అలంపూర్, మార్చి 31 : ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయ సముదాయం సరికొత్త సొగబులు సంతరించుకోనున్నది. ప్రసాద్ స్కీం పథకంలో ఆలయ సముదాయంలోని 3ఎకరాల 5గుంటల విస్తీర్ణంలో రూ.36కోట్లతో నిర్మిస్తున్న టూరిజం గెస్ట్‌హౌస్‌తో అలంపురం క్షేత్రంలో పర్యాటకంగా అభివృద్ధి చెందనున్నది. నడిగడ్డలో ఇది వరకు ఎన్నడూ లేని విధంగా అత్యధిక నిధులతో నిర్మిస్తున్న గెస్ట్‌హౌస్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పర్యాటక క్షేత్రాల్లో రాష్ట్రంలోనే అలంపూరు అగ్రగామిగా నిలువనున్నది.
ప్రసాద్ స్కీం కింద 21 గదులతో అధునాతనమైన మూడంతస్తుల భవనం, ఒక ఫ్లోర్లో కల్యాణ మండపం, ఇంకో ఫ్లోర్లో ఆర్ట్ గ్యాలరీ, మరో ఫ్లోర్లో మల్టీ మీడియా కాన్ఫరెన్స్ హాల్, 14 దుకాణాలతో షాపింగ్ కాంప్లెక్స్, కల్చరల్ యాక్టివిటీస్ కోసం సుమారు 400 మంది ప్రేక్షకులకు అనుగుణంగా మినీ హాల్, పర్యాటకుల కోసం తుంగభద్రానదిలో బోటింగ్ సౌకర్యం, మినీ బస్టాండ్‌తోపాటు జోగుళాంబ, సంగమేశ్వర ఆలయాలు, బస్టాండ్, ప్రసాద్ స్కీం గెస్ట్‌హౌస్ వద్ద మొత్తం ఏడు హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు.
కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరంలో ప్రసాద్ స్కీం పథకం కింద రూ.37కోట్లు, 2022లో రామప్ప ఆలయానికి రూ.62కోట్లు, 2023లో భద్రాచలం ఆలయానికి రూ.42కోట్లు నిధులు మంజూరు చేసింది. అలంపూర్‌కు ప్రసాద్ స్కీం పనులు 2021లో రూ.36.73కోట్లు నిధులు మంజూరు కాగా, మే 2021లో టెండర్లు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 2021లో కేపీసీ కన్స్ట్రక్షన్స్ కంపెనీ వారు పనులు ప్రారంభించారు. డిసెంబర్ 2023 వరకు పూర్తి కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యం జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. నెలాఖరు వరకు పనులన్నీ పూర్తి చేసి ప్రారంభించనున్నట్లు పర్యాటక శాఖ డీఈ ధన్‌రాజ్, సైట్ ఇంజినీర్ రామకృష్ణ తెలిపారు.