జడ్చర్ల, జనవరి 2: ముక్కోటి ఏకాదశిని నియోజకవర్గ ప్రజలు సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాల్లో భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. వైష్ణవాలయాలను విద్యుత్ద్దీపాలు, పూలతో సుందరంగా అలంకరించి తీర్చిదిద్దారు. తెల్లవారుజామున నుంచే భక్తులు జడ్చర్లలోని వేంకటేశ్వరస్వామి, గంగాపూర్‌లోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. జడ్చర్ల లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వ్యవస్థాపక ధర్మకర్త భీంసేనాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు సుధీంద్రాచార్యులు, రవీంద్రాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలతోపాటు అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించారు. ఉత్తరద్వార దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయాల వద్ద సీఐ రమేశ్‌బాబు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. బాదేపల్లిలోని రమాసహిత సత్యనారాయణస్వామి ఆలయంలో పట్టణంలోని భక్తులు పూజలు నిర్వహించారు. జడ్చర్లలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఉత్తద్వారంలో వెళ్లి స్వామివారిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీరామకొండలో..
కోయిలకొండ, జనవరి 2: మండలకేంద్రంలోని స్వయంభూ రామపాద క్షేత్రం శ్రీరామకొండలో స్వామికి ప్రత్యేక అభిశేషం, తులసీ, విష్ణు సహస్రనామార్చన పూజలను నిర్వమించారు. మండలకేంద్రంలోని లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తులు ఉత్తరద్వారంలో స్వామివారిని దర్శించుకొన్నారు. వింజామూర్, చింతల్‌తండా, మోదీపూర్, కొతలాబాద్, సురారం, కనాయపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
గడీడ్ మండలంలో..
గండీడ్, జనవరి 2: మండలంలోని పలు ఆలయాలు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైష్ణవ క్షేత్రాలు వైకుంఠద్వారాలు తెరుచుకుంటుండడంతో ఉత్తద్వార దర్శనం చేసుకున్నారు. జంగంరెడ్డిపల్లి, వెన్నాచేడ్‌లో లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాలున్నాయి. జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి దంపతులు జంగంరెడ్డిపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలకేంద్రంలో..
దేవరకద్ర, జనవరి 2: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మండలకేంద్రంలోని చెన్నకేశవ స్వామి ఆలయంతోపాటు వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయాల్లో సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తద్వార దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా వాసవీ కన్యాకాపరమేశ్వరి ఆలయంలో సీతారామచంద్ర స్వామివారి పల్లకీసేవ నిర్వహించారు. అనంతరం సామూహిక విష్ణుసహస్రనామ పారాయణ నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
పంచాముఖాంజనేయస్వామి ఆలయంలో..
మహబూబ్‌నగర్, జనవరి 2: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం శ్రీనివాసకాలనీలోని పంచాముఖాంజనేయస్వామి ఆలయంలో అయ్యప్పస్వాములు, కాలనీ వాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పటేల్ప్రవీణ్కుమార్, నగేశ్‌కుమార్, లక్ష్మీనర్సింహులు, కృష్ణయ్యయాదవ్, ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలో..
పాలమూరు, జనవరి 2:మహబూబ్‌నగర్ పట్టణంలోని కాటన్‌మిల్లు వేంకటేశ్వరస్వామి ఆలయంలో పాలమూరు కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారిని ఉత్తద్వారం ద్వారా దర్చించుకోవడానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తద్వారంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కార్యక్రమంలో పాలమూరు కంచికామకోటి పీఠం సభ్యులు రాఘంవేదర్శర్మ, శ్రీకాంతశర్మ, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
గోవిందనామంతో మారుమోగిన మన్యంకొండ
పాలమూరు, జనవరి 2: మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా గోవిందనామ స్మరణతో మారుమోగింది. తెల్లవారుజామున శేషవాహన సేవ వైభవంగా నిర్వహించారు. స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉత్తద్వార దర్శనం చేసుకుకున్నారు. అర్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ చేసి, పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి అధికసంఖ్యలో తలనీలాలు సమర్పించారు. పాలమూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం అందించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చైర్మన్ అలహారి మధుసూదన్‌కుమార్, ఈవో శ్రీనివాసరాజు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మల్లు దేవేందర్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్, నిర్వాహకులు శ్రీనివాస్‌గౌడ్, ఆలయ ఆర్చకులు, సిబ్బంది, స ర్పంచులు, పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో..
పాలమూరు, జనవరి 2:మహబూబ్‌నగర్ పట్టణంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వామివారికి తెల్లవారుజామున శేషవాహన సేవ నిర్వహించారు. స్వామివారి సేవలో భక్తులు గోవిందనామస్మరణ, భజన పాటలతో ఆలయం మారుమోగింది. స్వామివారిని ఉత్తద్వారం ద్వారా దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో బారులుదీరారు. కార్యక్రమంలో ఆలయ సుందరీకరణ సభ్యులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
పులకించిన కాంచన గుహ
దేవరకద్ర రూరల్, జనవరి 2: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం భక్తులు భక్తిశ్రద్ధలతో స్నానాలు ఆచరించి ఆలయాలకు బారులుదీరారు. చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ సమీపంలోని సప్తగిరుల కాంచనగుహలో కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి ప్రతిరూపమైన కురుమూర్తిస్వామి ఆలయ ప్రాంగణం పూలతో అలంకరించారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, అలంకరణ, శతనామావళిలో అర్చనలుగావించారు. స్వామి దర్శనానికి భక్తులు ఉత్తద్వార దర్శనం చేసుకుని పునీతులయ్యారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో నిండిపోయింది. కౌకుంట్ల మండలకేంద్రంలోని చెన్నకేశవస్వామి అలయంలో శ్రీదేవీ, భూదేవీసమేత లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించి భక్తులకు ఉత్తద్వార దర్శనానికి ఏర్పాట్లు చేశారు. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి ఉత్తద్వారంలో స్వామివారిని దర్శించుకున్నారు.