వనపర్తి, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : యాసంగి సీజన్లో పండిన వరి ధాన్యం కొనుగోళ్లు అయోమయంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 20రోజుల కిందటే వరి కోతలు షురూ చేశారు. ఈ క్రమంలో జిల్లాలో వరి కొనుగోళ్ల సెంటర్లు కొన్ని తెరుచుకున్నాయని అధికారులు చెబుతున్నా కొనుగోళ్లు మాత్రం ముందుకు సాగడం లేదు. జిల్లాలోని 15 మండలాల్లో యాసంగిలో వరిపంట భారీ విస్తీర్ణంలో సాగైంది. ప్రభుత్వం క్రాఫ్ హాలిడేలు ప్రకటించినా నీటి వనరుల ఆధారంగా వరి విస్తీర్ణం భారీగానే ఉంది. జూరాల, భీమాల కింద వారబంధి లెక్కన నీటి విడుదల కొనసాగడం, కేఎల్ఐ పథకంలోనూ సాగునీరు అందించడంతో యాసంగి చేలు చేతికి వచ్చాయి. గడిచిన వానకాలం సమృద్ధి వర్షాల ప్రభావంతో బోరు, బావుల కింద కూడా వరినాట్లు పడ్డాయి.
జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో లక్షా 80వేల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు అంచనా ఉంది. ఇదిలా ఉంటే, ఈపాటికే సెంటర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాలి. 20రోజులకు పైగా రైతులు కోతలు పూర్తి చేసుకొని ఎదురు చూస్తున్నారు. సాయంత్రం వేళల్లో గాలులు, జల్లులు వస్తుండటంతో అన్నదాతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ యాసంగి సీజన్ కొనుగోళ్లపై రైతులకు అయోమయం..గందరగోళం నెలకొన్నది. ప్రభుత్వం కొనుగోళ్ల ప్రక్రియను ఇలాగే ఆలస్యం చేస్తే ప్రైవేట్లో విక్రయాలు చేసుకుంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే సెంటర్లు తెరిచినా గన్నీ బ్యాగులు లేకపోవడం, మరికొన్ని చోట్ల ఇతర సమస్యల పేరు చెప్పి కొనుగోళ్లను ముందుకు సాగనివ్వడం లేదన్న విమర్శలు వెలువడుతున్నాయి.
3.50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం..
ఈసీజన్లో జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనుగోళ్లపై పలు దఫాలు సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లపై దృష్టి సారించారు. అయితే యాసంగిలో సన్నరకం వడ్లు 1.91లక్షల మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం వరి 2.07లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందన్న అంచనా వేశారు. ఇందుకోసం 382 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. వీటిని ఐకేపీ మహిళా సంఘాల ద్వారా 149 కేంద్రాలు, పీఏసీసీఎస్ల ద్వారా 224, మెప్మా నుంచి మరో 9 కేంద్రాలను సిద్ధం చేశారు. ముందస్తుగా వరి కోతలు ఆత్మకూరు, అమరచింత, మదనాపురం, కొత్తకోట, పెద్దమందడి, వీపనగండ్ల, పెబ్బేరు మండలాల్లో వరి కోతలు జోరుగా నడుస్తున్నాయి.
ముందుకు రాని మిల్లర్లు..
యాసంగిలో అధికమొత్తంలో దొడ్డు రకం వరి వస్తున్నందునా మిల్లర్లు సహితం బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. గతంలో తీసుకున్న ధాన్యం ఇంకా ఉన్నందునా అనుకున్న స్థాయిలో మిల్లర్లు సుముఖత చూపడం లేదు. ఇటీవల కొనుగోళ్లపై కలెక్టర్ ఆదర్శ్ సురభి మిల్లర్లతో ఈనెల 17వ తేదీ నిర్వహించిన సమీక్షలో తప్పనిసరి 10శాతం బ్యాంక్ గ్యారెంటీలతోపాటు అగ్రిమెంట్లు చేసుకోవాల్సిందేనంటూ స్పష్టం చేశారు. అయినా.. ఆసక్తిగా మిల్లర్లు ముందుకు వచ్చిన పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు కేవలం 19 మిల్లులు మాత్రమే యాసంగి ధాన్యం నిల్వకు అర్హత ఉన్నట్లుగా గుర్తించినా వారు సహితం బస్తాలు దింపుకొనేందుకు ముందుకు రావడం లేదు.
నిల్వకు చోటు లేదు..
వరి ధాన్యం నిల్వ చేసేందుకు జిల్లాలో గోదాంలు ఖాళీగా లేకపోవడం అత్యంత తీవ్రమైన సమస్యగా పరిణమించింది. వరి సాగుబడులకు తగ్గట్టుగా జిల్లా లో గోదాంల ఏర్పాటు లేదు. కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మాణం చేసిన గోదాంలు మాత్రమే ఉన్నాయి. గత పదేళ్లుగా వరి ధాన్యం భారీగా పండుతుంది. ప్రతి సీజన్లోనూ ఇతర జిల్లాలకు తరలించడం జరుగుతుంది. గత వానకాలం సీజన్లోనూ ఇదే తంతును అధికారులు అవలంభించారు. ప్రస్తు తం జిల్లాలో ఉన్న గోదాంలు గత యాసంగి సీజన్ ధాన్యంతో నిండిపోయి ఉన్నాయి.
