మహబూబ్‌నగర్, జూలై 13( నమస్తే తెలంగాణ ప్రతినిథి ) : రైతుల కోసం ఉచిత విద్యుత్ ఇస్తుంటే ఓర్వలేక రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నాడని, స్వదేశంలో విమర్శిస్తే ప్రజలకు తెలుస్తుందని అమెరికాలో నిజ స్వరూ పం బయటపెట్టుకున్నాడని ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. మహబూబ్‌నగర్‌లోని విద్యుత్ భవన్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రేవంత్‌రెడ్డి తక్షణమే ముక్కు నేలకు రాసి తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పాల ని.. లేని పక్షంలో వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ రైతులను అవమానించారన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దే శంలో, రాష్ట్రంలో ఎన్నడూ రైతులకు ప్రయోజనం చేకూరే కార్యక్రమాలను చేపట్టలేదని విమర్శించారు. నిన్న ధరణి వద్దన్నారు, నేడు కరెంటు గురించి మాట్లాడుతున్నారు, భవిష్యత్తులో రైతుబంధు, రైతుబీమా వ ద్దంటారని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను వద్దు.. వద్దు అంటుందని, వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెసోళ్లను ప్రజలు వద్దు.. వద్దు అనడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు లేక మోటర్లు కాలిపోయి పొలాల వద్ద జాగారం చేసిన రోజులు మళ్లీ కావాలా అని ప్రశ్నించారు. విద్యుత్ లేకపోతే సబ్స్టేషన్ల ఎదుట ధర్నాలు, అధికారులను నిర్బంధించడం, జీపీ భవనాల్లో పెట్టి తాళం వేయడం చూశామన్నారు. తెలంగాణ వచ్చినంక ఒక్క రైతు కూడా రోడ్డు ఎక్కలేదన్న విషయాన్ని గమనించాలన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాకే విద్యుత్ అధికారులు స్వేచ్ఛగా గ్రామాల్లో తిరుగుతున్నారని గుర్తు చేశారు. కరెంటు ఇవ్వాలని ఆనాడు బషీర్‌బాగ్‌లో ఆందోళన చేస్తే అన్నదాతలపై కాల్పులు జరిపిన కర్కశ ప్రభుత్వం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. సరైన కరెంటు లేకపోతే పరిశ్రమలు మూతబడుతాయని, వ్యవసాయం కుంటుపడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో రైతులే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారన్నారు.
భారీ ఎత్తున నిరసనలు
మహబూబ్గనర్లోని విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్, రైతువిభాగం నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. కాంగ్రెస్ డౌన్ డౌన్, రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రైతు వ్యతిరేకి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని డిమాండ్ చేశారు. సుమారు గంట పాటు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ వెంకన్న, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్‌కమిటీ చైర్మన్ రెహమాన్, వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ గణేశ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రైతు జోలికొస్తే పుట్టగతులుండవ్..
రైతులకు ఉచిత కరెంట్‌ను తగ్గించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. రైతులేనిదే రాజ్యం లేదని కాంగ్రెసోళ్లకు తెలియదా? రైతుల జోలికొస్తే పుట్టగతులుండవు. సీఎం కేసీఆర్ రైతులను ఆదుకుంటున్నది చూసి ఓర్వలేక కుట్రపూరితంగా మాట్లాడడాన్ని రైతులోకం ఖండిస్తోంది. నిజమైన రైతు బిడ్డవైతే కర్షకులకు క్షమాపణ చెప్పాలి. అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్‌రెడ్డి రైతులకు 3 గంటలు కరెంట్ చాలని మాట్లాడడం దుర్మార్గం. రైతులపై ఆయనకు ఉన్న అక్కసుని వెళ్లగక్కాడు.
– లక్ష్మణ్ నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు,బాలానగర్,