బిజినేపల్లి : గాలివానకు తడిసిన వరి ( Paddy ) , మొక్కజొన్న( Maize) ధాన్యాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్( Srinivas Goud) , బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులేందర్ రెడ్డి( Phulendhar reddy ) కోరారు. సోమవారం మండలంలోని లట్టుపల్లి, మహాదేవుని పేట గ్రామాల్లో అకాల వర్షానికి నేలకొరిగిన పంటలను, తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లట్టుపల్లిలో వరి కొనుగోలు కేంద్రం గత పది రోజుల క్రితమే ఎమ్మెల్యే ప్రారంభించగా కిందిస్థాయి సిబ్బంది తేమ పేరుతో వడ్లను ఆలస్యంగా కొనుగోలు చేయడం వల్ల అకాల వర్షంతో ధాన్యం తడిసి ముద్దయ్యిందని ఆరోపించారు. కోతదశకు వచ్చిన మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగాయని అన్నారు. మరోవైపు వరి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, అకాల వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు.
ఎలాంటి నిబంధనలు లేకుండా మద్దతు ధర కు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలకు నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ. 25 వేలు నష్టపరిహారాన్ని అందజేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మహేశ్వర్ రెడ్డి, బాలస్వామి, శేఖర్ రావు, శ్రీను, తిరుపతిరెడ్డి, బసవ రెడ్డి వెంకటయ్య, లక్ష్మయ్య, రైతులు ఉన్నారు.