నాగర్‌కర్నూల్, మే 28 : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖానలో రోగుల తాకిడికి అనుగుణంగా సౌకర్యాలు కరువయ్యాయి. బుధవారం ‘నమస్తే తెలంగాణ’ విజిట్‌లో పలు విషయాలు వెలుగు చూశారు. ముఖ్యంగా 500 నుంచి వెయ్యి మందికిపైగా రోగులు వచ్చే దవాఖానలో బాత్రూంలు సక్రమంగా లేకపోవడం, ఉన్న బాత్రూంలకు నీటి సమస్య కారణంగా సక్రమంగా ఉపయోగించులేకపోవడంతో ఇన్ పేసెంట్లు, రోగుల సహాయకు లు, సిబ్బంది, నర్సులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బాత్రూంలకు నీటి సౌకర్యం లేక రోగులు, నర్సులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.
నడవలేని రోగులను డాక్టర్ వద్దకు గానీ, స్కానింగ్ సెంటర్లకు, ఎక్స్‌రేల రూమ్‌లకు తీసుకెళ్లేందుకు సహాయకులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపించాయి. నడవలేని రోగులను వారి బంధువులో లేదా వెంట వచ్చిన వారో వీల్చైర్లపై తీసుకెళ్లారు. రోగులకు డాక్టర్లు రాసిన మందుల్లో ఏ దో ఒకటి అందుబాటులో లేకపోవడంతో బ యటకు రాస్తున్నారు. అత్యవసరమైన రోగులు ఇక్కడ దొరకని మందులను బయటి మెడికల్ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు ఇచ్చిన మందులతో సరిపెట్టుకుంటున్నారు. నిత్యం దవాఖానలో 100 నుంచి 200 మందికి రక్త పరీక్షలు చేస్తున్నారు.
ఐపీ, డీపీ టెస్టులు జనరల్ దవాఖానలో చేస్తుండగా, థైరాయిడ్ లేక ఇతర రోగులకు సంబంధించిన పరీక్షల కోసం స్థానికంగా ఉన్న డయోగ్నోస్టిక్ సెంటర్‌కు తరలిస్తున్నారు. ఇందుకోసం వచ్చే వారు రెండు, మూడు సార్లు 3 కి.మీ. దూరంలోని ఉన్న డయోగ్నోస్టిక్కు వెళ్లాల్సి వస్తుంది. రెండు నెలల కిందట ప్రారంభించిన సిటీ స్కా నింగ్ ఇప్పటికీ 600లకుపైగా స్కానింగ్‌లను చేపట్టారు. దవాఖానలోని ప్రధాన లిఫ్ట్ పనిచేయకపోవడంతో రోగులు, వారి వెంట వచ్చిన సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోగుల వెంబడి వచ్చిన సహాయకులు బేంచీలు లేక కింద కూర్చున్నారు. బాలింతలు ఉండే రెండో అంతస్తులో కప్పు పైనుంచి నీటి లీకేజీలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జనరల్ దవాఖానగా మారాక రోగుల తాకిడి పెరిగినా అందుకనుగుణం గా సౌకర్యాల కల్పన లేదు.