గద్వాల, జూన్ 9 : పచ్చని పొలాలను నాశనం చేసే ఇథనాలు ఫ్యాక్టరీ మాకొద్దని ఆందోళన చేసిన ఘటనలో బడుగు, బక్కచిక్కిన రైతులే సమిధలయ్యారు. పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టే ఈ ఫ్యాక్టరిని ఎట్టిపరిస్థితుల్లో రానివ్వమని దాని జీవోలు రద్దు చేయించే వరకు పోరాడుతామని చెప్పిన పాలకులు అడ్రస్ లేకుండా పోయారు. ఇథనాలు ఫ్యాక్టరికీ వ్యతిరేకంగా శాంతియుత రిలే నిరాహార దీక్షలు చేపట్టిన రైతుల వద్దకు అధికార, ప్రతి పక్ష నాయకులు వచ్చి తీయని మాటలు చెప్పి దీక్షలు విరవింప చేసిన నాయకులు, ఫ్యాక్టరీ పనులు కంపెనీ యాజమాన్యం ప్రారంభించే సమయంలో దానిని నిలువరించే ప్రయత్నం చేయలేదు.
ప్రజా ప్రతినిధులను నమ్ముకున్న గ్రామస్తులు వారు పట్టించుకోకపోవడంతో విధి లేని పరిస్థితిలో పోరుబాట పట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఫ్యాక్టరీ వద్దని ఆందోళన చేసిన 40మంది బక్కరైతులపై కక్ష కట్టి ఖాకీలు 17సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 12మందిని జైలుకు పంపి ఫ్యాక్టరీ జోలికి వస్తే మిగితా వారికి ఇదే గతి పడుతుందనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీసులు. అయినా ప్రాణాలు పణంగా పెట్టి ఫ్యాక్టరీ నిర్మాణం అడ్డుకుంటామని ఊరంతా ఏకమై కంపెనీ యాజమాన్యం పనులు చేయకుండా అడ్డుకున్నది. అడ్డుకున్న వారిని అరెస్ట్ చేసి నేటికి ఐదు రోజులు కావస్తున్నా వారిగురించి పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ప్రజా ప్రతినిధుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేసున్నారు.తమ గోడు వెల్లబోసుకున్నా పట్టించుకునేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనలో పాల్గొనని వారిపై కేసులు
నాకు వ్యతిరేకంగా మాట్లాడుతారా నాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారో చూడండి అని ఆ మాజీ ఎమ్మెల్యే బడుగు రైతులు, యువకులపై ఖాకీలతో కేసులు నమోదు చేయించి తమ ప్రతాపం చూయించడంతోపాటు ఆందోళనలో లేని వారిపై కూడా కేసులు నమోదు చేయడంలో కీలకపాత్ర పోషించారు. అందుకు ఆగ్రహించిన పెద్దధన్వాడ గ్రామస్తులు సోమవారం కలెక్టర్ సంతోష్‌ను కలిసి ఆందోళనలో లేని వారిపై రాజోళి ఎస్సై కేసులు నమోదు చేశాడని విచారణ జరిపి వారిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
రాజోళి ఎస్సై ఓ మాజీ ప్రజాప్రతినిధి మాటలు విని పత్రిక ఎడిటర్, అసిస్టెంట్ జైలర్, టీచర్‌పై కేసులు నమోదు చేయడాన్ని గ్రామస్తులు తప్పు బడుతున్నారు. ఆందోళన జరిగిన సమయంలో వారు అక్కడ లేకపోవడం మాజీ ఎమ్మెల్యే కక్ష పూరితంగా వారిపై కేసులు నమోదు చేయించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆందోళనలో లేని వారిపై కేసులు నమోదు చేయడం వారు మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో ప్రస్తుతం పోలీసులకు ఏమి చేయాలో తోచడం లేదు..