ఆయా సీజన్లకు సంబంధించి కేవలం సన్నరకం వడ్లను మాత్రమే ఇతర జిల్లాలకు కేటాయించి చేతులు దులుపుకొన్నారు.ఇలా పెండింగ్ పడటంతోనే ప్రస్తుతం నిల్వ సమస్య ఏర్పడింది. సన్నవడ్లకు మాత్రమే ప్రాధాన్యతనివ్వడం, దొడ్డు రకం వడ్ల నిల్వలను నిర్లక్ష్యం చేయడంలాంటి వాటితో సమస్య పెరుగుతుంది. మిల్లర్లు సన్నరకానికే ప్రాధాన్యతనిచ్చిందునా అధికార యంత్రాంగం అదే దారిన వెళ్లింది. ఈ పరిస్థితిలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లాలో సీజ్ చేసిన రైస్మిల్లులను, పిల్లలు లేకుండా మూతపడిన ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి యాసంగి వరి ధాన్యం నిల్వ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
చిరిగిన గన్నీ బ్యాగులతో అవస్థలు

మాగనూర్, ఏప్రిల్ 27 : మాగనూర్ మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వరిధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తరుగు, తాలు మాట అ టుంచితే గన్నీ బ్యాగుల పెద్ద సమస్యగా మారాయి. సరఫరాలో కొరత అందులోనూ చిరిగిన బస్తాలను సరఫరా చేస్తున్నారు. వాటిలో ధాన్యం నింపే పరిస్థితే లేదని రైతులు వాపోతున్నారు. రైతులు కేంద్రా ల నుంచి గన్నీబ్యాగుల బండిళ్లను ట్రాక్టర్ల ద్వారా తెచ్చుకుంటున్నారు. వాటిని విప్పి చూస్తే తెచ్చుకున్న వాటికిలో 90శాతం బస్తాలు పూర్తిగా చిరిగిపోయి ఉన్నాయని రైతులు వాపోయారు. వర్కుర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతులకు పూర్తిగా చిరిగిపోయిన బస్తాలు ఇస్తున్నట్లు గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
చిరిగిన బస్తా ల్లో 30కేజీలు కూడా పట్టడం లేదని గన్నీ బ్యాగులను రైతులు కుట్టుకొని ఒక దానిలో ఒకటి వేసి ఒక బస్తాగా చేసుకొని వడ్లు హమాలీలు నింపుతున్నట్లు రైతులు వాపోయారు. చిరిగిన బ స్తాల నుంచి వడ్లు కింద పడకుండా రైతులు గడ్డితో మూసి లారీలకు నింపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అడిగిన్నని గన్నీ బ్యాగులు ఇవ్వలేని ప రిస్థితుల్లో పీఏసీసీఎస్ సిబ్బంది ఉన్నారని రైతులు వాపోయారు. ఇప్పటికైనా చిరిగినవి కాకుండా కొత్త గన్నీ బ్యాగు లు రైతులు అందజేసి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలను రైతులు కోరుతున్నారు.
కొనుగోళ్లు చేస్తున్నాం..
జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్లో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందన్న అంచనా ఉంది. ప్రస్తుతం ఉన్న గోదాంలో గత యాసంగి దొడ్డురకం ధాన్యం ఉంది. కొ న్ని డిఫాల్ట్ అయిన రైస్ మిల్లులు, మరో 31 మూతపడిన పాఠశాలలను గుర్తించాం. మొత్తం 382సెంటర్లకు గానూ 62 కేంద్రాలను ప్రారంభించాం. రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీలకు ముందుకు వస్తున్నారు. ఇప్పుడే కొనుగోళ్ల పనులు మొదలయ్యాయి. ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకొని కొనుగోళ్లు జరిపిస్తాం.
– కాశీవిశ్వనాథ్, డీఎస్వో, పౌరసరఫరాల శాఖ, వనపర్తి
కంటి మీద కునుకు లేదు..
గాలి, వానలకు కంటిమీద కునుకు రా వడం లేదు. 12 ఎకరాలు వరి వేసుకున్న. చేనంతా చేతికి వచ్చింది. ఇప్పుడు సగమే కోత చేశాను. ఇప్పటికే 12 రోజులు గడిచింది. ఒక్కరోజు మాత్రమే తూకాలు చేసి నిలిపివేశారు. గోదాంలు లేవని, లారీలు రాలేదని, గన్నీ బ్యాగులు ఎప్పుడు వస్తాయో తెలియదని చెబుతున్నారు. మాకెందుకు ప్రభుత్వం ఇలా పరీక్షలు పెడుతున్నది. అధికారులు తూకాలను వెంట..వెంటనే చేయించండి. చేతికి వచ్చిన ధాన్యం గాలి,వానలకు చెల్లాచెదురు అవుతున్నది.
-వెంకట్ రెడ్డి, రైతు, కొత్తకోట, వనపర్తి జిల్లా
ఒక్క బస్తా ఎత్తలేదు..
12 రోజులైంది నా చేను కోసి. 8 ఎకరాలుంటే, సగం చేను కోసినా ఇంకా సగం ఉం ది. ఎమ్మెల్యే సెంటర్ ప్రారంభిస్తే…పని బాగా జరుగుతుందనుకున్న. తూకం చేయరు.. తూకం చేస్తే లారీలకు ఎత్తరు. ఇప్పటి వరకు మా సెంటర్ నుంచి ఒక్క బస్తా కూడా లారీకి ఎత్తలేదు. గాలి..వాన సమస్య ఎదుర్కొంటున్నాం. కవర్లు లేవు..ఇతర ఏర్పాట్లు కూడా ఏమీ లేవు. ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలే. వెంటనే సర్కారు ధాన్యం కొనుగోలు సాఫీగా చేయించాలి.
– గుజ్జిల అంజి, రైతు, రామన్పాడ్, మదనాపురం మండలం, వనపర్తి జిల్లా