కాంగ్రెస్ పార్టీ కరెంట్ కుట్రలకు తెరలేపింది. ఎకరం భూమి నీళ్లు పారేందుకు గంట సమయం సరిపోతుంది. రాష్ట్రంలో ఉన్న 58 లక్షల కమతాల్లో 95 శాతం చిన్న, సన్నకారు రైతులవే. వీళ్లంతా ఎకరం, రెండెకరాలు, మూడెకరాల్లోపు భూమి ఉన్నవాళ్లే. అంటే మూడు, నాలుగు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు భగ్గుమంటున్నారు. రాష్ట్రంలో కరెంట్ కష్టాలు తెచ్చేందుకు కుట్ర జరుగుతున్నదని అనుమానం వ్యక్తమవుతున్నది. ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు హస్తం పార్టీ నేతలు అనుసరిస్తున్న తప్పుడు విధానంపై రైతులు, ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. వ్యవసాయం చేయని ఆ పార్టీ నేతల కు మూడు గంటల కరెంట్‌పై మాట్లాడే అర్హత లేదంటున్నారు. మూడు గంటల కరెంట్ పంటలకు సరిపో దు.. 10 హెచ్‌పీ మోటర్లతో ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ వస్తే మ ళ్లా గోస తప్పదని హెచ్చరిస్తున్నారు. అలాంటి పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రకటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంట్ బాగుందని సంతోషంగా చెబుతున్నారు.
నాకు ఎనిమిదెకరాల పొలం ఉన్నది. అందులో సాగు చేయాలంటే నరకయాతన పడేటోళ్లం. పదేండ్ల కిందట సమైక్య పాలనలో కరెంటు కోసం దేవుడికి ఎదురుచూసినట్లు చూడాల్సి వచ్చేది. అర్ధరాత్రి, పగలు తేడా లేకుండా ఇంటి నుంచి పొలానికి పరుగులు పెట్టేవాడిని. రాత్రి పూట పురుగుగట్రతో కష్టమయ్యేది. కరెంటు ఎప్పుడు వస్తదో.. పోతదో తెలియక పొలం వద్దే తిండి, తిప్పలు లేకుండా కావలి కాసేవాళ్లం. కరెంటు లేక.. నీళ్లు అందక.. పంటలు పండక బతకడానికి చాలా కష్టంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తుండు. కరెంటుకు ఢోకాలేకపోవడంతో మనకు వీలు కుదిరినప్పుడల్లా పొలానికి వెళ్లి బోరుమోటర్లు వేసుకొని పొలానికి నీళ్లు పారిస్తున్నాను. 24 గంటల కరెంట్ ఉన్నందున యాసంగి పంటకు సిద్ధం చేసుకున్నాను. కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంటు ఇస్తమంటున్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటుకు తిప్పలైతది. 10 హెచ్‌పీ మోటర్లు వాడితే ఒక్కసారికే నీళ్లను గుంజేస్తుంది. ఒకవేళ అవి పాడైతే ఎంత ఖర్చు అయితదో రేవంత్‌రెడ్డికి ఏం తెలుస్తది. ఆయనకు వ్యవసాయంపై అవగాహన లేక మాట్లాడుతుండు. కాంగ్రెసోళ్ల మాటలను ఎవరూ నమ్మరు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే రైతుల సపోర్టు ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రైతులు సంతోషంగా ఉంటారు.
