ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలకరి వర్షాలు పలకరించాయి. జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరైన జిల్లా ప్రజలు వర్షపు జల్లులతో సేదతీరుతున్నారు. ఈనెల మొదటి వారంలోనే రుతుపవనాలు రావాల్సి ఉండగా రెండు వారాలు ఆలస్యమైంది. రుతుపవనాల రాకతో తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే రైతులు దుక్కులను సిద్ధం చేసుకోవడంతో పత్తి, జొన్న తదితర విత్తనాలు విత్తుకుంటున్నారు. వరి సాగు చేసే రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు.
-కల్వకుర్తి, జూన్ 23
తొలకరి పలకరింపుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు సాగు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కు లు దున్నుకున్న రైతులు అక్కడక్కడ పత్తి , జొన్న విత్తనాలు వేస్తున్నారు. ఈఏడాది సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గటుగానే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు.
సమృద్ధిగా ఎరువులు, విత్తనాలు..
వర్షాలు కురుస్తుండటంతో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అధికారులు అందుబాటులో ఉంచారు. వానకాలానికి ముందే అధికారులు జిల్లా వ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి ఏఏ పంట ఎంత విస్తీర్ణంలో వేస్తారనే అంచనాతో ఇండెంట్ తయారు చేసుకున్నారు. ఇండెంట్ అధారంగా విత్తనాలను అగ్రోస్, పీఏసీసీఎస్ తదితర ఏజెన్సీల ద్వారా అందుబాటులో ఉంచారు. బ్లాక్ మార్కెట్లో విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వ్యవసాయాధికారులను ఆదేశించింది. ఆయా మండలాల్లో వ్యవసాయాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రోహిణికార్తెలో దుక్కులు సిద్ధం చేసుకున్న కొంతమంది రైతులు పత్తి విత్తనాలు విత్తుకుంటున్నారు. మరో రెండు వర్షాలు కురిస్తే భూమిలో వేడి తగ్గుతుందని, అప్పుడు విత్తుకుంటే త్వరగా మొలకెత్తి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పెరగనున్న పత్తి సాగు విస్తీర్ణం..
గతేడాది పత్తి పంటలో ఆశించిన దిగుబడి రాలేదు. అతివృష్టి, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దిగుబడి రాక నష్టపోయిన రైతులు మరోసారి పత్తి పంట వేయడానికి సిద్ధమవుతున్నారు. రైతుల డిమాండ్ దృష్ట్యా వ్యాపారులు పత్తి విత్తనాలను బ్లాక్ చేసి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారనే కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు బ్లాక్ మార్కెట్ చేసే వ్యాపారులపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఈనెల 26 నుంచి రైతుబంధు..
తొలకరి వర్షాలకు తోడుగా ప్రభుత్వం ఈనెల 26వ తేదీ నుంచి రైతుబంధు ఇస్తామని ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయ నుండడంతో రైతులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులు తదితర వాటికి లెక్కలు వేసుకుంటున్నారు. వానకాలం, యాసంగి పంటలకు పెట్టుబడి కోసం అప్పులు తెచ్చుకోకుండా రాష్ట్ర ప్ర భుత్వం అండగా నిలుస్తుందని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.