మహబూబ్‌నగర్, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్‌నగగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలు భూ దందాలు, సెటిల్మెంట్ తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా ఆ పార్టీ మండల అధ్యక్షులు ఒకరు ఏకంగా ఎమ్మెల్యే సోదరుడు తనను ఇంటికి పిలిపించి అనుచరులను ఉసిగొల్పి బెదిరించాడని ఇచ్చిన ఫిర్యాదు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నది. మరోవైపు పార్టీలో నేతలంతా చాలామంది ఇల్లీగల్ భూదందాలకు దిగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. పోలీస్, రెవెన్యూ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని జడ్చర్ల నియోజకవర్గంలోని భూములన్నీ సెటిల్మెంట్లు చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాతల కాలం నాటి భూములకు కూడా రికార్డులు సృష్టించి కబ్జాలకు పాల్పడుతుండడంతో సామాన్యులు ఎక్కడ భూములు కోల్పోతామని తమ హక్కులన్నింటినీ వీరికి రాసి ఇచ్చేస్తున్నారు. ఫలితంగా జడ్చర్ల నియోజకవర్గంలోని జడ్చర్ల, మిడ్జిల్, నవాబ్‌పేట, రాజాపూర్, బాలానగర్ మండలంలో జోరుగా భూదందాలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ అధికారులు కూడా వీరికి వత్తాసు పలుకుతుండడంతో రాత్రికిరాత్రి రికార్డులు మాయమవుతున్నాయి. భూములను కబ్జా చేస్తున్నారని న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్‌కు వెళితే ఫిర్యాదులు తీసుకోకుండానే తిప్పి పంపుతున్నారు.
ఫలానా వారు ఫిర్యాదు ఇచ్చారని కబ్జాదారులకు సమాచారం చేరవేస్తున్నారు. ఈ వ్యవహారంలో రాజాపూర్ మండలంలో జరిగిన ఓ సెటిల్మెంట్లో మండల కాంగ్రెస్ నాయకులకు.. ఎమ్మెల్యే సోదరుడు దుశ్యంత్‌రెడ్డికి మధ్య వివాదం నెలకొంది. ఈ వ్యవహారంలో తలదూర్చడమే కాకుండా సదరు మండలాధ్యక్షుడికి వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింంది. దీంతో సొంత పార్టీ నేతలు బజారునపడే పరిస్థితి దాపురించిందని పార్టీ సీనియర్లు వాపోతున్నారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డ్డి సోదరుడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు అంటున్నారు.
అనేక చోట్ల ప్రోటోకాల్‌ని పక్కకు పెట్టి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. దీంతో జడ్చర్ల కాంగ్రెస్ నేతల వ్యవహారం రచ్చకెక్కింది. ఎమ్మెల్యే సోదరుడిపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీలో అసమ్మతి గళం విప్పుతున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా పార్టీ కాంగ్రెస్ నేతలకు ఫిర్యాదు చేయడమే కాకుండా.. పీసీసీ చీఫ్‌కు.. పార్టీ వ్యవహారాల ఇన్చార్జికు.. క్రమశిక్షణ సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యేతో తాడోపేడో తేల్చుకుంటామని ఆ పార్టీ నేతనే అంటున్నారు. ఈ వ్యవహారం మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం ఆగ్రహారం- పొట్లంపల్లి గ్రామం శివారులోని సర్వే నెంబర్ 44లో 19 ఎకరాల 27 గుంటల విస్తీర్ణం కలిగిన భూమిని మండల కాంగ్రెస్ నేతలు డీల్ చేస్తున్నారు. పట్టాదారు విజయమోహన్శర్మ, ఫయాజుద్దీన్ మధ్య కేసులు పెండింగ్‌లో ఉన్నది. అయితే మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తెర కృష్ణయ్య పట్టాదారు అయిన విజయమోహన్శర్మతో అన్ని కేసులు పరిష్కరించుకుంటామని చెప్పి జీపీఏ కుదుర్చుకున్నారు. ఈలోపు ఎమ్మెల్యే సోదరుడు దుష్యంత్రెడ్డికి ఏజీపీ హోల్డర్ అయిన వేముల వెంకటేశ్ ఇతరులు కలిసి ఎకరాకు రూ.53 లక్షలకు చొప్పున మాట్లాడుకొన్నారు. దీని బాపతు రూ.70 లక్షలు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయగా రూ.30 లక్షలకు చెక్కుల రూపంలో తీసుకున్నారు. అయితే ఎమ్మెల్యే సోదరుడు ఇచ్చిన రూ.30 లక్షల చెక్కులు బౌన్స్ కావడంతో గొడవ జరిగింది. అయితే ఈ భూమిపై గొడవ పడుతున్న విజయమోహన్శర్మ, ఫయాజుద్దీన్ మధ్య ఎమ్మెల్యే సోదరుడు సయోధ్య కుదిర్చి భూమిని ఇతరులకు విక్రయించారు. ఏజీపీ హోల్డర్లకు తెలియకుండా భూమి కొన్నవాళ్లు రావడంతో అసలు కథ ప్రారంభమైంది.
