యాసంగికి నీటి ఢోకా లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఈ సీజన్లో పండించే పంటలకు నీటి సమస్య లేకుండా ముందస్తు కార్యాచరణ రూపొందింది. వారబందీ పద్ధతిలో మార్చి 31 వరకు ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. దీనిపై మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఇంజినీరింగ్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. దీంతో పంటలు సాగు చేస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టలేని అభివృద్ధి, సంక్షేమ పథకా లు, నిధుల మంజూరు చేపడుతున్నది. ప్రతి వాన కాలం, యాసంగి సీజన్లకు ముందే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం, 24గంటల ఉచిత విద్యుత్ ముఖ్యంగా ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తున్నది. అలాగే రైతులకు సాగులో సమస్యలను తీర్చేందుకు రైతు వేదికల ద్వారా వ్యవసాయ అధికారులను అందుబాటులో ఉంచుతున్నది. రైతుబీమా పథకం కూడా కొనసాగిస్తోంది. ఇక పంటలు చేతికి వచ్చాక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లను నిర్వహిస్తున్నది.
ఈ క్రమంలో ప్రస్తుత యాసంగి సీజన్లోనూ సాగుకు రైతులు ఢోకా లేని నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నది. రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ జిల్లాలో రైతులు ఈ సీజన్లో పండిస్తున్న పంటకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించేందుకు అవసరమైన దిశా నిర్దేశం చేశారు. సాగునీటి ఇంజినీరింగ్‌శాఖ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిం చారు. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్, జోగుళాంబగద్వాల, వనపర్తి జిల్లాల పరిధిలోని యాసంగి సీజన్ సాగుకు నీటి విడుదలపై డిసెంబర్ చివరలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. యాసంగిలో ఆయా జిల్లాల్లోని జూరాల ప్రాజెక్టు, ఎంజీకేఎల్ఐ, భీమా పరిధిలో వీటి విడుడదలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
దీని ప్రకారంగా జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలోని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా 19,400ఎకరాలకు, కుడి కాల్వ ద్వారా 15,500ఎకరాల చొప్పున మొత్తం 34,900ఎకరాలకు వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేయనున్నారు. ఇక నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని ఎంజీకేల్ఐ ద్వారా 2.64లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఇలా మార్చి 31వ తేదీ వరకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ సీజన్లో రైతులు పండించే వేరుశనగలాంటి పప్పు, నూనె గింజలతోపాటు వరికి సాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. వారబందీ పద్ధతిలో వారంలో నాలుగు రోజులు నీటిని విడుదల చేసి మరో మూడు రోజులు నిలిపివేస్తారు.
ఇక భీమా 27వ ప్యాకేజ్‌కి మాత్రం 10రోజులకు ఒకసారి నీటి విడుదల జరగనున్నది. గతంలో ఉమ్మడి పాలమూరులో ఆర్డీఎస్, జూరాల ప్రాజెక్టులే ఉండేవి. ఎంజీకేఎల్ఐ వల్ల తొలుత 12వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుండగా తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ చొరవతో ప్రాజెక్టుల నిద్ర చేయడం, పలుమార్లు సందర్శనతో ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తయ్యాయి. దీనివల్ల ఎంజీకేఎల్ఐ పరిధిలో 4.5లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నట్లుగా నిర్ణయించగా దాదాపుగా 5లక్షల ఎకరాలకు వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీరు అందుతుండటం విశేషం. దీంతో ఉమ్మడి పాలమూరులో వానకాలంలో 11లక్షల ఎకరాల్లో పంటల సాగు జరగడం విశేషం. ఇలా ఈ సీజన్లోనూ లక్ష్యం మేరకు పంటల సాగు జరిగేలా సాగునీటికి ఢోకా లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో రైతన్నల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
సీఎం కేసీఆర్ పెండింగ్‌లో ఉన్న ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టును పూర్తిచేయడం వల్ల రైతులకు సాగునీరు అందుతున్నది. బీడు భూములన్నీ పంటలతో కళకళలాడుతున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తయితే పాలమూరు కోనసీమలా మారుతుంది. ఈ యాసంగి సీజన్లో సాగు చేస్తున్న పంటలకు మార్చి 31వ తేదీవరకు వారబందీ పద్ధతిలో సాగునీరు అందించేందుకు నిర్ణయించడం జరిగింది.
– మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్