వనపర్తి, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : సర్పంచ్ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతున్నాయి. ఒకటి, రెండు విడుతల్లో వచ్చిన పంచాయతీ ఫలితాలు అనుకూలంగా లేకపోవడంతో ఎమ్మెల్యేతోపాటు పలువురు నేతలు నిరాశకు లోనవుతున్నారు. దీంతో వారు ఏ ఊరి ప్రచారంలో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం లేకుండా పోతున్నది. అలాంటి వీడియోనే వనపర్తి జిల్లాలో వైరల్ అవుతూ చక్కర్లు కొడుతున్నది. ఆ నోటా..ఈ నోటా…ఏ నోటా.. విన్నా అదే మాట. వీడియోను చూస్తూ ఏమైంది ఎమ్మెల్యేకంటూ వేడి..వేడిగా చర్చ నడుస్తున్నది.
ఎమ్మెల్యే ప్రసంగంలో ఏముందంటే..
వార్డు మెంబర్ అయినా.. సర్పంచ్ అయినా.. పనులు కావాలన్నా.. సీసీ రోడ్డు, కరెంటు లైటు, మోరీలు(కాల్వలు), రేషన్ కార్డు కావాలన్నా కాగితం పట్టుకుని ఎవరి దగ్గరకు వస్తాడంటూ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పలు గ్రామాల్లో మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అదే వీడియోల్లో తాను చెప్పిన మనుషులను కాదని, ఇతరులను గెలిపిస్తే.. అలాంటి వారిని తన గేటు బయటనే గెంటేస్తాని ఎమ్మెల్యే మాట్లాడిన ప్రసంగ వీడియోలు చక్కర్లు కొడుతుండడం వివాదాస్పదమయ్యాయి.
వనపర్తి జిల్లాలో 268 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడుతల్లో 181 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా వెలువడ్డాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు పోటా.. పోటీగా సర్పంచ్ స్థానాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన వాటిలో బీఆర్ఎస్కు 67 సర్పంచ్ స్థానాలు, కాంగ్రెస్‌కు 97 సర్పంచ్ స్థానాలు వచ్చాయన్న అంచనా ఉంది. ఇక మరో 5 సర్పంచులు బీజేపీ, ఇతరులు 12 స్థానాల్లో గెలుపొందారు. ఇలా వచ్చిన ఫలితాల్లో పోటా.. పోటీగా వస్తున్నాయి. ఇక మూడో విడుత ఎన్నికలు పెబ్బేరు, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల, పాన్‌గల్ మండలాల్లో రేపు జరగబోతున్నాయి.
మనసు నొచ్చుకుంటున్న కొత్త సర్పంచులు…
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన కొన్ని మాటలు కొత్త సర్పంచుల మనస్సులను నొప్పిస్తున్నా యి. తన మనసులను కాదని ఇతరులకు గెలిపిస్తే.. వారు సర్పంచుగా గెలిచి నా దగ్గరకు వస్తే.. నా గేటులోకి రాకుండా గెంటేస్తాననడంతో కొత్త సర్పంచులు మనసు నొచ్చుకుంటున్నారు. ప్రజల తీర్పు చిన్నదైనా.. పెద్దదైనా ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదిగా గ్రహించకపోవడం విచారకరమని ఆవేదన చెందుతున్నారు. గ్రామ సర్పంచును దేశానికి అధిపతిగా ఉండే రాష్ట్రపతితో పోల్చుతారని, అలాంటిది గేటు ముందే గెంటేస్తామంటూ ఎమ్మెల్యే ప్రసంగించడం వారి స్థాయికి తగినదా అంటూ ఇటీవల గెలుపొందిన ప్రజాప్రతినిధులు అంటున్నారు. సర్పంచ్ అనుమతి లేనిదే గ్రామానికి వచ్చేందుకు అవకాశం కూడా ఉండదన్న విషయం కూడా ఎమ్మెల్యే గుర్తెరిగి మాట్లాడితే మంచిదని మరికొంత మంది కొత్త సర్పంచులు సూచిస్తున్నారు.
కారు జోరే కారణమా..?
ఇప్పటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఊహించనట్లుగా ఫలితాలు వచ్చాయన్న నిరాశతోనే ఇలాంటి ప్రసంగాలు వస్తున్నాయన్న చర్చ జరుగుతున్నది. అంతా నేనే.. మొత్తం నాదే.. ఎదురే లేదు.. ఎన్నికల్లో అంతా ఊడ్చి పడేస్తా.. అన్న ప్రసంగాలు విని జనం విసుగెత్తి పోయారన్న విమర్శలు కూడా లేకపోలేదు. దీనికి తోడు రెండు విడుతల్లో అనుకున్నన్ని స్థానాలు రాకపోగా, ముఖ్య అనుచరులంతా ఊడ్చుకుపెట్టుకు పోయిన నిరాశతోనే ఇలా మాట్లాడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో ఎవరికీ పక్కా కుర్చీలుండవని, పట్టు తప్పితే.. జనం కుర్చీని తప్పిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదీ ఏమైనా ఎమ్మెల్యే ప్రసంగాల్లో కొత్త సర్పంచులను గెంటేస్తాన్న మాటలను ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రజా తీర్పును గౌరవించడం నేర్చుకోవాలి
ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు
ఏ స్థాయి వారైనా ప్రజల తీర్పును గౌర వించడం నేర్చుకోవాలి. పెద్ద స్థాయిలో ఉండే వారిని చూసి కింది స్థాయిలో ఉండే వారికి ఆదర్శంగా ఉండాలి. బెదిరించే దోరణి ఏమాత్రం సరికాదు. ధైర్యముంటే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ వారికే ఇస్తామని ప్రెస్‌మీట్ పెట్టి చెప్పండి. ఏమైనా ఉంటే ఈ రెండేళ్లలో మీరు చేసిన అభివృద్ధి పనులు ఉంటే ప్రజలకు వివరించండి. మీరు వచ్చాక ఎన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, మోరీలు ఎన్ని నిర్మించారో ప్రజలకు తెలుసు. ఏదీ ఏమైనా ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం.
– శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్, మనిగిల్ల, వనపర్తి జిల్లా
నేతలు ఆదర్శంగా ఉండాలి..
నియోజకవర్గ స్థాయిలో ఉండే నాయ కులు ఆదర్శంగా నడవాలి. అలాంటి వారి నుంచి మాలాంటి వారు నేర్చు కునేలా ఉండాలి. రెచ్చగొట్టే ప్రసం గాల మాటలు సరియైనవి కావు. కొ త్త..కొత్తగా వచ్చే మా లాంటి వారి కి అవసరమైతే మంచి సూచనలు చేయాలి. ఎన్నికల వరకే రాజకీయం అంటారు. కానీ, ఇలా మాట్లాడి కొత్త సర్పంచుల మనసును గాయపర్చడం మంచిది కాదు. పనుల కోసం వచ్చే వారిని గేటు ముందే గెంటేస్తాననడం తప్పు. ఏదీ ఏమైనా ఎమ్మెల్యేఇలా మాట్లాడటం సరికాదు.