సీఎం కేసీఆర్ పర్యటన బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపింది. సోమవారం మూడు జిల్లాలు, నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించిన అధినేతకు నీరాజనం పలికారు. దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. జనం భారీగా తరలిరావడంతో ఆశీర్వాద సభలు జన సునామీని తలపించాయి. ప్రతి ఒక్కరూ గుండెల నిండా గులాబీ జెండాను ఎత్తారు. కళాకారుల ఆటపాటకు జనం జేజేలు పలికారు. ప్రగతి ప్రదాత పర్యటనతో గులాబీ పార్టీశ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొనగా.. ప్రసంగంతో జనంలో స్ఫూర్తినింపారు. మరోసారి ప్రజల ఆశీర్వాదం కోసం జన నేత రానున్నారు. 19న నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అలంపూర్‌తోపాటు 22న పాలమూరులో పర్యటించనున్నారు. అలాగే 24న అచ్చంపేట, మక్తల్‌లో మంత్రి కేటీఆర్ రోడ్‌షో నిర్వహించనున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సమరోత్సాహం నెలకొన్నది.
మహబూబ్‌నగర్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రగతి ప్రధాత, గులాబీ బాస్ కేసీఆర్ సభలకు జనం సునామీలా పోటెత్తారు. సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా సభలకు సీఎం కేసీఆర్ కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ ఆయన రాక కోసం వేచి ఉండి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సీఎం కేసీఆర్ హెలికాప్టర్ సాంకేతిక లోపం తలెత్తినా మనందరిపై ఉన్న ప్రేమతో చావును కూడా లెక్క చేయకుండా వచ్చారని ఉద్వేగ భరితంగా సభలో వెల్లడించారు. సోమవారం ఉదయం 11గంటలకు ప్రారంభం కావాల్సిన దేవరకద్ర ప్రజా ఆశీర్వాద సభకు జనం ఉదయం 8గంటల నుంచే వచ్చారు. గద్వాలలో ఉదయం 10నుంచి, మక్తల్‌లో మధ్యాహ్నం 12గంటల నుంచి, నారాయణపేటలో ఒంటిగంటకే సభకు తరలివచ్చారు. మధ్యాహ్నానానికే నాలుగు సభలు జనంతో కిక్కిరిసిపోయాయి. దీంతో వచ్చి రాగానే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో తన ఆలస్యానికి గల కారణాలను వివరిస్తూ మరోసారి మీ నియోజకవర్గాలకు వస్తానని, ఇక్కడే ఒక రోజు పాటు గడుపుతానని హామీ ఇచ్చారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అడిగిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు పచ్చజెండా ఊపారు. వచ్చేది మన ప్రభుత్వమేనని, ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం ఏర్పడిన నెలలోనే పూర్తి చేస్తానని జనాలకు హామీ ఇవ్వడంతో కేరింతలు కొట్టారు. మరోవైపు ఒకేరోజు నాలుగు ప్రజా ఆశీర్వాద సభలు ఏర్పాటు చేస్తే జనం ఎలా వస్తారని, సమావేశాలు అట్టర్‌ప్లాప్ అవుతాయని విపక్షాలు పెదవి విరిచాయి. విపక్షాల విమర్శలకు గట్టి సమాధానం చెబుతూ నాలుగు సభలు జనం సునామీని తలపించాయి. అసాధ్యం అనుకున్న ప్రజా ఆశీర్వాద సభలు ఊహించని రీతిలో విజయవంతం కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థులు ఆనందంలో ఉండగా, ప్రతిపక్షాలు చేసేది లేక నిట్టూరుస్తున్నాయి. ఓటు చాలా విలువైందని, ఆలోచించి పనిచేసే వారికి పట్టం కట్టాలని సీఎం పిలుపునివ్వడంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తున్నది. సభ నాలుగు చోట్ల విజయవంతం కావడంతో ఈనెల 19వ తేదీన కేసీఆర్ అలంపూర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు రానున్నారు. ఈ మేరకు కేసీఆర్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. అలాగే 22న మహబూబ్‌నగర్ పట్టణంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు హాజరవుతారు. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 24వ తేదీన అచ్చంపేట, మక్తల్‌లో జరిగే రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. త్వరలో మంత్రి హరీశ్‌రావు టూర్ కూడా ఉండబోతుందని పార్టీ శ్రేణులు ప్రకటించాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలు ఊహించని రీతిలో విజయవంతమయ్యాయి. ఒకేరోజు నాలుగు సభలకు జనం రారని విపక్షాలు ఎద్దేవా చేసినా వారి దిమ్మతిరిగేలా సునామీలా తరలివచ్చారు. అంతేకాక సీఎం కేసీఆర్ కోసం 5గంటలపాటు నిరీక్షించడం మరో ఎత్తు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, పార్టీ మేనిఫెస్టో ప్లకార్డులను ప్రదర్శించి సభలకు ఫుల్‌జోష్‌తో తరలివచ్చారు. చాలాచోట్ల జనం గిరిజన వేషాధారణలు, డప్పు వాయిద్యాలు మేళతాళాలతో గులాబీ జెండాను పట్టుకుని సభకు తండోపతండాలుగా తరలివచ్చారు. కళాకారులు ఆలపించిన పాటలకు జనం ఊగిపోయారు. జై తెలంగాణ, జై కేసీఆర్ మరోసారి బీఆర్ఎస్ సర్కార్ హ్యాట్రిక్ అంటూ నినాదాలు చేశారు. దేవరకద్రలో గాయని మధుప్రియ పాడిన పాటలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి డాన్స్ చేశారు. మక్తల్‌లో మానుకోట ప్రసాద్ పాడిన పాటకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కార్యకర్తలతో కలిసి చిందులు వేశారు. నారాయణపేట, గద్వాలలో కూడా ప్రజలు ఆటపాటలకు ఉర్రూతలూగారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలకు ముందుగానే ప్రచారంలో దూసుకుపోతున్న గులాబీదళం ప్రజా ఆశీర్వాద సభలు సక్సెస్ కావడంతో ఫుల్‌జోష్ కనిపిస్తున్నది. సభావేదిక నిండిపోవడంతో చాలామంది బయటనే ఉండిపోయారు. నామినేషన్ల ఘట్టం చివరి అంకానికి రావడం, ఎన్నికలకు ఇంకా 23 రోజుల సమయమే ఉండడంతో సీఎం కేసీఆర్ సభల విజయవంతంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత నెలకొంది. ఇదే ఉత్సాహంతో గ్రామాల్లో గడపగడపకు ప్రచారం చేయాలని పార్టీ అభ్యర్థులు దిశానిర్దేశం చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలను ఏర్పాటు చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 12 నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో సభలు సక్సెస్ అయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే అక్టోబర్ 18వ తేదీన జడ్చర్లలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. 26వ తేదీన అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాల్లో, నవంబర్ 6వ తేదీన ఏకంగా నాలుగు నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు చేపట్టారు. ఈనెల 19వ తేదీన అలంపూర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో, 22వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. మొత్తం 12నియోజకవర్గాల్లో గులాబీ బాస్ ప్రచార సభలు పూర్తవుతాయి. దీంతోపాటు ఈనెల 24న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అచ్చంపేట, మక్తల్ నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొననుండగా, మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి జిల్లాలో రోడ్‌షోలో, బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది.