నాగర్కర్నూల్, మే 20 (నమస్తే తెలంగాణ) : వానకాలం సాగుకు వ్యవసాయశాఖ సన్నద్ధమవుతున్నది. జిల్లాలో ఈ సీజన్లో పండించే పంటలపై పూర్తిస్థాయి నివేదికను వ్యవసాయశాఖ అధికారులు రూపొందించారు. ఎప్పటిలాగే కందనూలు రైతులు పత్తి పంటకే జై కొట్టనుండగా ఆ తర్వాతి స్థానంలో వరి ఉన్నది. జిల్లాలో మొత్తం 4.73లక్షల ఎకరాల్లో ఆయా పంటలను సాగు చేయనుండగా అవసరమైన ఎరువులు, విత్తనాలను కూడా అందుబాటులో ఉంచేలా వ్యవసాయశాఖ ప్రణాళికలు రూపొందించింది.
వానకాలం పంటల ప్రణాళికను వ్యవసాయ శాఖ సి ద్ధం చేసింది. జిల్లాలో 20మండలాల వారీగా రైతులు సాగు చేసే పంటల తుది అంచనాను రూపొందించింది. ఈసారి వానలు సకాలంలో కురుస్తాయన్న వాతావరణ శాఖ సమాచారంతో అన్నదాతలు సాగుకు సమాయత్తమవుతున్నారు. జిల్లా రైతులు ఎప్పటిలాగే పత్తి పంటకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సాధారణ పత్తి సాగు అంచనా 3.60లక్షలు ఉండగా గతేడాది 2.35లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈసారి 2.73లక్షల ఎకరాల్లో సా గు కావచ్చని అధికారులు భావిస్తున్నారు. వరి సాధారణ సాగు అంచనా 89వేల ఎకరాలుండగా గతేడాది 1.48 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. ఈసారి 1.40లక్షల ఎకరాల్లో సాగు చేస్తారని తెలుస్తున్నది. పత్తి సాధారణ సా గుతో పోలిస్తే వరి సాగు సాధారణానికి మించి చేసే పరిస్థితులున్నాయి. ఇప్పటికే యాసంగి ధాన్యం అమ్మకాలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఎండలు తీవ్రం గా ఉండడంతో రైతులు కొంచెం ఆలస్యంగా దుక్కులు చేసుకున్నారు. కాగా వర్షాలు సకాలంలో కురుస్తాయన్న సమాచారంతో ముందస్తు సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ఒకట్రెండు వర్షాలకు పంటలు సాగు చేసుకోవద్దని, భూమిలో వేడి తగ్గి చల్లబడ్డాకే విత్తనాలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమం లో జూన్ రెండోవారం నాటికి వరి నాట్లు, పత్తి విత్తనా లు నాటేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు కూడా గ్రామస్థాయిలో రైతులకు సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. గతేడాది వర్షాభావంతో చెరువులు, కుంటల్లో నీళ్లు లేకపోవడం, భూగర్భ జలాలు అడుగంటాయి. ఈనేపథ్యంలో ప్రస్తుతం వర్షా లు భారీగా కురిస్తేనే ఈ సీజన్ గట్టెక్కే పరిస్థితులు ఉన్నా యి. ఈమేరకు ఉన్న పరిస్థితులను బట్టి సాగు అంచనా ను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి పంపించింది. జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు వస్తాయని చెబుతుండ గా.. 7న మృగశిర కార్తె ప్రవేశిస్తుంది. ఆ తర్వాతే వాన లు కురుస్తాయని రైతులు నమ్ముతారు. ఇదిలా ఉండగా 5.47 లక్షల సాధరాణ సాగుకు గానూ ఈ ఏడాది వానకాలంలో 4.73 లక్షల ఎకరాల్లో సాగు ఉండనున్నట్లుగా అధికారులు అంచనాలను సిద్ధం చేశారు. దీనికి సరిపడా విత్తనాలు, ఎరువులను కూడా అందుబాటులో ఉంచనున్నది. పత్తి, వరి, జొన్న, మొక్కజొన్న వంటి పంటల సాగుకు అవసరమైన 9లక్షల క్వింటాళ్ల విత్తనాలు, యూ రియా, డీఏపీ, ఎంవోపీ, ఎస్ఎస్పీ, కాంప్లెక్స్ వంటి 1.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల ప్రణాళికను కూడా తయారు చేసింది.
ఈ ఏడాది 4.73లక్షల ఎకరాల్లో పత్తి, వరి, వేరుశనగ, కందులు, జొన్న, ఇతర పంటలను సాగు చే యనున్నారు. ఇందుకో సం అవసరమైన 9లక్షల క్వింటాళ్ల విత్తనాలు, 1.30 లక్షల మెట్రిక్ ట న్నుల ఎరువులను సిద్ధం గా ఉంచాం. తొలకరి వా నలు కురిసి భూమిలో వేడి తగ్గి, తేమ శాతం పెరిగాకే విత్తనాలు నాటుకోవాలి. వేసవి దుక్కులు దున్నుకోవాలి. భూసార పరీక్షలు చేయించుకుంటే బాగుంటుంది. జిల్లాలోని రైతులు పత్తి, వరి పంటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈసారి సాధారణ సాగుకు మించి వరి సాగయ్యే అవకాశం ఉన్నది.