రాజోళి, జూన్ 10 : వ్యవసాయ పనులు చేసే రైతులు ఏరువాక పౌర్ణమిని ప్రత్యేకంగా నిర్వహించే పండుగ. కానీ రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ తదితర గ్రామాలకు చెందిన రైతు కుటుంబాలకు ఇథనాల్ కంపెనీ ఓ శనిలా దాపురించింది. ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దు మా భూములను విషపూరితం చేయొద్దన్న పాపానికి చాలా మంది రైతులపై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టారు. మరికొంత మందిని కూడా పోలీసులు అరెస్టు చేస్తారనే సమాచారం ఉండడంతో రైతులు ఎప్పుడు ఏం జరుగుతుందోని ఆందోళనకు గురవుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఈ సారి ఏరువాక పౌర్ణమి నిర్వహించుకోవద్దని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మంగళవారం పెద్ద ధన్వాడలో రైతులు సమావేశమై ఈ సారి ఏరువాక పౌర్ణమిని ఎవరూ చేసుకోవద్దని, మన వాళ్లపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి విడుదల చేయడంతోపాటు ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు అయ్యాక పండుగ చేసుకుందామని సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడు తూ అధికారులు మా గ్రామాల్లో విషపూరిత కంపెనీలకు అనుమతులు రద్దు చేస్తూ పచ్చటి భూ ముల్లో పండిన పంటలు ప్రజల ఆకలి తీర్చేందుకు సహకరించాలని కోరారు. అయితే ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు గ్రా మాల్లో ఏ పండుగను జరుపుకోకూడదని నిర్ణయించినట్లు వారు ప్రకటించారు.