గద్వాల, అక్టోబర్ 16 : మార్కెట్లో ఉల్లి రైతుకు కన్నీరే మిగులుతున్నది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు వెళితే.. ధర పడిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. లాభాలు లేకున్నా పెట్టుబడులు వస్తే చాలనుకున్నా అవి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని నానుడి ఉండగా.. పంట సాగు చేసిన రైతుకు మాత్రం కన్నీళ్లే మిగిలాయి. బహిరంగ మార్కెట్లో క్వింటా రూ.600 నుంచి రూ.1,000 కొనుగోలుదారులు అడుగుతుండడంతో అమ్ముకోవాలా లేక అక్కడే వదిలి వెళ్లాలో తెలియని అయోమయంలో రైతులు కొట్టుమిట్టా డుతున్నారు. గతేడాది ఉల్లికి ధర రూ.4వేలకు పైగా ఉండడంతో ఈ ఏడాది కూడా అదే ధర వస్తుందని రైతులు భావించి జిల్లాలో 2,191 ఎకరాల్లో పంట సాగుచేశారు. ప్రస్తుతం పంట చేతికి వచ్చి ఉల్లిని మార్కెట్కు తీసుకురాగా, కనీసం కిరాయిలు కూడా రావడం లేదని వాపోతున్నారు.
కొనుగోలుదారులు మాత్రం వినియోగదారులకు కేజీ రూ.20నుంచి 25వరకు విక్రయిస్తున్నారు. ఈ సారైనా తాము సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తే అప్పుల ఊబి నుంచి గట్టెక్కుదామన్న రైతన్నకు నిరాశే మిగిలింది. అష్టకష్టాలు పడి పండించిన పంటకు ఒక్కసారిగా గిట్టుబాటు ధర పడిపోవడంతో పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. రాజోళికి చెందిన రైతులు శేఖర్ రెండు ఎకరాల్లో, చంద్ర మూడెకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు. ఉల్లిని తీయడానికి ఎకరాకు రూ.20వేల వరకు ఖర్చయ్యింది. తీరా ధర లేకపోవడంతో పంటను పొలాల్లోనే వదిలేశారు. దీంతో గ్రామస్తులు ఎవరికి తోచిన కాడికి వారు ఎత్తుకెళ్లారు.
జోగుళాంబ గద్వాల, అలం పూర్లో నియోజకవర్గాల్లో రైతులు ఎక్కువగా ఉల్లి పంట సాగు చేస్తారు. ఇక్కడ సరైన మార్కెట్ లేకపోవడంతో కర్నూల్, హైదరాబాద్, రాయచూర్ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. అక్కడ మద్దతు ధర రాకపోగా ట్రాన్స్పోర్టు చార్జీలు ఎక్కువవుతుండడంతో మార్కెట్లోనే వదిలి వచ్చే పరిస్థితి నెలకొందని రైతులు వాపో తున్నారు. వ్యవసాయ మార్కెట్లో ఉల్లిని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అడిగిన ధరకే అమ్ము కోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్రభుత్వం స్పందించి గిట్టు బాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
దిగుబడి లేదు.. ధర రాదు
గతేడాది ధర బాగుండడంతో ఈ ఏడాది రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశా. ఎకరాకు రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టా. వాన కాలం సీజన్లో వర్షాలు ఎక్కువగా కురవ డంతో పంట దెబ్బతిన్నది. దీనికి తోడు ఉన్న పంటను కోసి మార్కెట్లో అమ్ము కుందామంటే ధర లేదు. మార్కెట్కు తీసుకొస్తే రవాణా చార్జీలు రావడం లేదు. దీంతో పొలం లోనే పంటను వదిలేశా. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.
– చింతరేవుల శేఖర్, రైతు, రాజోళి, గద్వాల జిల్లా
నష్టమే మిగిలింది..
నాకున్న మూడెకరాల పొలంలో ఉల్లి సాగు చేశా. వర్షాల కారణంగా పంట పండలేదు. దీంతో నష్టపో యాను. వచ్చిన దిగుబడి పెట్టుబ డికి సరిపోలేదు. వేసిన ఉల్లి పంట ను పొలంలోనే వదిలేశా. పెట్టుబడి
అంతా బూడిదలో పోసినట్లయ్యింది. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి.
– సానె చంద్ర, రైతు, రాజోళి