సీఎం కేసీఆర్ పుణ్యాన ఇప్పుడు రైతులకు 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత కరెంట్ అందుతున్నది. దీంతో ఏటా రెండు పంటలు పండిస్తున్నాం. సీఎం కేసీఆర్‌తోనే రైతు సంక్షేమ రాజ్యం ఏర్పడుతుంది. గతంలో కరెంట్ సరిగ్గా రాకపోవడంతో పంటలు ఎండిపోయేవి. మోటర్లు కాలిపోయేవి. దీంతో చాలా నష్టపోయేవాళ్లం. పొలాల వద్ద 10 హెచ్‌పీ మోటర్లు పెట్టాలంటే పైసలెవరు ఇస్తరు. ఒకవేళ పెట్టినా 10 హెచ్‌పీ మోటరుకు సూమారు రూ.1.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీంతో రైతులు అప్పుల పాలుకావడం తప్పా వేరే దారిలేదు. 10 హెచ్‌పీ మోటర్లతో లోడ్ పడి ట్రాన్స్ఫార్మర్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. రేవంత్‌రెడ్డి చెప్పినట్లు మూడు గంటల కరెంట్ వ్యవసాయానికి సరిపోదు. కనీసం ఒక మడి కూడా తడవదు. కాంగ్రెస్ నాయకులు అవగాహనా రాహిత్యంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే పాత రోజులే వస్తాయి. పంటలు ఎండిపోతాయి. అసలు వ్యవసాయం చేసుడే చాలా ఇబ్బంది అవుతుంది. రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు. అన్నదాతలను ఆగం చేసేందుకు కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నుతున్నారు. రైతుల సంక్షేమాన్ని తలిచే సీఎం కేసీఆర్ ఉంటేనే.. ఎవుసం పండుగ అవుతుంది. రైతులందరూ బీఆర్ఎస్ పక్షానే నిలబడాలి.
కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడో వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. కరెంట్ కోసం రాత్రి సమయాల్లో పొలాల వద్ద జాగారం చేసెటోళ్లం. ఊళ్లోకి రాకుండా పొలాల మధ్య గడిపెటోళ్లం. కరెంట్ కూడా లో ఓల్టేజీ ఉండడంతో మోటర్లు కాలిపోతుండె.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కరెంట్ కష్టాలు తప్పవు. మూడు ఇంచుల బోరుబావుల వద్ద 10 హెచ్‌పీ మోటర్లు బిగిస్తే ఐదు నిమిషాల్లో నీళ్లు అయిపోతాయి. దీంతో మోటర్లు కాలిపోవడమే కాకుండా పంట నష్టపోవాల్సి వస్తది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెబుతున్నట్లు మూడు గంటల కరెంటు ఇస్తే రైతులందరూ ఆగమవ్వడం ఖాయం. ఎందుకుంటే బోరుబావుల వద్ద ఉన్న మోటర్లను రైతులందరూ ఒకేసారి స్టార్ట్ చేస్తరు. లోడ్ ఎక్కువై మోటర్లు కాలిపోతాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతులు సంతోషంగా ఉన్నరు. రైతులు బాగుపడడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేనట్లుంది. నిరంతర కరెంట్, రైతుబంధు కావాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం రావొద్దు. కాంగ్రెస్ నేతలు, రేవంత్‌రెడ్డి ఎరువుల గురించి ఏదేదో మాట్లాడున్నరు. వాళ్లకు ఏమీ తెలియదు. వాళ్లు ఎప్పుడన్న ఎవుసం కాడికి పోయిన ముఖాలేనా.. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే మూడు గంటలు సాలని వంకరగా మాట్లాడుతున్నరు. మమ్ములను మంచిగ బతికనియ్యరా..? మళ్ల కరెంటు తిప్పలు పెట్టి బాయిల కాడ పండమంటారా..? కాంగ్రెసోళ్ల పాలనలో ఎన్నో కష్టాలు పడ్డం. తెలంగాణ వచ్చినంక ఈ తొమ్మిదేండ్ల సంది ఏ రందీ లేకుండా ఎవుసం చేసుకుంటున్నం. కేసీఆర్ సార్ లాంటోళ్లు ముప్పై ఏండ్ల కింద ఉంటే మా పరిస్థితి ఎంతో మారిపోయేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు గంటలు కరెంటు ఎట్ల సరిపోతది. కాంగ్రెసోళ్లు మతుండి మాట్లాడున్నరో లేదో తెలియడం లేదు. 