వనపర్తి, మే 7(నమస్తే తెలంగాణ) : మార్కెట్ యార్డుల్లో రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా నాయకుడు వాకిటి శ్రీధర్ పేర్కొన్నారు. గురువారం వనపర్తి మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్ యార్డులో పోసిన వరి, మొక్కజొన్న ధాన్యం నెల రోజులు గడిచినా కొనుగోలు చేసే దిక్కులేదన్నారు.
జిల్లాలో కేవలం 287 కేంద్రాలను మాత్రమే తెరిచి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. 3.50లక్షల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంటే.. కేవలం 10 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారన్నారు. కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రబుత్వం పూర్తిగా విఫలమైం దని విమర్శించారు. రైతులను ఇలాగే ఇబ్బందులకు గురి చేస్తే పార్టీ పరంగా రైతుల పక్షాన పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. యార్డుల్లో ఉన్న ధాన్యం 17శాతం తేమ ఉండాల్సిన క్రమంలో తీవ్రమైన ఎండలకు 9శాతం చూపిస్తున్నాయన్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా యార్డుల్లో రోజుల తరబడి రైతులు నిద్రాహారాలు లేకుండా అవస్థలు పడుతున్నారన్నారు. ఇంత దారుణ పరిస్థితులున్నా ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
ఒకవైపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుంటే.. రైతులకు ఎందుకు పరీక్షలు పెడుతున్నారని ప్రశ్నిం చారు. హమాలీల కొరత ఉందని, బీహార్ హమాలీలను తెచ్చుకొండంటూ రైతులకు చెప్పడం విచారకరమన్నారు. మిల్లుల్లోనూ రైతులకు అదనపు భారం వేస్తూ మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు రఘువర్ధన్రెడ్డి, వెంకటసాగర్, మహేశ్వర్రెడ్డి, రవిప్రకాశ్రెడ్డి, శోభాకృష్ణ, నాగన్న తదితరులు పాల్గొన్నారు.