‘సారూ నాకు రైతు భరోసా వచ్చిందా..?వస్తే ఎన్ని ఎకరాలకు పైసల్ పడ్డవి.. ఎంత వచ్చింది సారూ’.. అంటూ రైతులు బ్యాంక్ అధికారులను అడుగుతున్నారు. ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పడంతో తమకు పడ్డాయా..? లేదా..? తెలుసుకొనేందుకు రైతులు నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగు తున్నారు. సాయం అందకపోవడంతో
ఏ లెక్కన వేశారని ఓ వైపు రైతులు ప్రశ్ని స్తుంటే.. మరోవైపు సమాధానం చెప్పలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
– మూసాపేట, జూన్ 24
ఓ రైతు (పేరు చెప్పడానికి ఇష్టపడని..)కు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆయనకు రూ.12 వేలు మాత్రమే రైతు భరోసా సాయం అందింది.
మరో రైతుకు ఎకరం భూమి ఉన్నది. అతడికి రూ.3వేలు మాత్రమే వచ్చినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది.. ఇలా చెప్పుకుంటూ పోతే రైతు భరోసా వచ్చిందో? లేదో? అని తెలుసుకోవడానికి రైతులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అడ్డాకుల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఎస్బీఐ ఉన్నాయి. అయితే అడ్డాకుల ఎస్బీఐ ఉదయం తెరవక ముందు రైతులు క్యూ కట్టారు. గంటల తరబడి రైతులు క్యూలో నిలబడాల్సి వచ్చింది. అందులో వృద్ధులు, మహిళలు ఉన్నారు.
ఎస్బీఐ ఉమ్మడి మండలంతోపాటు అటు కొత్తకోట, ఇటు భూత్పూరులోనూ ఎస్బీఐ ఉన్నాయి. దీంతో అడ్డాకులలో మండలంతోపాటు మూసాపేట, పెద్దమందడి, కౌకుంట్ల, భూత్పూర్ మండలంలోని అన్నాసాగర్ గ్రామం వరకు ఖాతాదారులు ఉన్నారు. బ్యాంకులో సుమారుగా 90 వేల మందికిపైగా ఖాతాదారులు ఉన్నారు. బ్యాంకులో 4,500కుపైగా మందికి క్రాప్లోన్లు ఇచ్చారు. 2,600కుపైగా గోల్డ్ లోన్లు ఇచ్చారు. వీటితోపాటు అడ్డాకుల మండలంలోని పలు పరిశ్రమలు ఉండడంతో నిత్యం ఖాతాదారులతో కిటకిటలాడుతున్నది. దీనికి తోడు రైతు భరోసా డబ్బులు పడడంతో రైతులు బ్యాంకుకు వద్దకు పెద్ద ఎత్తున వస్తుండడంతో కిటకిటలాడుతున్నది.
ఎప్పుడొచ్చినా ఇదే పరిస్థితి
అడ్డాకుల ఎస్బీఐ బ్యాంకు చుట్టూ నాలుగు రోజులుగా తిరుగుతు న్నాను. కానీ ఎప్పుడు వచ్చినా క్యూ కట్టాల్సి వస్తుంది. ఎక్కువగా రైతులమే ఉన్నాము. రైతు భరోసా డబ్బులు పడ్డవా..? లేవా? అని ఆందో ళనతోనే బ్యాంకుకు వచ్చి గంటల తరబడి క్యూలో నిలబడి వెళ్తున్నారు. డబ్బులు వచ్చినా సరిగ్గా డబ్బులు వచ్చాయా..? లేదా? ఎంత వచ్చిదో? అన్న భయంతోనే రైతులం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. బ్యాంకులో మరో రెండు కౌంటర్లు పెంచాలి. లేదంటే మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది.
– రఘునందన్‌రెడ్డి, ఖాతాదారుడు, అడ్డాకుల ఎస్బీఐ , మహబూబ్‌నగర్ జిల్లా