10 హెచ్‌పీ మోటరు పెట్టుకున్నా ఒక పొలానికే నీళ్లు సరిపోతయి. మరి ఇంకో పంట ఎలా..? మా వద్ద 10 హెచ్‌పీ మోటర్లు కొనేంత పైకం ఉంటదా..? అంత పెద్ద మోటర్తో నీళ్లు కట్టుకునేటట్టు ఉంటదా. మళ్లీ కేసీఆర్ సార్ సీఎం అయితేనే రైతులు బాగుంటరు. మేము బీఆర్ఎస్కు అండగా ఉంటాం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తుండడంతో ధాన్యం దిగుబడి బాగా పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మూడు, నాలుగు గంటల లో ఓల్జేజీ కరెంటుతో నేను, మా నాన్న అష్టకష్టాలు పడ్డాం. మాకు ఐదెకరాల పొలం ఉండగా.. అప్పట్లో ఎకరాలో మాత్రమే నాట్లు వేసెటోళ్లం. లో ఓల్జేజీ కరెంట్ కారణంగా ఆ ఎకరా కూడా చేతికొచ్చేది కాదు. నరకం చూసెటోళ్లం. కరెంటు ఇష్టమొచ్చినప్పుడు రావడంతో రాత్రి వేళ బోరు బావుల వద్ద జాగారం చేసేవాళ్లం. పంట దిగుబడి రాక సాగు కోసం ఖర్చు చేసిన పెట్టుబడి కూడా వచ్చేది కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. సీఎం కేసీఆర్ ఇస్తున్న 24 గంటల కరెంటుతో మాకు జవసత్వాలు నింపినైట్లెంది. ప్రస్తుతం ఐదెకరాల పొలం సాగు చేస్తున్నాను. 24 గంటల కరెంటుతో పంట దిగుబడి కూడా పుష్కలంగా వస్తున్నది. గత పాలనలో కేవలం యాబై, అరవై బస్తాల ధాన్యం మాత్రమే పండేది. ఇప్పుడు ఏకంగా 500 నుంచి 600 బస్తాల ధాన్యం పండిస్తున్నాను. పెట్టుబడి తిప్పలు కూడా లేకపోవడంతో ప్రతి పంటకు డబ్బులు మిగులుతున్నాయి. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కరెంటు విప్లవంతో నా కుటుంబంలో చాలా మార్పు వచ్చింది. నా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడింది. కేసీఆర్ పరిపాలన పదికాలాల పాటు ఉండాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే.. మళ్లీ అన్ని కుటుంబాలు అంధకారంలో మగ్గాల్సిన పరిస్థితులు నెలకొంటాయి.
కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటూ ఎన్నికల మ్యానిఫోస్టోలో మోసపూరిత హామీలు ఇస్తున్నారు. మన పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నది. అక్కడ వ్యవసాయానికి 5 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని అక్కడి రైతులు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన వద్ద వ్యవసాయానికి 3 గంటలు కరెంట్ సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెబుతున్నాడు. అది చేను తడిసేందుకు ఏ మూలకు సరిపోదు. 10 హెచ్‌పీ మోటర్లను బోర్లకు బిగించుకోవాలని చెబుతున్నారు. అలా చేస్తే రైతు వ్యయ ప్రయాసాలతో ఇబ్బందులకు గురికాక తప్పదు. భూగర్భజలాలు చాలా లోతుకు పడిపోతాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రకటించే మోసపూరిత హామీలను నమ్మితే ఆగమవుతాం. వారిని మాటలు పట్టించుకోకుండా నిరంతరం ఉచిత కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడాలి. రైతుల మేలుకోరే సీఎం కేసీఆర్ మళ్లీ రావాలి. నియోజకవర్గాన్ని ప్రగతి పరుగులు పెట్టిస్తున్న రాజేందర్‌రెడ్డికి అండగా ఉండాలి.