పోలీసులకు భయపడి గ్రామాల్లోకి రాని రైతులు
ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఏరువాక వస్తున్న ఈ తరుణంలో రైతులు విత్తనాలు విత్తు కోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఆందోళనలో పాల్గొన్న రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు చేసుకోవడానికి వస్తే పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని భయపడి రైతులు గ్రామాల్లోకి రాకుండా ఉంటున్నారు. ఒక వేళ వస్తే అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని అటువంటి సమయంలో తాము విత్తనాలు విత్తుకోవడానికి ఆలస్యమవుతుందని భావించి రైతులు భయంతో గ్రామాల్లోకి రావడం లేదు. దీంతో పాటు ఇథనాలు ఫ్యాక్టరికీ వ్యతిరేకంగా పోరాడిన గ్రామాల చుట్టూ పోలీస్ అధికారులు నిఘా ఉంచడంతో రైతులు గ్రామాల్లోకి రావడం లేదు. ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి అరెస్టులు ఇంతటితో ఆపాలని పెద్దధన్వాడ గ్రామస్తులతోపాటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
ఎస్సైపై చర్యలు తీసుకోవాలి
రాజోళి ఎస్సై ఆందోళనలో పాల్గొనని రైతులు, యువకులు, ఉద్యోగులపై తప్పుడు కేసులు నమోదు చేశాడని విచారణ జరిపి తప్పుడు కేసులు నమోదు చేసిన రాజోళి ఎస్సైపై శాఖ పరమైన చర్యలు తీసుకొని అక్కడి నుంచి అతనిని బదిలీ చేయాలని సోమవారం పెద్దధన్వాడ గ్రామస్తులతో పాటు అఖిల పక్షం నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అంద జేశారు. ఆందోళనతో సంబంధం లేని జనంసాక్షి ఎడిటర్ ముజిబూర్ రెహమాన్, నాగర్‌కర్నూల్ సబ్‌జైలర్ నాగరాజు, ప్రభుత్వ ఉద్యోగి కేఎంఎస్ శ్రావణ్‌కుమార్‌తోపాటు తన చెల్లిని తీసుకరావడానికి వెళ్తున్న మనోహార్, తన బిడ్డకు కల్యాణ లక్ష్మికోసం బోనఫైడ్ తేవడానికి వెళ్తున్న లక్ష్మన్న, గాయాలు తగిలిన మహిళను దవాఖాన తీసుకెళ్తున్న నర్సింహులు, భరత్‌కుమార్, సూర్యప్రకాశ్ ఇలా చాలా మంది ఆందోళనలో పాల్గొనని వారిపై మాజీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఎస్సై తప్పుడు కేసులు నమోదు చేశారని వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై కూడా 17సెక్షన్ల కింద కేసులు నమోదు చేయలేదు.. కాని ఇప్పుడు ఆందోళనలో పాల్గొన్న వారిపై ఇన్ని కేసులు పోలీసులు నమోదు చేయడం రాజకీయ ప్రోద్బలమే అని గ్రామస్తులు, అఖిల పక్షం నాయకులు ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఫ్యాక్టరీ యాజమాన్యం యుద్ధ వాతావరణం కల్పించేలా రాత్రికి రాత్రే ఫ్యాక్టరీ పనులు చేపట్టడానికి పూనుకోవడంతో ప్రజలు ఆందోళన చెంది ఫ్యాక్టరీకి సంబంధించి ఆస్తులు ధ్వంసం చేశారు..తప్పా ప్రజలు ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలను రెచ్చ గొట్టడంలో ఎస్సై ప్రధాన పాత్ర పోషించాడని వారు కలెక్టర్‌కు చెప్పారు.
ఫ్యాక్టరీ మాకు అవసరం లేదు
ప్రస్తుతం మా పొలాల్లో మంచి పంటలు పండుతున్నాయి. పంటలు పండే పొలాల వద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే దాని వల్ల మా పంటలు నాశనమయ్యే అవకాశం ఉంది. పంటలు పండకపోతే మేము ఎలా బతకాలి, బంగారు పంటలు పండే పొలాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలసలు పోవాలా. 12గ్రామాల ప్రజలు ఫ్యాక్టరి వద్దంటే ఒక్కరి కోసం అధికారులు, పోలీసులు ఎందుకు ఆరాట పడుతున్నారు. ప్రాణాలు పోయినా సరే ఫ్యాక్టరీ నిర్మాణం అడ్డుకుంటాం.
– రాములమ్మ,పెద్ద ధన్వాడ, జోగుళాంబ గద్వాల జిల్లా
నాకొడుకు ప్రమేయం లేదు
ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని ప్రజలు, రైతులు చేసిన ఆందోళనలో నా కొడుకు పాల్గొనలేదు. అయినా ఓ ప్రజాప్రతినిధి ఆదేశంతో రాజోళి ఎస్సై నాకొడుకుపై తప్పుడు కేసు నమోదు చేశాడు. పోలీసులు కక్ష్యసాధి ంపు చర్యలు మానుకోవాలి. ప్రజలు, రైతులు ఫ్యాక్టరీ వద్దంటే బలవంతంగా ఎలా ఏర్పాటు చేస్తారు. నాకొడుకు నిర్దోషి. తప్పుడు కేసు నమోదు చేసిన రాజోళి ఎస్సై చర్యలు తీసుకోవాలి. మమ్మల్ని వేధింపులకు గురిచేస్తున్న ఎస్సైపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.
-నాగేంద్రం, జైలర్ నాగరాజు తండ్రి, పెద్దధన్వాడ, జోగుళాంబ గద్వాల
చెల్లిని తీసుకొస్తుంటే అరెస్ట్ చేశారు
ఆందోళనకు నా కొడుకుకు ఎటువంటి సంబంధం లేదు. తన చెల్లిని ఊరి నుంచి తీసుకరావడానికి బైక్‌పై వెళ్తుంటే పోలీసులు అరెస్ట్ చేసి డీసీఎం ఎక్కించారు. ఇలా నా కొడుకు లాంటి అమాయకులైన చాలా మంది యువకులపై పోలీసులు లాఠీ చార్జి చేయడంతోపాటు కేసులు నమోదు చేశారు. తప్పుడు కేసులు నమోదు చేసిన రాజోళి ఎస్సైపై చర్యలు తీసుకోవాలి.
-మరియమ్మ, మనోహార్ తల్లి, పెద్దధన్వాడ, జోగుళాంబ గద్వాల