గద్వాల, ఫిబ్రవరి 2 : జోగుళాంబ గద్వాల జిల్లా మున్సిపాలిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు అసలైన కాంగ్రెస్ నేతలకు మధ్య టికెట్ల యుద్ధం మొదలైంది. ఇక్కడ బీఫాంల విషయంలో అటు ఎమ్మెల్యే, ఇటు సరిత మధ్య లొల్లి నడుస్తున్నది. ఇటీవల స్పీకర్ కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేకు క్లీన్ చీట్ ఇచ్చి బీఆర్ఎస్ లోనే ఉన్నాడంటూ తేల్చిపారేశారు. ఇక మున్సిపాలిటీ ఎన్నికలను తనకు అనుకూలంగా మార్చుకున్న ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొని ఓటేయాలని చెబుతూ తానే దగ్గరుండి టికెట్లు పంచుతున్నారు. దీంతో కాంగ్రెస్‌లో మరో వర్గమైన సరితా తిరుపతయ్యకు మొండి చెయ్యి చూపించారు.
ఆగ్రహించిన ఆమె వర్గీయులు చాలామంది బీఆర్ఎస్, బీజేపీలోకి చేరిపోయారు. ఇక ఈ వ్యవహారం టీపీసీసీ వద్దకు చేరింది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చెరి సగం సీట్లు పంచుకోవా లని చెప్పి స్థానిక కాంగ్రెస్ నేతకు ఒకరికి అప్ప గించింది. అయితే వీరిద్దరూ ఏకమై 37వార్డులు ఉన్న గద్వాలలో సరిత వర్గానికి ఒకే ఒక టికెట్ కేటాయించారు. ఈ లొల్లి మళ్లీ మొదటికి వచ్చింది. ఇటు ఎమ్మెల్యే, అటు సరిత వర్గీయులు ఎవరికి వారు కాంగ్రెస్ నుంచి పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఉపసంహరణ గడువుకు ఒకేరోజు సమయం ఉండడంతో బరిలో నిలిచిన అభ్యర్థులకు బీఫాంలు ఇచ్చే ప్రక్రియ మిగిలింది. అయితే రెండు వర్గాల మధ్య ఉన్న విబేధాలు తొలగించి ఇద్దరిని సముదాయించాలని అలంపూర్ మాజీ ఎమ్మెల్యేకు అధిష్టానం సూచించినట్లు తెలిసింది.
దీంతో రంగంలోకి దిగిన సంపత్‌కుమార్ గద్వాల ఎమ్మెల్యేతో బీఫాంల విషయంలో ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు ఎమ్మెల్యే ఇంట్లో అంతర్గత చర్చలు నిర్వహించినా కొలిక్కి రాలేదు. రాత్రికి రాత్రి ఏమి జరిగిందో తెలియదు కానీ.. సోమవారం ఉదయం గద్వాల ఎమ్మెల్యే కొత్త హౌసింగ్ బోర్డులో ఉన్న సంపత్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఎమ్మెల్యేతోపాటు సరిత తిరుపతయ్య, సంపత్, అధిష్టానం నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నట్లు తెలిసింది. పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నట్లు సమాచారం. బీఫాంల విషయంలో కొంత అనిశ్చితి నెలకొనగా ఎమ్మెల్యే వెళ్లిపోయినట్లు తెలిసింది. సమావేశం అనంతరం సంపత్ మాట్లాడుతూ పార్టీలో ఎలాంటి అసమ్మతి లేకుండా అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయని, బీఫాంల విషయంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా గద్వాల కాంగ్రెస్‌లో ఉన్న రెండు వర్గాలకు సమన్యాయం చేయడానికి చర్చలు చేస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం.
రాజధానికి చేరిన టికెట్ల యుద్ధం
గద్వాల మున్సిపాలిటీకి చెందిన బీఫాంల రగడ రాజధానికి చేరింది. దీంతో పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకున్నట్లు చేసుకొని ఇద్దరికీ సమన్యాయం చేయాలని సూచించినట్లు తెలిసింది. ఉదయం జూమ్ మీటింగ్ అనంతరం సంపత్ మధ్యాహ్నం సరిత ఇంటికి వెళ్లడం, ఆ తర్వాత ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడంతో బీఫాంలు ఏ వర్గానికి వస్తాయో అన్న ఉత్కంఠ నెలకొన్నది. అయితే సరిత సగం తమ వర్గానికే కావాలని పట్టుబట్టినట్లు తెలిసింది. అయితే 14వ వార్డు బీఫాం మాత్రమే ఆమె వర్గానికి కేటాయించినట్లు తెలిసింది. మరో ఐదు నుంచి 10 బీఫాంలు సరిత కోరినట్లు బయట ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. సాయంత్రం వరకు ఎటు తేలనట్లు సమాచారం. దీంతో అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో అధిష్టానం ఉంది.