ప్రశ్న : గత పాలనకు, ఇప్పటికీ తేడా ఎలా ఉంది..? మోటర్లు రిపేర్‌కు బాగా వస్తున్నాయా..? చేతి నిండా పని దొరుకుతుందా..? మెకానిక్ : నా పేరు మునగల్చేడ్ భీమయ్య. మాది నిజాలాపూర్ గ్రామం. 25 ఏండ్ల నుంచి వ్యవసాయ బోరు మోటర్లకు మరమ్మతులు చేస్తున్నాను. గత ప్రభుత్వాల పాలనలో మాకు సకల మర్యాదలు ఉండేవి. ఎక్కడికి పోవాలన్నా రైతులు వచ్చి వెంటపడి మరి తీసుకెళ్లేటోళ్లు. ఎందుకంటే ఇక్కడ మోటర్ ఉంటే కిలోమీటర్ అవతల ట్రాన్స్పార్మర్ ఉండేది. కరెంటు కూడా లో ఓల్జేజీ ఉండేది. దీంతో మోటర్, ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువగా కాలిపోయేవి. ఉదయం నిద్ర లేవకముందే ఇంటిముందు రైతులు నిలబడుతుండ్రి. నాస్ట చేయించి, నాటు కోడి కోపిస్త అని మరీ అడుక్కొని తోలుకపోతుండ్రి. కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఊళ్లో విద్యుత్ సబ్స్టేషన్లు కట్టించారు. ఎక్కడికికక్కడ డీడీలు కట్టిన రైతులందరికీ ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు. దీంతో లో ఓల్టేజీ సమస్య లేకుండా పోయింది. మోటర్ కాలిపోతలేవు. అంతే కాకుండా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులు నింపడంతో భూగర్భజలాలు కూడా పెరిగాయి. మోటర్లు చెడిపోకపోవడంతో మరమ్మతుల పనులే లేకుండా పోయాయి. కనీసం ఫీజులు అయినా వేసుకొని బతుకుదాం అంటే అవి కూడా కాలిపోతలేవు. దీన్ని బట్టి చూస్తే ఎంత నాణ్యమైన విద్యుత్ వస్తుందో ఇట్టే అర్థమవుతుంది. 24 గంటలు విద్యుత్ సరఫరాతో రైతులకు ఎంతో మేలు జరిగింది. అందుకు సంతోషపడుతున్నాం.
సరిపోతుందని చెప్తున్నది. అది సాధ్యమేనా..?
మెకానిక్ : కాంగ్రెస్ నాయకులవి తెలివి లేని మాటలు. వ్యవసాయం చేసేవాడికైతే తెలుస్తుంది. మోటర్లు ఏంది.. ట్రాన్స్పార్మర్లు ఏంది..? అనే అవగాహన ఉంటుంది. రాజకీయం కోసం మాట్లాడెటోళ్లకు ఏం తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న విద్యుత్ వ్యవస్థ అంతా 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ, ఎక్కువలో ఎక్కువ అంటే 7.5 హెచ్ మోటర్లు నడిచేంత కెపాసిటీ ఉంటది. రైతులంతా 10 హెచ్‌పీ మోటర్లు పెడితే ఏ ఒక్క ట్రాన్స్ఫార్మర్లు, మోటర్ కూడా తట్టుకోలేవు. మోటర్లు ఆన్ చేసిన వెంటనే కాలిపోతాయి. మళ్లీ మాలాంటోళ్లకు చేతినిండా పని దొరుకుతుంది. రైతులు కష్టాల పాలవుతారు. వ్యవసాయ బోరుబావుల వద్ద 10 హెచ్‌పీ మోటర్లు అవసరం లేదు. కాల్వలకు వ్యవసాయ పొలం దూరంగా ఉంటే వారు ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని కాల్వ నుంచి 10 హెచ్‌పీ మోటర్ పెట్టుకొని నీళ్లు తీసుకుపోవడానికి అవకాశం ఉంటది. ఏం తెల్వకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే రైతులు నమ్మేపరిస్థితుల్లో లేరు. పాత రోజుల్లాగా కరెంటు కోతలు, కాలిపోయే మోటర్లు, ట్రాన్స్ఫార్మర్ల కాలం మళ్లీ రావాలని ఏ ఒక్క రైతు కూడా కోరుకోడు. ముందుచూపుతో మంచి చేస్తున్న సీఎం కేసీఆర్ అంటేనే రైతులు నమ్ముతారు.