తిమ్మాజిపేట, ఫిబ్రవరి 7: కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోనే గద్దెనెక్కిందని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు పర్చడంలో తాత్సారం చేస్తున్నారని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆచరణలో అమలు అసాధ్యమన్నారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముం దుంటుందని, ఇది మరోసారి రుజువైందన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ నాయకులు అనేక కోర్రీలు పెడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసాన్ని గుర్తిస్తారన్నారు. ప్రధానంగా ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి అప్పగించడంతో ఇక్కడి రైతాంగం తీరని అన్యాయానికి గురవుతుందన్నారు. పదేండ్లపాటు కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ ముందు చూపుతో కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే అప్పణంగా ప్రాజెక్టులను కేంద్రానికి కట్టబెట్టిందన్నారు.
దీంతో రానున్న రోజుల్లో కృష్ణానదీ పరివాహక జిల్లాలో తాగునీటితోపాటు సాగునీరు అందే పరిస్థితులు లేవన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఐదేండ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు తాగునీరు అందించామని, నేడు మిషన్ భగీరథపై కుట్ర జరుగుతుందన్నారు. గతంలో ఖాళీ బిందెలనేవి కనిపించలేదని, నేడు రోడ్లపై, సోషల్ మీడియాలో ఖాళీ బిందెలు దర్శనమిస్తున్నాయని, గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే పరిస్థితి ఏర్పడిందన్నారు. తాను కేసీఆర్ సైనికుడినని, కేసీఆర్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానన్నారు. పార్టీ మారుతున్నారన్న వదంతులు గత పదేండ్లుగా వస్తున్నాయని, తాను ఎక్కడికి వెళ్లేది లేదని, కేసీఆర్ వెంటనే నడుస్తానని ప్రకటించారు. శివరాత్రి తర్వాత వారంలో రెండుమూడు రోజులు గ్రామాల్లో పర్యటిస్తానని, పదేండ్లుగా తన వెంట ఉన్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జోగుప్రదీప్, ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, మాజీ సర్పంచులు వేణుగోపాల్‌గౌడ్, నర్సింహారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.