తేడా లేకుండా కర్ణాటకకు పంపించి సొమ్ము చేసుకుంటున్నారు.
దీని వెనుక మక్తల్‌కు చెందిన ఒక ప్రజాప్రతినిధి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారం రోజుల కిందట కొంతమంది యువకులు రాత్రి సమయంలో గ్రామానికి వెళ్తుండగా, ఇసుక టిప్పర్లు అడ్డుగా రాగా, తృటిలో ప్రమాదం తప్పింది. డ్రైవర్లను హెచ్చరిస్తే ఇసుక మాఫియా వచ్చి ఇద్దరు యువకులపై దాడి చేసి ఫోన్లు లాక్కొని పగలగొట్టారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు కృష్ణానదిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అడ్డుకొని టిప్పర్లను వెనక్కి పంపించారు. ఇంత జరుగుతున్నా తమకేమీ తెలియదని మక్తల్ సీఐ చెప్పడం కొసమెరుపు.
మామూళ్లే రోజుకు రూ.4లక్షలు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణానదిలో ఇసుక దొంగలు పడ్డారు. అధికార పార్టీ అండదండలతో ఏకంగా నదిలో రోడ్లు నిర్మించి రాత్రింబవళ్లు అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నారు. సుమారు నాలుగు ప్రాంతాల్లో ఈ ఇసుక దందా కొనసాగుతోంది. ఏకంగా నదిలో నాలుగు చోట్ల హిటాచీలను దింపి పెద్ద పెద్ద టిప్పర్లలో ఇసుక నింపి తరలిస్తున్నారు. వీళ్లు ఇచ్చే మామూళ్లు రోజుకు రూ.4లక్షలని జోరుగా ప్రచారం జరుగుతున్నది.
నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల సమీపంలో ఇసుక దందా కొనసాగుతోంది. ఎండాకాలం కావడంతో నదిలో ప్రవాహం అడుగంటింది. దీంతో ఏకంగా నదిలో రహదారి నిర్మించుకొని పెద్దపెద్ద టిప్పర్లలో తరలిస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని రైతులను ప్రలోబపెట్టి వారి పొలాల్లో దర్జాగా రోడ్లు వేశారు. రాత్రింబవళ్లు టిప్పర్లు తిరుగుతుండడంతో సమీప గ్రామాల్లో దుమ్మూ, ధూళి పడుతుండగా, ఇదేమిటని ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారు.
ఇద్దరు యువకులను చితకబాదిన ఇసుక మాఫియా..
ఇసుక దందాకు అడ్డువచ్చిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. ముడుమాలకు చెందిన ఇద్దరు యువకులు రాత్రి పూట గ్రామానికి వెళుతుండగా ఇసుక టిప్పర్లు వేగంగా రావడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెంటనే ఆ టిప్పర్లను ఆపి డ్రైవర్లను నిలదీస్తుంటే అక్కడికి చేరుకున్న ఇసుక మాఫియా ఈ ఇద్దరు యువకులపై దాడికి పాల్పడింది. వారి ఫోన్లను లాక్కొని పగులగొట్టి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని బెదిరించి పం పించారు.
ఈ విషయం గ్రామస్తులకు తెలిపి కృష్ణ పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి వారం రోజులు గ డుస్తున్నా పోలీసు లు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆదివారం ఇసుక అక్రమ రవాణాలను అడ్డుకున్నారు. నదిలో ఇసుకను నింపిన టిప్పర్లను ఖాళీ చేయించి తిప్పి పంపించారు. ఇంత జరుగుతున్నా పోలీస్ రెవిన్యూ యంత్రాంగం మాత్రం కన్నెత్తి చూడలేదు. గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం పను అనుమానాలకు తవిస్తోంది.
ప్రజాప్రతినిధి అండదండలతో..
నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలో నదిలో ఇసుక దందా వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారన్నది బహిరంగ రహస్యం. అయితే ఇసుక దందాకు మక్తల్‌కు చెందిన ఓ ప్రజా ప్రతినిధి అండదండలు ఇవ్వడంతో అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కృష్ణానదిలో టిప్పర్లు పెట్టి రూ.కోట్ల విలువైన ఇసుకను తరలిస్తున్నా అటువైపు అధికారులు కన్నెత్తికూడా చూడడం లేదు. ఈ ఇసుక మొత్తం తెలంగాణ సరిహద్దులో కర్ణాటక ప్రాం తంలో నిర్మిస్తున్న భారీ పారిశ్రామిక వాడకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కృష్ణ మండలం లో కర్ణాటక సరిహద్దు రెండు మూడు కిలోమీటర్ల ఉండడంతో ఇసుక మాఫియాకు కలిసి వచ్చింది.
గ్రామస్తులను బెదిరిస్తూ..
మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలంలో జరు గుతున్న ఇసుక అక్రమ రవాణా వెనుక అధికార పార్టీ నేతలే ఉన్నారనేది ఆరోపణ. నలుగురు నా యకులు ఈ ఇసుక దందా వెనక ఉన్నట్లు తెలుస్తోం ది. దీంతో అధికార యంత్రాంగం కూడా పట్టించుకోవడం లేదు. రాత్రింబవళ్లు టిప్పర్లు తిరిగి ముడుమాల్, గుడెబల్లూరు రహదారి పూర్తిగా ధ్వంసం అవుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముడు మాల, ము రారిదొడ్డి, గుడెబల్లూరు గ్రామాల ప్రజ లు ఇదేమిటని ప్రశ్నిస్తే వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటివరకు దాదా పు 10మందిపై దాడులు జరిగినా పోలీ సు, రెవెన్యూ యంత్రాంగం పట్టించు కోకపోవడం విడ్డూరంగా ఉన్నది.
మాకు ఫిర్యాదు రాలేదు..
ముడుమాల్ గ్రామం వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో కేసులు నమోదు చేశాం. పోలీసులకు మామూళ్లు ఇస్తున్నట్లు చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. ముడుమాల్ యు వకులను కొట్టినట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు రాలే దు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
– రాంలాల్,సర్కిల్ ఇన్స్పెక్టర్, మక్తల్