ఈ వ్యవహారంలో భూమిని అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తుల్లో ఒకరైన రాజాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణయ్యను ఈ నెల 8వ తేదీన సాయంత్రం 5గంటలకు రంగారెడ్డి గూడలోని ఎమ్మెల్యే ఇంటికి పిలిపించారు. ఒక్కడివే రావాలంటూ పంచాయితీ పెట్టి ఈ భూమిని సెటిల్ చేసి ఇతరులకు అమ్మేశాం మీరు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో అడ్డం వస్తే అంతు చూస్తామని బెదిరించారని కత్తెర కృష్ణయ్య ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా శుక్రవారం డీసీసీ అధ్యక్షుడు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆయన సోదరుడు దుశ్యంత్‌రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని పార్టీ పరువును బజారుకీడుస్తున్నారంటూ వివరించారు. ఈ వ్యవహారం డీసీసీ అధ్యక్షుడి దగ్గరికి వెళ్లడం ఆయన కత్తెర కృష్ణయ్య ఫిర్యాదు తీసుకోవడంతో పార్టీలో కలకలం రేగింది.
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన అనిరుధ్‌రెడ్డి బదులు షాడో ఎమ్మెల్యేగా ఉన్న దుష్యంత్‌రెడ్డి నియోజకవర్గం అంతా తిరుగుతూ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఎమ్మెల్యేను పిలిస్తే ఆయన బదులు ఆయన అన్న వచ్చి అన్ని కార్యక్రమాలు చక్క బెడుతుండడంతో పార్టీలో ఎమ్మెల్యే ఎవరు అనే చర్చ జోరుగా కొనసాగుతున్నది. ఆయా మండలాలకు వెళితే కనీసం పార్టీ నాయకులకు కూడా గౌరవం ఇవ్వడం లేదని వాపోతున్నారు. దీంతో ఇతర పార్టీ నేతలు తమను విమర్శిస్తున్నారని తాము ఖండించలేకపోతున్నామని ఆయా మండలాల కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పార్టీలో ఉంటూనే ప్రతిపక్ష నేత లాగా వ్యవహరిస్తుండడం కూడా పార్టీకి నష్టం జరుగుతుందని నాగర్‌కర్నూల్ ఎంపీ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు మల్లు రవికి సైతం ఫిర్యాదు చేశారు. తాను ఏం చేయలేనని ఇది తన నియోజకవర్గం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే అతని సోదరుడి వ్యవహారశైలి వల్ల పార్టీకి తీవ్రనష్టం జరుగుతుందని ఆ పార్టీ నేతలు బహిరంగంగా అంటున్నారు. జడ్చర్ల కాంగ్రెస్‌లో విభేదాలు రచ్చ ఎక్కడం.. సొంత పార్టీ నేతలనే బెదిరించడంతో అసంతృప్తి రేగుతున్నది.
తాజాగా రాజాపూర్ మండలంలో జరిగిన ఓ భూవ్యవహారం ఏకంగా పీసీసీ అధ్యక్షుడి వరకు ఫిర్యాదు వెళ్లిందని చర్చ జరుగుతున్నది. అంతేకాకుండా న్యాయం జరగకపోతే పార్టీ వ్యవహారాల ఇన్చార్జికి కూడా ఎమ్మెల్యే ఆయన సోదరులుపై ఫిర్యాదు చేస్తామని రాజాపూర్ మండల కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తెర కృష్ణయ్యను బెదిరిస్తే అడిగే దిక్కు లేదని.. ఇక తమ పరిస్థితి ఏందని కార్యకర్తలు అంటున్నారు. నియోజకవర్గంలో పోలీస్, రెవెన్యూ యంత్రాంగాన్ని ఆధీనంలో ఉంచుకొని భూ దందాలు చేస్తున్నారని పార్టీ నేతలు ఈ వ్యవహారంపై విచారణ జరిపి పార్టీని కాపాడాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ నేతల వ్యవహారం బజార్లో పడడంతో ఏం జరుగుతుందోనని ఆ పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.