మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎట్టకేలకు రేవంత్ ప్రభుత్వం కదిలింది. దోమలపెంట సమీపంలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో కార్మికులు చిక్కుకొన్న ఆరు రోజుల తర్వాత రెస్క్యూ ఆపరేషన్‌లో వేగం పెంచారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు బీఆర్ఎస్ బృందం రావడంతో మంత్రులు, అధికారులు నిర్విరామంగా సహాయక చర్యలు చేపట్టారు. ఎస్ఎల్బీసీ నుంచి డీవాటరింగ్ ప్రారంభించారు. టన్నెల్ బోరు మోటర్‌ను కట్ చేసి బురదను బయటికి తీసే పనుల్లో వేగం పెరిగింది. చిక్కుకుపోయిన టీబీఎం మిషన్‌ను రైల్వే శాఖకు చెందిన భారీ ప్లాస్మా కట్టర్లను తీసుకొచ్చి కట్ చేస్తున్నారు. మరోవైపు పేరుకుపోయిన బురదను లోకో ట్రైన్లో బయటకి తొలగిస్తున్నారు. చెల్లాచెదురుగా పడిఉన్న శిథిలాలు బయటకు తీస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు రాకతో ప్రభుత్వం సొరంగం వద్ద సహాయక చర్యలు పాల్గొంటున్న బృందాలకు స్వయం నిర్ణయాధికారం తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఫలితంగా రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగుతున్నది. ముందుగా 12వ కిలోమీటర్ వద్ద పేరుకుపోయిన బురదను తొలగించి ముందుకు వెళ్తున్నారు. భారీ పంపు మోటర్లతో డీ వాటరింగ్ చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన బృందాలు ఏ పనులు చేయాలో ముందే నిర్ణయించుకొని సొ రం గమార్గంలో వెళ్లి ఆయా పనులు ముగిస్తున్నారు. తొలగిస్తున్న బురద శిథిలాలను ట్రై న్ ద్వారా బయటికి తీసుకువచ్చి అక్కడ నుంచి పైకి తీసుకువచ్చి డంపు చేస్తున్నారు.
సహాయక చర్యలు ఆశాజనకంగా సాగుతూ ఉండడంతో మరికొన్ని గంటల్లోనే చిక్కుకున్న కార్మికుల జాడను తెలుసుకుంటామని ఉన్నతాధికారులు అంటున్నారు. రెండు మూడు రోజుల్లో సహాయక చర్యలు పూర్తి కావచ్చని ఆశాభావంతో ఉండాలి అంటున్నారు. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు బృందాలు పగలు, రాత్రి కష్టపడుతున్నారు. టన్నెల్లో ఉన్న నీటిని భారీ పంపులతో బయటికి తోడుతున్నారు. లోకో ట్రైన్లో అమర్చిన పెద్దపెద్ద కంటైనర్లలో నింపుతున్నారు. సుమారు పదివేల క్యూ బిక్ మీటర్ల బురద నిండి ఉంటుందని అంచనా వేస్తున్నారు. బురద తొలగించడం ద్వా రా టీబీఎం ముందుభాగం చేరుకుంటామని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెబుతున్నాయి. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, ర్యాట్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వే ప్లాస్మా కట్టర్స్, రాబిన్సన్ మైనింగ్ ప్రతినిధులు, మెఘా, నవయుగ, కంపెనీల బృందాలు నిరంతరం సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ సంతోష్ మీడియాకు వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై రెస్క్యూ టీంలు దృష్టి సారించడంతో తొలగింపు ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు చెప్పారు.
ఎస్ఎస్బీసీ వద్ద ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోవడంతో జార్ఖండ్, పంజాబ్, ఒడిశా రాష్ర్టాలకు చెందిన మిగితా కూలీలు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఆరు రోజులుగా ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురాకపోవడంలో ప్రభుత్వం విఫలం కావడంతో భయంతో సొంతూళ్ల బాట పట్టారు. ఇక్కడ దాదాపు 200మందికి పైగా కూలీలు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి పనిచేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నా రోజువారి వేతనం రూ.600 నుంచి రూ.700 మాత్రమే. వీటితోనే వంట వండుకొని తినాలి. తమ కండ్లముందే సహచరులు సొరంగంలో చిక్కుకున్నా బయటకు తీసుకురాలేదని ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్‌లో తమకు ఇదే పరిస్థితి రావొచ్చని ముందుగానే బస్సు ఎక్కి వెళ్లిపోయారు. మరో రెండ్రోజుల్లో మిగతా వారు కూడా వెళ్లిపోయే అవకాశం ఉంది.
రేవంత్ సర్కారు హయాంలో 14 నెలల్లో నాలుగు ప్రాజెక్టులు కూలాయని హరీశ్‌రావు అన్నారు. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయింది.. సుంకిశాల కుప్పకూలింది.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన వట్టెం రిజర్వాయర్ పంప్‌హౌస్ నీట మునిగింది.. ఇప్పుడేమో ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయిందని ధ్వజమెత్తారు. మీ ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఓవైపు శ్రీశైలం ఖాళీ అవుతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర పోతుందని దుయ్యబట్టారు. ఏపీలోని ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని కొల్లగొడుతున్నా.. అడిగే నాథుడే లేడని ధ్వజమెత్తారు. కృష్ణా నీటిని అక్రమంగా తరలిస్తుంటే కేఆర్ఎంబీతో ఎందుకు మాట్లాడం లేదన్నారు. మీకు బాధ్యత లేదా..? అని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్న తాము నిలదీస్తే తప్పా మీకు సోయి లేకుండా పోయిందన్నారు. మాకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు.. ప్రజల సంక్షేమం పట్టదు.. అని విమర్శించారు. అన్నిట్లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్నారు.